పశ్చిమాసియా తగలబడుతుందా? తగలబెడుతుందా? పాక్ పై ఇరాన్ దాడి
x

పశ్చిమాసియా తగలబడుతుందా? తగలబెడుతుందా? పాక్ పై ఇరాన్ దాడి

షియా మెజారిటీ దేశం ఇరాన్ రెచ్చిపోయింది. పాకిస్తాన్, ఇరాక్, సిరియా దేశాలపై దాడులు చేసింది. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రపంచం ఆందోళన వ్యక్తం అవుతోంది.


ఈ దాడులతో సున్నీ- షియా వైరం తిరిగి పశ్చిమాసియాలో మొదలయ్యే పరిస్థితి తలెత్తింది. టెహ్రన్ తాజాగా ఇస్లామాబాద్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది. బలూచిస్తాన్ లోని రెండు గుర్తు తెలియని ప్రాంతాలపై డ్రోన్లు, మిస్సైల్లతో దాడి చేసినట్లు ప్రకటించింది.

ఇరాన్ పై దాడులు

షియా దేశమైన ఇరాన్ లో బెలూచిస్తాన్ ప్రాంతం ఒక్కటే సున్నీలు మెజారీటీ. ఇదే ప్రాంతంలో ఇరాన్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అయితే తమను షియా దేశం పట్టించుకోవట్లేదని, తమకు ఆయిల్ ఆదాయంలో న్యాయవాటా దక్కట్లేదని సున్నీల ఆరోపణ.

సున్నీలకు మద్దతుగా 2012లో పాకిస్తాన్ కేంద్రంగా ‘జైష్ అల్ అడ్ల్ లేదా ఆర్మీ ఆఫ్ జస్టిస్’ పేరుతో ఓ ఉగ్రవాద సంస్థ ఏర్పాటు అయింది. ఇది ఇరాన్ సరిహద్దులోని పాకిస్తాన్ భూభాగం లో ఉంది. ఇరాన్ లో తరుచుగా దాడులు చేసి ఉగ్రవాదులు తిరిగి బలూచిస్తాన్ కు తిరిగి వచ్చి సురక్షితంగా ఉంటున్నారు. ఇదే ప్రాంతంపై ఇరాన్ తాజాగా దాడి చేసింది.

పాక్ అభ్యంతరం

తమ దేశ భూభాగంపై దాడులు చేయడం పై పాకిస్తాన్ మండిపడింది. ఇటువంటి ఏకపక్ష చర్యలు మంచిది కాదని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి ని పిలిచి పాక్ తీవ్ర నిరసను వ్యక్తం చేసింది. ఇరాన్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ఇద్దరు గాయపడ్డారని ప్రకటించింది.

బెలూచిస్తాన్ లోని ఏ ప్రాంతంలో దాడి జరిగింది అనే ఇటూ పాక్, అటూ ఇరాన్ రెండు బయటకు చెప్పలేదు. "ఇటువంటి ఏకపక్ష చర్యలు ఇరుగు పొరుగు సంబంధాలకు అంతమంచివి కావు, ఇరు దేశాల ద్వైపాక్షిక విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి " అని పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. సోమవారం ఇరాన్ తన పొరుగు దేశాలైన ఇరాక్, సిరియాపై దాడులు చేసిన తరువాత పాక్ పై దాడులు చేసింది.

అప్గాన్ సమస్య

గతంలోతాలిబన్ లు నాటో దళాలతో పోరాడినప్పుడు సౌదీ, యూఏఈతో పాటు పాకిస్తాన్ కూడా వారికి మద్దతునిచ్చాయి. అయితే భారత్, ఇరాన్, రష్యా వాటిని వ్యతిరేకించాయి. ఉగ్రవాదం ఎక్కడున్నా ఉగ్రవాదమే అని అప్పట్లో ప్రకటించాయి.

అయితే అప్పట్లో ఇరాన్ చర్యను పాక్ వ్యతిరేకించింది. తమ దేశంలోని షియాలో ప్రాబల్యం పెంచుకునేందుకు తాలిబన్లను వ్యతిరేకిస్తోందని ప్రకటించింది. ప్రస్తుతం ఇదే సున్నీ తీవ్రవాదులు ఇరాన్ పై దాడులు చేస్తుండడంతో ప్రతిగా టెహ్రన్ దాడులు చేస్తోంది.

ఇరాక్, సిరియాలో దాడులు

సోమవారం ఇరాక్ లోని కుర్డిష్ ప్రాంతంపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇర్బిల్ నగరంలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచార కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ప్రకటించింది. అయితే దీనిపై ఇజ్రాయెల్ స్పందించలేదు.

అలాగే సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ గ్రూపును లక్ష్యంగా కూడా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ లో బాంబులు దాడులు చేసి పదుల సంఖ్యలో ఖుద్ ఫోర్స్ సైన్యాన్ని హత్య చేసినందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ప్రకటించింది.

హమాస్- ఇజ్రాయెల్ యుద్దం విస్తరించే వ్యూహమా?

ప్రస్తుత దాడులు పశ్చిమాసియాలో ఉద్రిక్తలు పెంచే పరిస్థితి ఉంది. ఇప్పటికే హమాస్- ఇజ్రాయెల్ దాడులు పరిస్థితిని ఉద్రిక్తంగా మర్చాయి. మరోవైపు హౌతీలు వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేయడంతో అమెరికా,దాని మిత్ర పక్షాలు యెమెన్ పై దాడులు చేస్తున్నాయి.

ఇరాన్, యురేనియం శుద్ది చేయడంలో కీలక దశకు చేరుకుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే తనపై పెద్ద దాడి చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా కూటమిని రెచ్చగొడుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. తనపై ఏదైన ప్రతిదాడి ప్రారంభం కాగానే తనను తాను అటమిక్ బాంబు కలిగిన దేశంగా ప్రకటించుకునే ఉద్దేశంలో భాగంగానే ప్రస్తుత దాడులు చేసిందని అంతర్జాతీయ నిఫుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే సౌదీ ఊరుకుంటుందా? తనకు కూడా అణుబాంబు కావాలని పేచీ పెడితే పరిస్థితి ఏంటీ? ఇవీ సురక్షితంగా ఉంటాయా? తరువాత ఇదీ ప్రపంచ ఆయిల్ సప్లై పై ప్రభావం పడుతుందని అనుమానాలు ఉన్నాయి.

Read More
Next Story