
హార్ముజ్ నుంచి ఇరాన్ సుంకాలు వసూలు చేస్తుందా?
ప్రపంచంపై ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి?
పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడమే ఇందుకు కారణం. కానీ భవిష్యత్ లో ఇరాన్ ఈ మార్గాన్ని సమర్థవంతమైన ఇంధన ఆయుధంగా మార్చడానికి ప్రణాళికలు రచిస్తోంది.
ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రయాణించే నౌకలపై సుంకాలు విధించాలని ఆలోచిస్తోంది. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ కల్లోల్ భట్టాచార్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ చమురులో దాదాపు 20% ఈ ఇరుకైన జలమార్గం గుండానే వెళ్తోంది. ఈ మార్గానికి ఏ చిన్న అంతరాయం కలిగినా ప్రపంచవ్యాప్తంగా తక్షణ పరిణామాలు ఉంటాయి.
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ సంఘర్షణ తర్వాత ఉద్రిక్తతలు పెరగడంతో, హార్ముజ్ జలసంధి భౌగోళిక, ఆర్థిక అనిశ్చితికి కేంద్ర బిందువుగా మారింది. ఇరాన్ నిజంగా ఈ కీలక మార్గాన్ని టోల్ ఆధారిత చెక్‌పాయింట్‌గా మార్చగలదా అనే విషయాన్ని విశ్లేషించడానికి, 'ది ఫెడరల్' వెబ్ సైట్, 'ది హిందూ' సీనియర్ అసిస్టెంట్ ఫారిన్ అఫైర్స్ ఎడిటర్ కల్లోల్ భట్టాచార్య, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ అఫ్తాబ్ కమల్ పాషాతో మాట్లాడింది.
సుంకాలు విధింపులు..
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడల నుంచి టోల్ వసూలును అధికారికం చేయడానికి ఇరాన్ పార్లమెంట్ ఒక చట్టాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తాము ఈ మార్గానికి భద్రతను కల్పిస్తున్నందున, ఇతర కారిడార్లలో రవాణా సుంకాల మాదిరిగానే ఓడలు రుసుములు చెల్లించడం "సహజం" అని ఇరాన్ చెబుతోంది. అయితే దీనిపై భట్టాచార్య అభ్యంతర వ్యక్తం చేశారు. సూయజ్ కాల్వ, పనామా కాల్వాల హార్ముజ్ జలసంధి కాదని, ఇది సహజంగా ఏర్పడిన సముద్ర మార్గం అని చెబుతున్నారు.
ఇది ఒక సహజ జలసంధి, దానిని వాణిజ్య ప్రాజెక్ట్‌గా మార్చాలనే ఇరాన్ ప్రయత్నాన్ని ఇది క్లిష్టతరం చేస్తుంది,” అని ఆయన వివరించారు. అయినప్పటికీ, కొన్ని నౌకలు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ద్వారా తనిఖీలకు గురవుతూ, సురక్షిత ప్రయాణం కోసం డబ్బు చెల్లిస్తున్నాయని ఆరోపణలతో, వాస్తవానికి ఒక వ్యవస్థ ఇప్పటికే అమలులో ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
చట్టపరమైన అడ్డంకులు
ఈ చర్య అంతర్జాతీయ సముద్ర చట్టంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ప్రపంచ ఒప్పందాల ప్రకారం, అంతర్జాతీయ నౌకాయానానికి ఉపయోగించే జలసంధులు సాధారణంగా ప్రయాణ స్వేచ్ఛకు హామీ ఇస్తాయి. సుంకాలు విధించే ఏ ప్రయత్నమైనా ఈ సూత్రాలను ఉల్లంఘించినట్లే అని భట్టాచార్య అభిప్రాయపడ్డారు. “ఇది అంతర్జాతీయ సముద్ర నియమాలు, ఒప్పందాలకు విరుద్ధంగా ఉంటుంది,” అని ఆయన అన్నారు. అటువంటి వ్యవస్థను అమలు చేయడం సవాలుతో కూడుకున్నదని చెప్పారు.
ఈ అంశపై ప్రొఫెసర్ పాషా మాట్లాడుతూ.. పెద్ద నౌకలు ఉపయోగించే నౌకాయాన మార్గంలో అధిక భాగం ఇరాన్ ప్రాదేశిక జలాల్లోనే ఉందని చెప్పారు. “ఇరాన్ తన 12 నాటికల్ మైళ్ల జోన్‌పై నియంత్రణను క్లెయిమ్ చేస్తోంది. నౌకలు ఈ సురక్షిత మార్గం గుండా వెళ్లాలని ఎంచుకుంటే, అవి తమ నిబంధనలను పాటించాల్సిందేనని అంటోంది” అని ఆయన అన్నారు.
వ్యూహాత్మకంగా కీలక స్థానం..
చట్టాలకు అతీతంగా ఇరాన్ భౌగోళిక ప్రాంతాన్ని తన శక్తిని ప్రయోగించే సాధనంగా ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. భట్టాచార్య దీనిని ఇంధన ప్రవాహాల "ఆయుధీకరణ"గా అభివర్ణించారు. 1970ల నాటి చమురు సంక్షోభాలతో పోలుస్తూ, "హార్ముజ్ జలసంధి ఇరాన్ ఇంధన ఆయుధానికి ప్రత్యక్ష రూపం" అని ఆయన అన్నారు.
ఇరాన్ యుద్ధ క్షేత్రాన్ని సంప్రదాయ సైనిక పోరాటం నుంచి ఆర్థిక అంతరాయానికి మార్చిందని ఆయన వాదించారు. ఇంధన సరఫరా మార్గాలను నియంత్రించడం ద్వారా, టెహ్రాన్ తక్షణ సంఘర్షణ ప్రాంతానికి చాలా దూరంలో ఒత్తిడిని పెంచుతోంది. "ఇది పూర్తిగా ఊహించనిది. ఇరాన్ ఇంత దూరం వెళ్లదని చాలామంది అనుకున్నారు" అని ఆయన అన్నారు.
యుద్ధం..
అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, యుద్ధ పరిస్థితులకు ప్రతిస్పందనగానే తమ చర్యలు ఉన్నాయని ఇరాన్ వాదనలు వినిపిస్తోంది.
ప్రొఫెసర్ పాషా ప్రకారం.. ఇరాన్ తనిఖీలు, సుంకాలకు అవసరమైన భద్రతా చర్యలుగా సమర్థిస్తోంది. "యుద్ధ సమయంలో శత్రువులకు ఎలాంటి సాయాలు అందకుండా నౌకలను తనిఖీ చేసే అధికారం ఆయా దేశాలకు ఉంటుంది’’ అని ఆయన అన్నారు. సంఘర్షణ సమయంలో జరిగిన నష్టాలకు పరిహారంగా ఇరాన్ ఈ సుంకాల వ్యవస్థను ముందుకు వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. "ఇరాన్‌పై దురాక్రమణకు ప్రపంచం మూల్యం చెల్లించాల్సిందేనన్నది ఒక విస్తృతమైన కథనంలో భాగం," అని ఆయన వివరించారు.
కార్యాచరణ సాధ్యమవుతుందా..
కార్యాచరణ పరంగా ఏదైన నష్టాలు ఉన్నప్పటికీ ఇరాన్ ముందుకు వెళ్లడానికే సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ చర్యలు ఇప్పటికే ప్రపంచ నౌకా రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న నష్టాల పట్ల బీమా సంస్థలు, షిప్పింగ్ కంపెనీలు అప్రమత్తంగా ఉండటంతో, జలసంధి గుండా రవాణా తీవ్రంగా తగ్గిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
భట్టాచార్య మాట్లాడుతూ.. ఆర్థికపరమైన చిక్కులను ప్రధానంగా ఏకరువు పెట్టారు. "నౌకా రవాణా అనేది అధిక నష్టాలున్న పెట్టుబడి. అనిశ్చితి పెరిగితే, బీమా సంస్థలు, పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతారు," అని ఆయన అన్నారు.
ఇది అధిక రవాణా ఖర్చులకు దారితీయవచ్చు. దీని భారం చివరికి పెరుగుతున్న ఇంధన ధరల రూపంలో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపై పడుతుందని హెచ్చరించారు. భద్రతాపరమైన ఆందోళనలు కూడా ఒక పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్ పాషా చెప్పుకొచ్చారు. ఇరుకైన మార్గాలలో ప్రయాణించే పెద్ద ట్యాంకర్లు గణనీయమైన ప్రమాదాలను ఎదుర్కొంటాయి. ఏదైనా దుర్ఘటన మార్గాన్ని పూర్తిగా నిరోధించగలదు.
సూయజ్, పనామా కాలువలతో పోలిక
హార్ముజ్ జలసంధి సూయజ్ లేదా పనామా కాలువల వలె పనిచేయగలదా అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఇరాన్ ఒక హైబ్రిడ్ నమూనాను ప్రయత్నిస్తోందని ప్రొఫెసర్ పాషా సూచించారు. "ఓడలు ఇరాన్ జలాల్లోకి ప్రవేశిస్తే, వారు డబ్బు చెల్లించాలి. వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటే, ప్రమాదాన్ని వారే భరించాలి," అని ఆయన అన్నారు. అయితే, భట్టాచార్య దీనిపై సందేహం వెలిబుచ్చారు. ఒక సహజ జలసంధిపై కాలువ తరహా నియంత్రణను పునఃసృష్టించడం అనేది ప్రాథమికంగా భిన్నమైనదని, చాలా సంక్లిష్టమైనదని ఆయన వాదించారు.
"అటువంటి వ్యవస్థ విజయం దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఫలితాలపై, ముఖ్యంగా కొనసాగుతున్న సంఘర్షణ ఫలితంపై ఆధారపడి ఉంటుంది," అని ఆయన పేర్కొన్నారు. విస్తృత దృక్పథంలో చూస్తే, ఈ పరిస్థితి ఈ ప్రాంతంలో మారుతున్న అధికార సమతుల్యతను ప్రతిబింబిస్తుందని ఇద్దరు నిపుణులు అంగీకరిస్తున్నారు.
ఇరాన్ తన రక్షణాత్మక వైఖరిని వ్యూహాత్మక ప్రయోజనంగా మార్చుకుందని భట్టాచార్య ఎత్తి చూపారు. "యుద్ధం ఇరాన్‌కు పట్టు ఉన్న భూభాగంలోకి ప్రవేశించింది," అని ఆయన అన్నారు. ఈ సంఘర్షణ నుంచి ఇరాన్ మరింత బలంగా బయటపడితే, అది కేవలం ఇంధన వాణిజ్యాన్నే కాకుండా విస్తృత ప్రాంతీయ గతిశీలతను కూడా పునర్నిర్వచించగలదని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి, హార్ముజ్ జలసంధి ఒక ఉద్రిక్త కేంద్రంగా మిగిలిపోయింది. ఇక్కడ చట్టం, వ్యూహం, ఆర్థిక శాస్త్రం ప్రపంచవ్యాప్త పరిణామాలతో ఢీకొంటున్నాయి.
Next Story

