ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
x

ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.

లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

Live Updates

  • 13 Feb 2026 9:27 AM IST

    యాదగిరిగుట్టలో బీజేపీ విజయం

    యాదగిరిగుట్ట ఒకటో వార్డు ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం సాధించారు.

  • 13 Feb 2026 9:26 AM IST

    ఇబ్రహీంపట్నంలో కారుదే గెెలుపు

    ఇబ్రహీంపట్నం ఫలితాలు వెల్లడయ్యాయి. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు.

  • 13 Feb 2026 9:25 AM IST

    ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు తొలి గెలుపు

    సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మొదటి విజయాన్ని నమోదు చేసింది.

    15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలుపొందారు. ఈ ఫలితంతో ఇంద్రేశం మున్సిపల్ పోటీలో కాంగ్రెస్ ఖాతా ప్రారంభమైంది.

  • 13 Feb 2026 8:21 AM IST

    సంగారెడ్డిలో పవర్ కట్

    సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను తారా డిగ్రీ కాలేజీలో ప్రారంభించారు. కాగా కాలేజీ కౌంటింగ్ రూమ్ 6లో పవర్ కట్ కావడంతో అనిశ్చితి నెలకొంది. దాంతో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు.

  • 13 Feb 2026 8:19 AM IST

    ఉమ్మడి వరంగల్ జిల్లా లోని 12 మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రారంభమయింది.

  • 13 Feb 2026 8:19 AM IST

    ఆదిలాబాద్ మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు. జిల్లాలో మొత్తం 435 పోస్టల్ ఓట్లు ఉన్నాయి.

  • 13 Feb 2026 8:18 AM IST

    మధ్యాహ్నానికి ఫలితాలు

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 నగర పాలికల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 వార్డులకు సంబంధించిన ఫలితాలు ఈరోజే వెలువడే అవకాశం ఉంది.

    ఉదయం నుంచే కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు పురపాలికల ఫలితాలు వచ్చే వీలుండగా, సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు ప్రకటించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.

    ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈ నెల 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉపమేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.

    ప్రస్తుతం కొనసాగుతున్న లెక్కింపు ప్రక్రియపై అన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఫలితాలతో స్థానిక పాలన దిశ స్పష్టమయ్యే అవకాశం ఉంది.

  • 13 Feb 2026 8:16 AM IST

    • పురపాలక సంఘాల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.
    • పురపాలికల్లో ప్రతి వార్డుకు ఒక టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు.
    • నగరపాలికల్లో ప్రతి డివిజన్‌కు ఒక టేబుల్ కేటాయించారు.
    • ఒక్కో టేబుల్‌పై ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్ల చొప్పున లెక్కింపు జరుగుతుంది.
    • ఉదాహరణకు జనగామలో 30 వార్డుల్లో మొత్తం 34,821 ఓట్లు పోలయ్యాయి.
    • తొలి రౌండ్‌లో 30 వేల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
    • మిగిలిన 4,821 ఓట్లను రెండో రౌండ్‌లో పూర్తి చేస్తారు.
    • ఉదయం 11 గంటల లోపే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Read More
Next Story