హెచ్‌-4 వీసా ఉన్నా ఉద్యోగాలిస్తాం!  శుభవార్త చెప్పిన అమెరికా
x
హెచ్ 1 బీ

హెచ్‌-4 వీసా ఉన్నా ఉద్యోగాలిస్తాం! శుభవార్త చెప్పిన అమెరికా

అమెరికాకు డిపెడెంట్ వీసాలపై వెళ్లిన వారు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు త్వరలో అనుమతి లభించబోతోంది. హెచ్‌ 1 బీ వీసాదారులకు ఇది పెద్ద ఊరట అంటున్నారు


అమెరికాలో ఉద్యోగ వీసాల మీద వెళ్లిన వారిపై ఆధారపడే వాళ్లు ( డిపెండెంట్ వీసాలపై వెళ్లిన వారు)కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు త్వరలో అనుమతి లభించబోతోంది. హెచ్‌-4 వీసా (H-4 Visa) కలిగిన వారికి ఊరటనిచ్చే కీలక బిల్లును త్వరలో సెనెట్‌ ఆమోదించనుంది. దీంతో సుమారు లక్ష మందికి లబ్ధి చేకూరనుంది. అమెరికన్‌ సెనెట్‌లో రిపబ్లికన్‌లు, డెమోక్రాట్‌ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో ‘జాతీయ భద్రతా ఒప్పందానికి’ ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి.

ఏమిటీ హెచ్‌-4బీ వీసా?


హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్‌-4 వీసాలు జారీ చేస్తుంటారు. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (EAD), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్‌ వస్తేనే వారు ఉద్యోగం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఇది పూర్తవడానికి ఏడాది సమయం పడుతుంది. దీనివల్ల హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగావకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్‌-4 వీసాదారులకు ‘ఆటోమేటిక్‌గా వర్క్‌ ఆథరైజేషన్‌’ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనుంది.

చట్టబద్ధంగా వలసలకు అవకాశం..

‘‘కొత్తగా తీసుకొస్తున్న బిల్లు మన దేశాన్ని బలోపేతం చేయడంతోపాటు సరిహద్దులను సురక్షితం చేస్తుంది. చట్టబద్ధంగా వలసలకు అవకాశం కల్పిస్తుంది’’ అన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ‘‘ఈ విధానం కింద ఏటా 18 వేల మందికి ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డ్‌లను జారీ చేస్తారు. ఐదేళ్లలో సుమారు 1,58,000 మందికి లబ్ధి కలుగుతుంది.

ఏడాదికి 25,000 మంది K-1, K-2, K-3 వలసేతర వీసా (పర్యటకం, వైద్యం, వ్యాపారం వంటి తాత్కాలిక పనుల నిమిత్తం జారీ చేస్తారు) ఉన్నవారితోపాటు, లక్ష మంది హెచ్‌-4 వీసాదారులకు తమ జీవిత భాగస్వామి పనిచేసే ప్రాంతంలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది’’ అని వైట్‌హౌస్‌ తెలిపింది.

ఒబమా హయాం నుంచే చర్చలు...

హెచ్‌-4 వీసా కలిగిన వారు ఉద్యోగాలు చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ.. 2015లో ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో శాస్త్ర సాంకేతిక (STEM) రంగాల్లో నైపుణ్యం కలిగి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన వారికి ఆర్థికంగా కొంత ఊరట లభించింది. ఈ వీసాలు పొందిన వారిలో ఎక్కువగా భారతీయ మహిళలే ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ఆంక్షలు విధించారు. దీంతో వివిధ రంగాల్లో నిపుణులైన భారతీయులు ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ ఆంక్షలు ఎత్తివేసేందుకు బైడెన్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Read More
Next Story