శాంతి సమావేశం: రష్యాను అణచివేసే ప్రయత్నాలకు భారత్ సహకరిస్తుందా?
వచ్చె నెలలో స్విస్ వేదికగా జరిగే ప్రపంచ శాంతి సమావేశానికి భారత ప్రధానిని ఎలాగైనా తీసుకురావాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇందులో రష్యాను..
వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లో జరిగే గ్లోబల్ శాంతి సదస్సుకు భారత్ కూడా హాజరు కావాలని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి, ఇందులో అగ్రశ్రేణి ప్రపంచ రాజనీతిజ్ఞులు,నాయకులు పాల్గొననున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ విషయంలో రష్యాను ఒంటరి చేసేందుకు వారు అంతర్జాతీయంగా అభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న వర్తమాన దేశాల అభిప్రాయాన్ని రష్యాకు వ్యతిరేకంగా సేకరించేందుకు పాశ్చాత్య అమెరికా కూటమి పెద్దలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉక్రెయిన్ శాంతి సదస్సుకు ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ గా ముద్రపడ్డ స్విట్జర్లాండ్ అతిథ్యం ఇవ్వనుంది. ఇది జూన్ 15, 16 తేదీలలో స్విస్ పట్టణంలోని బర్గెన్ స్టాక్ లో జరగనుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి త్వరగా శాంతిని నెలకొల్పడం. కానీ శాంతి ముసుగులో రష్యాను ప్రపంచ దేశాల్లో ఒంటరి చేయడమే వాటి లక్ష్యంగా వెస్ట్ ప్రయత్నాలు చూస్తే తెలుస్తోంది.
భారత్ శాంతి వైఖరి..
అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమి రష్యా దండయాత్రపై ఐక్యరాజ్యసమితిలో కార్నర్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ దాని ప్రయత్నాలు మాత్రం నిరాటంకంగా విఫలమయ్యాయి. మారిన పరిస్థితుల్లో సాధారణంగా ఏ దేశం కూడా అమెరికా చెప్పిన కారణాలను నమ్మలేదు.
ఉక్రెయిన్ రక్తపాతాన్ని ముగించడానికి రెండు దేశాలే కూర్చుని చర్చించుకోవాలని, భారత వైఖరిగా ఉంది. అందుకోసం నిర్వహించిన కొన్ని శాంతి కార్యక్రమాల్లో పాల్గొంది. గతేడాది సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ జెడ్డాలో నిర్వహించిన సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని పంపింది.
స్విట్జర్లాండ్ సదస్సులో భారత్ ఏ స్థాయిలో పాల్గొంటుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ, గతాన్ని బట్టి చూస్తే, దాని భాగస్వామ్యం ప్రధానమంత్రి కంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, అయినప్పటికీ పశ్చిమ దేశాలు భారత ప్రధానమంత్రిని ఈ వేదికపైకి రప్పించడానికి మాత్రం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
యుద్ధంలో రష్యా గెలిచిందా?
రష్యాను ఎవరు ఓడించలేరని మాస్కో భావన. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు భారీగా సైనిక సాయాన్ని పెంచుతున్నప్పటికీ కీవ్ ఇప్పటి వరకూ కొల్పోయిన భూభాగాలను అది చేజిక్కించుకోలేకపోయింది. ఇది చాలా కష్టమైన పని. శాంతి సమావేశం దీనిని విస్తృతంగా చర్చించినప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండదని ఈ దేశం భావన. ఇప్పుడు స్విస్ లో జరిగే ఈ శాంతి సమావేశం రష్యాను సైనికపరంగా కాకపోయినా కనీసం దౌత్యపరంగా అయినా ఓడించి అవమానించడానికి బలంగా ప్రయత్నాలు జరుగుతాయి. ఇది న్యూఢిల్లీకి ఇబ్బందికరం.
ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పేరు రావాలని పాశ్చాత్య దేశాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికైతే భారత్ నుంచి వచ్చే బృందానికి ఆయనే నాయకత్వం వహించాలని అవి కోరుకుంటున్నాయి.
పాశ్చాత్య లాబీయింగ్
ఈ మేరకు ముమ్మరంగా లాబీయింగ్ సాగుతోంది. ఇటీవలి నెలల్లో, యూరప్ నుంచి అనేక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు భారతదేశానికి వచ్చాయి. వచ్చిన వారిలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి ఇగ్నాజియో కాసిస్, స్విస్ విదేశాంగ కార్యదర్శి అలెగ్జాండర్ ఫాసెల్ ఢిల్లీకి వెళ్లి సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వాన్ని ఒప్పించారు.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. మోదీ గెలిస్తే జూన్ 14-15 తేదీల్లో ఇటలీలో జరిగే గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి-7) సదస్సులో ఆయన పాల్గొంటారని అంచనా. అందువల్ల జీ-7 సదస్సు తర్వాత తమ శాంతి సదస్సుకు హాజరయ్యేందుకు మోదీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్విస్ ఈవెంట్ నిర్వాహకులు భావిస్తున్నారు.
గ్లోబల్ సౌత్‌కు చెందిన పలువురు నాయకులతో సహా 160 మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలకు జీ 7 సదస్సుకు హజరుకావాలని కోరుతూ ఆహ్వనాలు అందాయి.ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఇతర జీ-7 దేశాలు, చైనా బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైతం ఉన్నారు. అయితే ఇందులో రష్యాను పక్కన పెట్టారు. అయితే దీనిపై భారత విదేశాంగ మాజీ కార్యదర్శి కన్వాల్ సిబల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేయడం లాంటిదని వ్యాఖ్యానించారు.
పుతిన్‌ను ఆహ్వానించలేదు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను దూరంగా ఉంచడమే కాకుండా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రతిపాదించిన 10-పాయింట్ల శాంతి సూత్రాన్ని సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో వీటికే అత్యధిక ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా..
రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను తక్షణమే తిరిగి ఇవ్వాలని, యుద్ధం వల్ల మా దేశంలో జరిగిన విధ్వంసం, ప్రాణనష్టానికి మాస్కో నష్టపరిహారం చెల్లించాలని, యుద్ధ నేరాల కోసం రష్యన్ నాయకులు, జనరల్స్‌పై విచారణ జరపాలని జెలెన్స్కీ కోరుకుంటున్నారు.
గత వారం చైనాను సందర్శించిన పుతిన్ , స్విస్ సమావేశాన్ని "వ్యర్థమైనది" అభివర్ణించాడు. ఎలాంటి స్పష్టమైన ఫలితం రాని, కనీసం అవకాశం రాని ఖాళీ సమావేశంగా విమర్శించాడు.
పాశ్చాత్య దేశాల నిరాశ
రష్యా- ఉక్రెయిన్‌లు రెండు కలిసి ఉన్న శాంతి సమావేశానికి మద్దతు ఇస్తామని చైనా ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇది ఇక్కడ సాధ్యంకానీ పరిస్థితి. ఇప్పటివరకు యుద్ధంలో తటస్థంగా ఉండి, రష్యాను విమర్శిస్తూ.. యూఎన్ విధించిన ఎలాంటి ఆంక్షలను భారత్ సమర్ధించలేదు. ఇది పశ్చిమదేశాలను కవ్విస్తూనే ఉంది.
ముఖ్యంగా ఈ మధ్య భారత విదేశాంగమంత్రి మాట్లాడుతూ.. రష్యా ఎప్పుడూ మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. అది కూడా పాశ్చాత్య మీడియా ప్రతినిధుల ముందు. దీని వెనకున్న అర్థం వారికి బాగానే బుర్రకెక్కింది. అందుకే కిక్కురుమనకుండా ఉండిపోయారు.
రష్యాపై విధించిన ఆంక్షలను పట్టించుకోకుండా భారత్ దానితో వ్యాపారం చేయడం పశ్చిమ దేశాలను తీవ్రంగా నిరాశపరిచింది. మాస్కోపై వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. అందుకే ఈ సారి శాంతి చర్చల్లో భారత్ ను ఎలాగైన రష్యాకు వ్యతిరేకంగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ముందు వరుసలో ఉంది. పశ్చిమ దేశాలతో చాలా స్నేహపూర్వకంగా ఉంటూనే మిగిలిన దేశాలపై తనదైన ప్రభావాన్ని చూపుతోంది.
మోదీ స్విట్జర్లాండ్ సమావేశానికి హాజరై, టేబుల్‌పై ఉన్న కొన్ని అంశాలకు మద్దతు ఇస్తే, అది రష్యాకు పెద్ద దెబ్బగా మారుతుందని, దాని అనుకూల దేశాల్లో చీలికును తెస్తుందని వెస్ట్ నమ్మకం.
ఉక్రెయిన్ సంఘర్షణను అంతం చేయడానికి భారత్ ఏదైనా శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందనడంలో సందేహం లేదు కానీ.. రష్యాను అవమానించే ప్రయత్నం ఉంటే మాత్రం న్యూఢిల్లీ వైఖరి మారే అవకాశం ఉంది.
రష్యా ముఖ్యమైనది
మాస్కో, న్యూఢిల్లీకి అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామి, అంతర్జాతీయ వేదికలపై ఒంటరిగా ఉన్న సమయాల్లో రష్యా బేషరతుగా భారత్ కు మద్ధతునిచ్చింది. సైనిక సహకారం నుంచి అంతరిక్షం వరకూ వాణిజ్యం, పెట్టుబడులు ఇలా అనేక రంగాల్లో వ్యూహత్మక భాగస్వామ్యం కొనసాగిస్తున్నాయి.
రష్యా చాలాసార్లు చైనా, అమెరికా కుట్రల నుంచి భారత్ ను కాపాడింది. చైనాతో కూడా శాంతియుతంగా సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో కూడా మాస్కో సహకారం అవసరమని న్యూఢిల్లీ భావిస్తోంది. దీనికోసం రష్యాతో సంబంధాలు మరింత బలపడాలని అనుకుంటోంది. అలాగే, అమెరికన్లతో సంబంధాలు పెరుగుతున్నప్పటికీ రష్యాతో బలమైన సంబంధాలను కొనసాగించడం భారత వ్యూహత్మక శక్తిని తెలుపుతోంది. రష్యా కూడా దీనిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
ఎన్నికల్లో గెలిస్తే ఇటలీలో జరిగే జి-7 సదస్సుకు మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, స్విట్జర్లాండ్‌కు దూరంగా ఉంటూ శాంతి సమావేశానికి కింది స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి.
Next Story