
కాకినాడ బాణసంచా పేలుడు.. పరారీలో ఫ్యాక్టరీ యజమానులు
కాకినాడ సమీపంలో బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో 22 మంది మృతి. పలువురు గాయాలు. ఘటనపై సీఎం చంద్రబాబు స్పందన.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం సమీపంలో జరిగిన బాణసంచా పేలుడు ఘోర విషాదాన్ని మిగిల్చింది. సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ తయారీ కేంద్రంలో సంభవించిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది కార్మికులు సజీవదహనం అయినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
శనివారం ఉదయం కార్మికులు ఎప్పటిలాగే పనికి వెళ్లారు. పొలాల మధ్య ఉన్న ఆరు షెడ్లలో బాణసంచా తయారీ కొనసాగుతోంది. మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఒక్కసారిగా మందుగుండు నిల్వలు పేలాయి. భారీ శబ్దంతో చుట్టుపక్కల ప్రాంతం కుదిపేసింది. కొద్ది క్షణాల్లోనే షెడ్లు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాద సమయంలో 40 నుంచి 50 మంది వరకు కార్మికులు లోపల ఉన్నట్లు తెలిసింది. భోజనం కోసం బయటకు వచ్చిన కొందరు కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
పేలుడు తీవ్రతకు మృతదేహాలు తునకలై పక్కనే ఉన్న పంటచేలలో పడినట్లు గుర్తించారు. గ్రామంలోని ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పరిసర ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది.
ఘటనాస్థలిని పరిశీలించిన అధికారులు 15 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీకి మార్చి 31 వరకు లైసెన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే యజమాని అడబాల అర్జున్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని, అతని కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు.
గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో బాధితుల బంధువుల రోదనలు మార్మోగాయి. తమ కుటుంబ సభ్యుల గురించి సమాచారం కోసం వారు ఆత్రుతగా ఎదురు చూశారు. పలువురు క్షతగాత్రులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పర్యటన ముగించుకుని కాకినాడకు బయలుదేరిన ఆయన బాధితులను పరామర్శించి అండగా ఉంటామని తెలిపినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరినట్లు తెలిసింది. మంత్రి నారాయణ అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో గతంలో కూడా బాణసంచా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2014లో వాకతిప్పలో జరిగిన ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత కూడా పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. జిల్లాలో అనేక బాణసంచా తయారీ కేంద్రాలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం జిల్లా అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు.
Live Updates
- 28 Feb 2026 6:56 PM IST
వేట్లపాలెంలో జరిగిన ప్రమాదంపై రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- 28 Feb 2026 6:55 PM IST
బాణసంచా పేలుడు ధాటికి వేట్లపాలెం గ్రామం వణికిపోయింది. వేట్లపాలెం పరిసరాలు బాధిత కుటుంబాల హాహాకారాలు మార్మోగాయి. పేలుడు అనంతరం వేట్లపాలెం గ్రామ పరిసరాలు హృదయవిదారకంగా మారాయి.
- 28 Feb 2026 6:54 PM IST
వేట్లపాలెం పేలుడుపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
వేట్లపాలెం పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
- 28 Feb 2026 6:53 PM IST
వేట్లపాలెం పేలుడు ఘటన.. అక్కడికి చేరుకున్న సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర పేలుడు
ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

