సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడినందుకు మీరిచ్చే గౌరవం ఇదేనా?
x

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడినందుకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని కార్మికుల ప్రాణాలను కాపాడిన ర్యాట్ హోల్ మైనర్ ఇంటిని కూల్చేశారు. ఈ ఘటనపై ప్రియాంక బిజెపిపై విరుచుకుపడ్డారు.


గత నవంబరులో ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికుల చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. చాలా రోజుల పాటు ఎన్నో రకాల ప్రయత్నాల తర్వాత ర్యాట్ హోల్ మైనర్ వకీల్ హసన్‌, ఆయన బందం కార్మికుల ప్రాణాలను కాపాడగలిగారు. అయితే వకీల్ హసన్ ఉంటున్న ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) కూల్చివేత పనులు చేపట్టింది. దీంతో హసన్ ఇల్లు నేలమట్టమైంది.

హసన్ భార్య పంపిన వీడియోను ప్రియాంక X లో పోస్టు చేశారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడినపుడు తన భర్తను అందరూ హీరోలా చూశారని, అయితే ఇప్పుడు తమకు నిలువ నీడ లేకుండా చేశారని ఆ వీడియోలో హసన్ భార్య వాపోయారు.

“అప్పుడు తమ పబ్లిసిటీ కోసం బీజేపీకి చెందిన పెద్ద నాయకులు ఆయనతో ఫొటోలు దిగారు. ఇప్పుడు ప్రచారం ముగియగానే ఈరోజు అదే వకీల్ హసన్‌ను పోలీస్ స్టేషన్‌లో బంధించి ఇంటిని కూల్చేశారు.'' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్నారు.

పేదల ఇళ్లు కూల్చివేయడం, చితకబాదడం, చిత్రహింసలు పెట్టడం, అవమానించడాన్ని తప్పుబట్టిన ప్రియాంక బీజేపీని ‘అన్యాయ్‌ కాల్‌’గా అభివర్ణించారు. దీనికి ప్రజానీకం కచ్చితంగా సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగా.. అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను కూల్చివేసినట్లు డిడిఎ సమర్థించుకుంది. కూల్చేసిన ప్రాంతంలో అభివద్ధి పనుల త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. హసన్ ఇంటిని ధ్వంసం చేసిన కొన్ని గంటలకు ఆయన కుటుంబాన్ని తాత్కాలికంగా మరో చోటికి తరలించాలని డిడిఎ భావించింది. అయితే ఆ ఆఫర్‌ను హసన్ తిరస్కరించినట్లు సమాచారం.

తనకు త్వరలో గోవింద్‌పురి ప్రాంతంలో ఇంటిని మంజూరు చేస్తామని డిడిఎ అధికారులు తనతో చెప్పారని, అయితే అది కేవలం "మౌఖిక హామీ" మాత్రమే కావడంతో వారి ప్రతిపాదనను అంగీకరించలేదని హసన్ తెలిపారు.

హసన్, ఆయన కుటుంబం ఇంటి శిథిలాల మధ్యనే కూర్చొని రాత్రి భోజనం చేస్తున్నట్టు కొన్ని టీవీ ఛానెల్‌లు చూపించాయి.

హసన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి ఫుట్‌పాత్‌పై గడిపాడు. వారికి పొరుగువారు ఆహారం ఇతర అవసరమైన వస్తువులను అందించారు.

Read More
Next Story