‘ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఎందుకు ముఖ్యమైంది?’
x

‘ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఎందుకు ముఖ్యమైంది?’

ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనతో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య రెండేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధానికి తెరపడుతుందని భారత దౌత్యవేత్తలు భావిస్తున్నారు.


- Pranay Sharma

ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనతో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య రెండేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధానికి తెరపడుతుందని భారత దౌత్యవేత్తలు భావిస్తున్నారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం రెండేళ్లకు పైగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌లో తొలి భారత ప్రధాని..

మోదీ గత నెలలో రష్యాలో పర్యటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వివాదంపై చర్చించారు. ఉక్రెయిన్, భారత్‌ల మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలున్నా.. ప్రధాని ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక్కడికి చేరుకోడానికి ముందు మోదీ పోలాండ్‌లో రెండు రోజులు గడుపుతారు. పోలాండ్‌తో మన దేశ దౌత్య సంబంధాలు 70 ఏళ్లుగా కొనసాగుతున్నాయి.

బంధం బలోపేతం కోసం..

45 ఏళ్ల తర్వాత పోలాండ్‌లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. యూరోపియన్ యూనియన్‌లో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అలాగే మధ్య ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం పోలాండ్. ఆగస్టు 22తో ముగియనున్న మోదీ రెండు రోజుల పర్యటనలో పోలాండ్ - భారత్ వ్యాపార, సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.

అందరి దృష్టి ఉక్రెయిన్ పర్యటనపైనే..

మోదీ ఉక్రెయిన్ పర్యటన భారత్‌తో పాటు ఇతర ప్రాంతాల దౌత్యవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యాతో భారత్‌కు సన్నిహిత సంబంధాలుండడమే అందుకు కారణం.

మోడీ-జెలెన్స్కీ సమావేశాలు..

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఫిబ్రవరి 2022లో ప్రారంభమైంది. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని భారతదేశం గతంలో ఇరుదేశాల నేతలకు పిలుపునిచ్చింది. యుఎస్, దాని మిత్రదేశాలు నిర్వహించిన అన్ని ప్రధాన సమావేశాలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రసంగించడానికి అనుమతించారు. అయితే భారతదేశం గత సంవత్సరం సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉంచింది. ఇటీవల జూన్‌లో ఇటలీలో జరిగిన G7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో జెలెన్స్కీని మోదీ కలిశారు.

ఇరు దేశాలతో సత్సంబంధాల కోసం..

ఉక్రేనియన్ గడ్డపై జెలెన్స్కీతో మోదీ శాంతి చర్చలు జరపడం ఇదే మొదటిసారి. ఉక్రేనియన్ మిలిటరీ బలగాలు రష్యా భూభాగంలోకి ప్రవేశించిన సమయంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే.. వాషింగ్టన్‌తోనూ తమ బంధం కొనసాగుతుందని అమెరికా ప్రభుత్వానికి బలంగా చెప్పడానికే మోదీ కైవ్‌కు వెళ్తున్నారని ఒక వర్గం నిపుణులు అంటున్నారు.

దుమారం రేపిన మోదీ పర్యటన..

ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) ఉక్రెయిన్‌కు మద్దతునిస్తుంది. అయితే జూలైలో మోడీ మాస్కో పర్యటన పశ్చిమ దేశాలలో దౌత్య తుఫాను సృష్టించింది. మోదీ పర్యటన రష్యాను ఏకాకిని చేసే ప్రణాళికకు గండికొట్టింది.

పుతిన్‌ను మోదీ కౌగిలించుకున్న ఫొటోలు అమెరికా, ఉక్రెయిన్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ సందర్భంగా జెలెన్స్కీ ఇలా అన్నాడు. "ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు మాస్కోలో ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్థుడిని కౌగిలించుకోవడం చాలా నిరుత్సాహపరుస్తుంది." అని కామెంట్ చేశారు.

మోదీ పర్యటన ఫలిస్తుందా?

ఉక్రెయిన్‌లో శాంతికి మూలాలు వాషింగ్టన్‌‌లో ఉంటే.. మోదీ ప్రయత్నానికి విలువ ఉంటుందా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం తన ప్రాధాన్యతలో ఒకటని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసింది. అయితే ఆయన ప్రత్యర్థి కమలా హారిస్ అమెరికా కొత్త అధ్యక్షురాలైతే ఏం జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు.

Read More
Next Story