బంగ్లాదేశ్‌లో ఏం జరగబోతుంది? అధికార పగ్గాలు చేపట్టేదెవరు?
x

బంగ్లాదేశ్‌లో ఏం జరగబోతుంది? అధికార పగ్గాలు చేపట్టేదెవరు?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు రిజర్వేషన్ల అంశమే కారణమా? లేక మరేమైనా కారణాలున్నాయా? షేక్ హసీనా తర్వాత అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఎవరికి ఉంది?


బంగ్లాదేశ్‌లో రాజకీయ భూకంపం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం వీడేలా చేసింది. గత 15 సంవత్సరాలుగా దేశాన్ని ఉక్కు పిడికిలితో పాలించిన హసీనా..దేశంలో నియంత్రించలేని ఆందోళనలతో చివరకు బంగ్లాను వీడి భారత్‌కు చేరుకున్నారు.

అసలు రిజర్వేషన్ల గొడవేంటి?

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు 1971 లిబరేషన్ వార్‌లో పాల్గొన్న సైనికుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30% కోటా కల్పించాలని 1972లో హసీనా తండ్రి, ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసింది. అయితే 2018 అక్టోబర్‌లో విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.. షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే ఈ కోటాను పునరుద్ధరించాలని 2024 జూన్‌లో హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 93 శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 5 శాతం, మైనార్టీలకు 1 శాతం, వికలాంగులు, థర్డ్ జెండర్‌లకు 1 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలో నిరసనలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యాయి. దీంతో విద్యార్థుల ఆందోళన కారులపై హసీనా ఉక్కుపాదం మోపింది. సుమారు 300 మంది నిరసనకారులు మరణించారు. దీంతో ఆందోళనకారులు దృష్టి రిజర్వేషన్లు నుంచి హసీనాను గద్దె దింపడం వైపు మళ్లింది.

అంతర్లీనంగా ఎన్నో సమస్యలు..

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై వాయిస్ ఆఫ్ అమెరికా బంగ్లా సర్వీస్ మేనేజింగ్ ఎడిటర్ సబీర్ ముస్తఫా ఇలా అన్నారు. " రిజర్వేషన్ల కోటా ఉద్యమం కేవలం స్పార్క్ మాత్రమే. అంతర్లీనంగా చాలా సమస్యలు ఉన్నాయి. అవామీ లీగ్ మూడు సార్వత్రిక ఎన్నికలకు అధ్యక్షత వహించినప్పుడు గత దశాబ్ద కాలంగా ఆగ్రహావేశాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఓటు హక్కు కోల్పోయారని భావించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యంగా హసీనాను అహంకారంగా చూడటం ప్రారంభించారు’’ అని చెప్పారు.

హసీనాను గద్దె దించడమే లక్ష్యంగా..

దేశంలో ఉన్న యువతలో దాదాపు 40 శాతం మంది నిరుద్యోగులే. వారి భవిష్యత్తు గురించి హసీనా సర్కారు పట్టించుకోలేదు. హసీనా ఆదేశాలతో రెచ్చపోయిన పోలీసులు.. విద్యార్థులు, నిరుద్యోగులను చితకబాదారు. ఒక్కరోజులోనే వంద మంది చనిపోయారు. దీంతో నిరుద్యోగులు కోటా సమస్యను పక్కన పెట్టి, హసీనాను గద్దె దించడమే లక్ష్యంగా చేసుకున్నారు.

“COVID-19 మహమ్మారి తర్వాత..పెరిగిన ఆర్థిక కష్టాలు దేశ ప్రజలను చాలా ఇబ్బందిపెట్టాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు అవినీతి పాల్పడడం మరింత ఎక్కువైంది. ఈ పరిణామాలు వారిని ఆందోళన బాట పట్టించాయి’’ అని ముస్తఫా పేర్కొన్నారు.

హసీనా ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తికి కారణం అవినీతికి ఆమె అడ్డుకట్టవేయకపోవడమేనని లండన్‌లో ఉన్న సీనియర్ స్వతంత్ర బంగ్లాదేశ్ జర్నలిస్ట్ కమల్ అమ్హెద్ పేర్కొన్నారు. 2008లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పాలన ఎన్నికలను పర్యవేక్షించే తటస్థ యంత్రాంగాన్ని (ది కేర్‌టేకర్ గవర్నమెంట్) తొలగించడం ఆమెను అప్రతిష్టపాలు చేసిందని చెప్పారు.

'నియంతృత్వ పాలన'పై ఆగ్రహం

హసీనా నియంతృత్వ పాలన కూడా ఒక కారణం. తాను తొలిసారి (1996-2001) బాధ్యతలు చేపట్టినపుడు నియంతలా వ్యవహరించలేదు. కానీ 2008లో ఘనవిజయం తర్వాత ఆమె పాలనా శైలి మారిపోయింది. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా పాలనలో ప్రారంభమైన అదనపు న్యాయపర హత్యలు..హసీనా హయాంలోనూ కొనసాగాయి. బలవంతపు అదృశ్యాలను ఆమె తేలికగా తీసుకున్నారు. అలాంటివి సాధారణమేనని సమర్థించుకున్నారు.” అని ముస్తఫా చెప్పారు.

బంగ్లాదేశ్‌లో సైన్యం పాత్ర..

హసీనా దేశం వీడాక బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఏమిటి? 1975 నుంచి దాదాపు 1990 వరకు దేశానికి మధ్యవర్తిగా వ్యవహరించి, మళ్లీ ఇప్పుడు రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ సైన్యం ప్రభుత్వంపై పట్టు బిగించనుందా? లేక విద్యార్థి సంఘాల నాయకులు దేశాన్ని నడుపుతారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత దీర్ఘకాలంగా అణచివేతకు గురైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP). ప్రస్తుతం మూడవ శక్తిగా (రాజకీయ పార్టీగా మారిన లా అస్సాం విద్యార్థుల ఉద్యమం) అవతరించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు

ముస్తఫా వంటి బంగ్లాదేశ్ పరిశీలకులు అలాంటి అవకాశం లేదంటున్నారు. హసీనాను గద్దె దించిన తర్వాత ప్రజలు విద్యార్థి, ఉద్యమ నాయకులవైపు చూస్తున్నారు. అయితే తాము రాజకీయ పార్టీ నడపగలరా? అన్నది సందేహంగా ఉంది” అని చెప్పారు.

అవామీ లీగ్‌కు ఇండియా మద్దతు..

భారతదేశం అవామీ లీగ్‌కు ప్రధాన మద్దతుదారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి మినహాయింపు కాదు. ‘‘ఇండియా మాత్రమే కాదు. చైనా, రష్యా, యుఎస్ వంటి దేశాలు చాలా కాలం పాటు హసీనా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఆమె అతిగా ప్రవర్తించడాన్ని సహించాయి. బంగ్లాదేశ్ పట్ల తమ విధానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది." అని అహ్మద్ అంటున్నారు.

Read More
Next Story