
మోదీ - ట్రంప్ సమావేశం బంగ్లాదేశ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ట్రంప్ దృష్టిని ఆకర్షించేందుకే యూనస్ ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హాంట్ ను ప్రారంభించిందని విశ్లేషణ
ప్రణయ్ శర్మ
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య త్వరలో సమావేశం జరగబోతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరుగుతుందని ఢాకాలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ పేరు మీద ఉన్న మ్యూజియంపై కొన్ని అల్లరి మూకలు దాడి చేసి కాల్చివేయడం, విచ్చలవిడిగా చెలరేగుతున్న హింస, ఇస్లామిక్ శక్తులు బలం ఫుంజుకోవడం లాంటి చర్యలు, మధ్యంతర ప్రభుత్వాధినేత యూనస్ ప్రవర్తన పై ఇద్దరి దేశాధినేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ లో శాంతిభద్రతలు విఫలం కావడంతో సాధారణ జనజీవనానికి కలుగుతున్న ఇబ్బందులు, మూకదాడులు, మైనారిటీలపై భౌతిక దాడులు, హత్యలు జరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ మూకదాడుల సంస్కృతి ఎక్కువ కావడంతో ప్రభుత్వం వెంటనే ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ పేరుతో సైనిక చర్యను చేపట్టింది. రాజధాని ఢాకాతో పాటు ఇతర కీలక నగరాలలో ఉన్న దేశ విద్రోహ, క్రిమినల్ శక్తులను ఏరివేయబోతున్నట్లు ప్రకటించింది.
అయితే పరిశీలకులు మాత్రం కేవలం మోదీ - ట్రంప్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తనపై దృష్టి పడకుండా ఉండేందుకు అలాగే, ట్రంప్ ను ఇంప్రెస్ చేసేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు భావిస్తున్నారు. అమెరికా విదేశీ సాయాన్ని నిలిపివేసింది. దీని ద్వారానే బంగ్లాలో ఎక్కువ మొత్తంలో విదేశీ నిధులు అందుతున్నాయి. వీటిని సాధించడానికే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇంకా స్థిరపడని బంగ్లా ఆర్థిక భవితవ్యం..
బంగ్లా ప్రధానిగా ఉన్న అప్పటి పాలకురాలు షేక్ హసీనాను బలవంతంగా దింపిన అల్లరిమూకలు తరువాత మధ్యంతరం ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పటి వరకూ అంటే ఆరు నెలలుగా దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. అల్లరిమూకలు లూటీలకు పాల్పడుతున్నారు.
ద్రవ్యల్భణం పదిశాతం దాటింది. ఆహారధరలు, ఇతర నిత్యావసరాల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరు. ప్రతి నగరంలో పరిస్థితులు ఏ మాత్రం బాగా లేవు.
దేశ రాజధాని నగరమైన ఢాకాలోనే మహిళలకు భద్రత లేకుండా పోయిందని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బంగ్లాదేశ్ ఎక్కువగా నోటీసుల్లోకి వస్తోంది. ఈ మధ్య అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి.
ఐఎంఎఫ్, పశ్చిమ దేశాలపైనే ఆధారం..
కోవిడ్ తరువాత బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ప్రస్తుతం దాని పరిస్థితిని మెరుగుపరచడానికి 4.7 బిలియన్ డాలర్ల లోన్ ను ఐఎంఎఫ్ ను కోరింది. ఇది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. అలాగే ఇతర అభివృద్ది కార్యక్రమాల కోసం పశ్చిమ దేశాల దాతలపై ఆధారపడి ఉంది.
ప్రస్తుతం ట్రంప్ అధికారంలోకి రాగానే బంగ్లాదేశ్ కు అందుతున్న సహకారాన్ని నిలిపివేశారు. అలాగే ఇక్కడ తయారయ్యే గార్మెంట్ వస్తువులకు యూఎస్ పెద్ద మార్కెట్. జో బైడెన్ ప్రభుత్వం, డెమెక్రాటిక్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్న యూనస్ కు ట్రంప్ నుంచి అలాంటి సహకారం అందకపోవచ్చు.
ట్రంప్ ఎన్నిక కావడాని కంటే ముందే బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులపై అనేక సందర్బాల్లో లేవనెత్తారు. ప్రస్తుతం తన సన్నిహిత మిత్రుడు, భారత ప్రధాని అయిన మోదీ తో సమావేశం కాబోతున్నారు. దాంతో యూనస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో చేస్తున్నామనే భావన కల్పించడానికి ఈ విధంగా ఓ ఆపరేషన్ ప్రారంభించిందని అంటున్నారు.
తన మొదటి పాలన కాలంలో సౌత్ ఆసియా( భారత ఉపఖండం) కు సంబంధించి విధానాలను న్యూఢిల్లీ సలహాతోనే తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అదే కొనసాగాలని లేదు కానీ చైనా ను కౌంటర్ చేయడానికి భారత్ నే మంచి ఎంపికగా భావిస్తున్నారు. కాబట్టి బంగ్లాదేశ్ విషయంలో ఇక్కడ మోదీ మాటకు విలువ ఉందని చెప్పవచ్చు.
ఇస్లామిక్ శక్తుల భీభత్సం..
హసీనాను బలవంతంగా గద్దె దింపిన విద్యార్థులు తరువాత మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఇక్కడ ఇస్లామిక్ శక్తులు మెల్లగా తమ పనిని ప్రారంభించాయి. ఇప్పుడు ఆ శక్తులే పాలన చేస్తున్నాయి. పాలసీల వంటి నిర్ణయాలలో వారిదే కీలకపాత్ర.
హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత విద్యార్థుల ఉద్యమానికి నాయకత్వం వహించిన ముగ్గురు విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వంలో సలహదారులుగా ఉంటున్నారు. వీరితో పాటు జమాత్ ఏ ఇస్లామ్ కూడా ప్రభుత్వంలో భాగంగా ఉంది.
ప్రస్తుతం ఈ ఇస్లామిక్ శక్తులు అంటీ హసీనా సెంటీమెంట్ ను ఉపయోగించుకుంటున్నాయి. అలాగే మిగిలిన కొందరి అవామీ లీగ్ నాయకులు, వారి ఆస్తులపై దాడులకు తెగబడుతున్నాయి.
కొత్త రాజ్యాంగం కావాలంటున్న ఇస్లామిస్టులు..
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇస్లామిక్ శక్తులు తమకు 1972 లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం కావాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఉన్న సెక్యూలర్ శక్తిని బలంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే 1971 నాటి స్వాతంత్య్రానికి గుర్తుగా ఉన్న అన్నింటిని ధ్వంసం చేస్తున్నారు. తమకు ఇస్లామిక్ పాలన కావాలని కోరుతున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న విధ్వంసకారులు వెనక మధ్యంతర ప్రభుత్వాధినేత అయినా మహ్మద్ యూనస్ అలాగే ఆయన ప్రభుత్వంలోని వ్యక్తులు ఉన్నారని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు.
మధ్యంతర ప్రభుత్వ సహకారం..
దేశంలోని వివిధ ప్రాంతాలలో అవామీ లీగ్ నాయకుల ఆస్థుల విధ్వంసం వెనక తాత్కాలిక ప్రభుత్వంలోని నేతలు ఉన్నారని సాక్ష్యంగా.. దాడి చేసిన ఎవరిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడాన్ని చూపిస్తున్నారు.
దేశంలో నేరస్థులను నిర్ములించడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం కేవలం అవామీ లీగ్ మద్ధతుదారులను అణచివేయడానికే జరుగుతున్న ప్రయత్నంగా కొంతమంది నేతలు భావిస్తున్నారు.
దేశంలో నేరస్థులను విచ్చలవిడిగా చెలరేగిపోతున్నా కూడా యూనస్ నోరు విప్పకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. దీనికి ఆయన ఆమోదం ఉందా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
భారత్ - బంగ్లా సంబంధాలు..
హసీనా నిష్క్రమణ తరువాత భారత్ - బంగ్లా మధ్య సంబంధాలు దిగజారాయి. ఢాకాలో తరుచుగా భారత వ్యతిరేక చర్యలు కనిపిస్తున్నాయి. దేశంలో ఉన్న కొన్ని తీవ్రవాద సంస్థలు ఉపయోగించే భాషే అక్కడ వినిపిస్తోంది. వీరితో అవి జతకట్టాయా అనే అనుమానం కలుగుతోంది.
రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీని పోయిన సంవత్సరం ఢాకా కు పంపారు. బంగ్లా అధికారులు ఆయన హృదయపూర్వక స్వాగతం పలికినప్పటికీ వరుస సంఘటనలు కొన్ని ఉద్రిక్తతలను పెంచింది.
ఢాకాలో ఇస్లామిస్టుల పెరుగుదల పట్ల దేశం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. బంగ్లాదేశ్ తీవ్రవాదీకరణ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అస్థిరతకు దారి తీస్తుందని ఆందోళనలు ఉన్నాయి.
అంతేకాకుండా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం చేయడానికి పెట్టుబడుల గురించి భారత్ ఆందోళన చెందుతోంది. యూనస్ సూచించినట్లుగా బంగ్లాదేశ్ లో ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరగవచ్చు. ఎన్నికైన ప్రభుత్వం బీఎన్పీ నేతృత్వంలో ఉంటే .. రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాన్ని నిలబెట్టడానికి సాయపడవచ్చు.
కానీ మోదీ - ట్రంప్ సమావేశం ఫలితంగా బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎలా మారతాయో, దేశం తన సరిహద్దులను భద్రపరచుకోవడానికి, ఈ ప్రాంతాన్ని స్థిరికరించడంలో ఎలాంటి పాత్ర ను తీసుకుంటుందో మున్ముందు తెలుస్తుంది.
Next Story