
విద్యుత్ వెలుగుల్లో ఈ సారి మేడారం జాతర
నిరంతర విద్యుత్ ప్రసారానికి చర్యలు
తెలంగాణ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలక్క జాతర ఈ సారి కరెంటు వెలుగులో కనువిందు చేయనుంది. జారత జరుగుతున్నంతవరకు విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మేడారం మహాజాతర ఈనెల 28,29,30,31 తేదీల్లో జరుగుతున్నది.
నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ.5కోట్ల నిధులతో ఎన్పీడీసీఎల్ ఏర్పాట్లు పూర్తిచేసింది. జాతర పరసరాల్లో ఎటు చూసినా విద్యుత్ కాంతులు జిగేల్ అనేలా ఏర్పాట్లుసాగుతున్నాయి. జాతర పరిధిలో 193 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. కొత్తగా నార్లాపూర్‌లో రూ.2.50 కోట్లతో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. వీటి ని రన్ చేసేందుకు ఆపరేషన్, ప్రాజెక్టు డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఇద్దరు సీజీఎంలు, ఏడుగురు డీఈలు, 20 మంది ఏడీఈ లు, 150మంది ఇంజనీర్లు, మెంటెనెన్స్ సిబ్బంది కలిపి 350 మంది వరకు విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు.
ప్రత్యేక రైళ్లు
దక్షిణమధ్య రైల్వే మేడారం జాతర ప్రత్యేక రైళ్లను నడిపాలని నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. రాష్ట్రంలోని సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్‌కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల నుంచి మేడారం జాతర ప్రత్యేక రైళ్లు వరంగల్, కాజీపేటల వరకు నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం జాతర ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్ రిజర్వుడ్ జనసాధారణ్ రైళ్లు గా ఉంటాయని, జాతర వెళ్లే భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇవి ఆయా మార్గాల్లోని అన్ని స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. సికింద్రాబాద్-మంచిర్యాల్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సిరిపూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్, నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్, ఖమ్మం-కాజీపేట-ఖమ్మం, ఆదిలాబాద్-కాజీపేట-ఆదిలాబాద్ ల మధ్య ఈ రైళ్లునడుస్తాయి.

