
టీటీడీకి హైదరాబాద్ భక్తుడి రూ.2.50 కోట్ల విరాళం
ముఖ్యమయిన ట్రస్టులన్నింటికి విరాళం
హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్ట్స్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది.
ఇందులో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ రాజ గోపాల రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
Live Updates
- 23 Jan 2026 5:47 PM IST
KTR 'టెలిఫోన్ ట్యాపింగ్ కేసు' విచారణ దగ్గిర పరిస్థితి ఉద్రిక్తం
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న టెలి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేశాు. అందువల్ల కెటిఆర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సిట్ అధికారులు ముందు హాజరుకావలసి వచ్చింది. ఆయన న్యాయవాదులను లోనికి అనుమతించలేదు. దానితో కెటిఆర్ ఒక్కరే విచారణ అధికారుల ముందు హాజరయ్యారు. కేటీఆర్ ని విచారణకు పిలవడానికి నిరసన గా బిఆర్ ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన వెంట వచ్చారు. దీనితో భారీగా పోలీసులను కూడా మొహరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి విభాగం నాయకులను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే జూబ్లీహిల్స్ పీఎస్‌కు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.
ఇక తెలంగాణ భవన్ (బిఆర్ ఎస్ కార్యాలయం) దగ్గిర కూడా పోలీసులను మొహరించారు. కార్యకర్తలు కార్యాలయం నుంచి బయటకు వెళ్లకుండా తెలంగాణ భవన్ గేట్లు మూసివేసేందుకు యత్నించారు. దీన్ని అడ్డుకోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.
- 23 Jan 2026 5:35 PM IST
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా మీద చార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్
తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారిలో కల్తీ నెయ్యి సరఫరా చేశారన్నఆరోపణల మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ ముగిసింది. ఇందులో36 మందిని నిందితులుగా చేర్చారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో విచారణల ఆధారంగా సిట్ ఛార్జిషీటు దాఖలు చేశారు. కల్తీనెయ్యి సరఫరా అయిందనే విషయాన్ని మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తిరుమలలో పవిత్రమైన లడ్డూ తయారీలో గత ప్రభుత్వం నాణ్యత లేని నెయ్యిని, జంతువుల కొవ్వును ఉపయోగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 సెప్టెంబర్ లో ఆరోపణలు చేశారు. 2024 జూన్ తర్వాతే నెయ్యి నాణ్యతను పరీక్షించి, నెయ్యిలో కల్తీ పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, వైఎస్సార్ జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు, తిరుపతి అదనపు ఎస్పీ (అడ్మిన్) వెంకటరావు, డీఎస్పీలు జి.సీతారామరావు, శివనారాయణ స్వామి, అన్నమయ్య జిల్లా ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ టి.సత్య నారాయణ, ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ కె.ఉమామహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ ఎం.సూర్య నారాయణను సభ్యులుగా నియమించారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీబీఐ నుంచి జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖపట్నం డీఐజీ మురళీ రాంబా, గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి డాక్టర్ సత్యేన కుమార్ పాండా సభ్యులుగా సిట్ లో ఉన్నారు.లడ్డుల 2019-2024 మధ్య తిరుమలకు నెయ్యిసరఫరా చేసిన సంస్థల మీద, క్వాలిటీ చెక్ చేసిన వారి మీద, 15 నెలలపాటు 12 రాష్ట్రాల్లో సిట్ విచారణ సాగింది. కల్తీ నెయ్యి సరఫరాలో బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల హస్తం ఉన్నట్లు సిట్ కనుగొంది. - 23 Jan 2026 4:23 PM IST
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వార్షిక విశేషపూజ
వసంత పంచమి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం వార్షిక విశేష పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ముందుగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్దశ కలశావాహనం గావించి పుణ్యహవచనం, వివిధ క్రతువులను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది.
గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి వాటిని కట్టుదిట్టంగా భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను ఏడాదికోసారి నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది నుండి వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా నిర్వహిస్తున్నారు.
- 23 Jan 2026 4:16 PM IST
మునుగోడులో బ్రాందీ షాపులు టైమింగ్స్ గొడవ
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన టైమింగ్స్ అమలు చేసే పనిని ఆయన అనుచరులు భుజన వేసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ఆదేశాలలో పేర్కొన్నటైమింగ్స్ కే మద్యం దుకాణాలు నడుపాలని బ్రాంది షాప్ యజమానులలతో, ఎక్సైజ్ అధికారులతో ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతనే బ్రాందిషాపులు తెరవాలని యజమానుల మీద కాంగ్రెస్ నాయకులు వత్తిడి తెస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూర్ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే నియమావళి ఉల్లంఘించిన తెరిచిన బ్రాందీ షాప్స్ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ అధికారులు షాపులకు మద్దతు ప్రకటించారు. సంస్థాన్ నారాయణపూర్‌లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను దగ్గరుండి తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు జోరుగాసాగుతున్నాయి.జనం ఈ లొల్లిని వింతగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ గెలుస్తుందాలేక పార్టీ ఏమ్మెల్యే దందా నడుస్తుందా అనేది ప్రశ్న
- 23 Jan 2026 3:54 PM IST
చర్లపల్లి- తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం
సికిందరాబాద్ సమీపంలో ఇటీవల ప్రారంభమయిన చర్లపల్లి నుంచి కేరళ తిరువనంతపురానికి అమృత్ భారత్ రైలు ప్రారంభమయింది.
ఈ రోజు ప్రధాని మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం నుంచి శుక్రవారం నాడు ప్రారంభించారు. అందులో చర్లపల్లి-తిరువనంతపురం ఎక్స్ ప్రెస్ ఒకటి. 3 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా నాలుగు కొత్త రైల్ సర్వీసులను పచ్చ జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. వీటితో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణలు మెరుగుఅవుతాయి.
చర్లపల్లి– తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (17041) వారానికొకసారి నడుస్తుంది. ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు తిరువనంతపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 17042గా బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరుతుంది.గురువారం రాత్రి 11:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.





