వెనిజులాపై అమెరికా అసలెందుకు దాడి చేసింది?
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో

వెనిజులాపై అమెరికా అసలెందుకు దాడి చేసింది?

ఆపరేషన్ సదరన్ స్పియర్ ముగిసినట్టేనా?


లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాపై అమెరికా భారీ ఎత్తున దాడులకు దిగింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణిని తమ అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశాలకు తరలించింది.

ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు, ఆయన భార్య ఎక్కడున్నారో తమకు తెలియదని ప్రకటించారు. వారు ప్రాణాలతో ఉన్నారో లేదో రుజువులు చూపాలని ఆయన అమెరికాను డిమాండ్ చేశారు.

అమెరికాకు చెందిన ప్రత్యేక దళాలు రాజధాని కారకాస్ లో భీకరదాడులకు దిగాయి. చాలాచోట్ల పేలుళ్ల జరిగిన దృశ్యాలను అనేకమంది నెటిజన్లు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ దాడులను మొదట మధురో, తరువాత రక్షణ మంత్రి ఖండించారు. దేశంలో వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించారు. అమెరికా దాడులకు వ్యతిరేకంగా దళాలను సమీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
వెనిజులా చుట్టూ అమెరికా తన యుద్ధనౌకలు, జలాంతర్గములను భారీ ఎత్తున మొహరించింది. వెనిజులా తమదేశంలోకి భారీ ఎత్తున డ్రగ్స్ ను సరఫరా చేస్తోందని గత కొన్ని రోజులుగా ట్రంప్ ఆరోపిస్తున్నారు.
ఆ దేశం నుంచి చమురు నౌకలు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనికి అమెరికా ‘ఆపరేషన్ సదరన్ స్పియర్’ అని పేరును పెట్టింది. అమెరికా దాడులను అంతర్జాతీయ విశ్లేషకులకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదు.
అమెరికా గత కొన్ని రోజులుగా అనుమానిత నౌకలపై జరిపిన దాడుల ఫలితంగా 115 మంది చనిపోయారు. మొదట సైనిక దిగ్భంధనం, రహస్య భూదాడులు జరిగిన తరువాత అమెరికా ఈ రోజు నేరుగా రాజధానిపై విరుచుకుపడింది.
వెనిజులా లో ప్రస్తుతం రష్యాకు అనుకూలమైన మధురో చేతిలో ఉంది. ఇక్కడ అపారమైన చమురు నిక్షేపాలు ఉన్నాయి. దీనిపై పెత్తనం కోసమే అమెరికా ప్రయత్నిస్తుందని అంతర్జాతీయ పరిశీలకుల మాట.
35 సంవత్సరాల తరువాత అమెరికా జోక్యం..
లాటిన్ అమెరికా దేశాలతో అమెరికా ఘర్షణ పడటం చరిత్రలో కొత్తకాదు. 1989 తరువాత లాటిన్ అమెరికాలో యూఎస్ఏ నేరుగా ఇంత ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. 80 ల చివరలో మాజీ సైనిక నియంత మాన్యుయేల్ నోరిగాను పదవి నుంచి దించడానికి పనామాపై దాడులకు దిగింది.
ట్రంప్ ఎందుకు మదురోను లక్ష్యంగా చేసుకున్నారు?
కారకాస్ పై వాషింగ్టన్ సైనిక చర్య తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటి కారణం.. నార్కో టెర్రరిస్ట్ అని ట్రంప్ ఆరోపణ. మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలతో మదురోకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ట్రంప్ విమర్శించారు. వెనిజులాకు చెందిన ట్రెన్ డి అరగువా, కార్టెల్ డి లాస్ సోల్స్ వంటి గ్రూపులను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా బ్లాక్ లిస్ట్ చేశాడు.
వలసల ముప్పు..
వెనిజులా తన దేశం జైళ్లలో ఉన్న నేరగాళ్లు, పిచ్చివాళ్లను ఖాళీ చేయించి అమెరికాకు వలస పంపుతున్నారని ట్రంప్ ఆరోపణ. మాదక ద్రవ్యాల నేరాలకు మద్దతు ఇవ్వడానికి చమురు నుంచి వస్తున్న నిధులను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అలాగే ఆ దేశ చమురు, ముడి ఖనిజాలను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అనుకున్న అమెరికా వెనిజులా, ఇరాన్ వంటి దేశాల నుంచి చమురు తీసుకెళ్తున్న ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంది. తద్వారా ఆ దేశానికి ప్రపంచ దేశాలతో ఎటువంటి సంబంధం లేకుండా చేయగలిగింది.
మాదక ద్రవ్యాల రవాణా..
అమెరికాలోకి అక్రమంగా వస్తున్న కొకైన్, ఫెంటానిల్ వంటి ప్రమాదకర మాదక ద్రవ్యాలను నిలువరించాలంటే వెనిజులా పై సైనిక దాడులు అవసరమని పెంటగాన్ భావించింది.
గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ కరేబియన్ సముద్రంలో దాదాపు 35 నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. దీనిఫలితంగా 115 మంది మరణించారు.
పాలకుల మార్పు..
కారకాస్ లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపిస్తామని అమెరికా చెబుతోంది. అంటే తనకు అనుకూలురైన పాలకులను పీఠం అప్పగించడానికి ప్రయత్నిస్తోంది. వీరి అంతిమ లక్ష్యం అక్కడి నుంచి చమురు, ఖనిజ నిక్షేపాలను స్వేచ్ఛగా తరలించుకుపోవడం మాత్రమే. వెనిజులా కూడా తమ దేశ చమురు నిల్వలను అక్రమంగా తరలించుకుపోవడానికి దాడులు చేసిందని ఆరోపిస్తోంది.
ట్రంప్ దృఢ వైఖరి..
అమెరికా, వెనిజులా మధ్య వివాదం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ట్రంప్ అనుసరించి దృఢ వైఖరి. యూఎస్ మాజీ అధ్యక్షుడు జేమ్స్ మన్రో, రూజ్ వెల్ట్ తెచ్చిన సిద్ధాంతాలను మరోసారి పరిశీలించడం. ఇది అమెరికాను తిరిగి పశ్చిమార్థగోళంలో తిరుగులేని శక్తిగా మార్చే లక్ష్యంతో ఉన్నాయి.
1823 లో మన్రో సిద్దాంతం యూరోపియన్లకు పశ్చిమ అర్థగోళంలో తమ ప్రభావాన్ని పెంచకుండా అడ్డుకుంది. 1904 లో వచ్చిన రూజ్ వెల్ట్ దీనిని మరింత గట్టిగా మార్చారు. తరువాత వీటిని ఉపయోగించుకునే అమెరికా అక్కడ ఆధిపత్యం సాధించింది.
వెనిజులా క్రమంగా చైనాకు దగ్గరవడం కూడా ఈ సైనిక ఘర్షణకు ప్రధాన కారణం. అంతర్జాతీయంగా రోజు రోజుకు దాని ప్రభావం పెరగడం, వెనిజులా నుంచి పెద్ద ఎత్తున చైనా ముడి చమురును కొనుగోలు చేయడం కూడా మరొక కారణం. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలపై నియంత్రణ అమెరికాకు లభిస్తుంది.
Read More
Next Story