
బిర్యానీ హోటళ్లలో రూ.70 వేల కోట్ల ట్యాక్స్ స్కామ్
IT Raids Uncover ₹70,000 Crore Tax Scam in Biryani Chains
హైదరాబాద్ సహా పలు ఇతర రాష్ట్రాల్లోని బిర్యానీ ఫుడ్ చెయిన్ కేంద్రంగా భారీ ఇన్‌కమ్ ట్యాక్స్ స్కామ్ జరిగింది. దాదాపు రూ.70వేల కోట్ల పన్నును ఎగ్గొట్టినట్లు ఐటీశాఖ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ గుట్టును రట్టు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ పరిశ్రమలో ఈ భారీ స్కామ్ జరుగుతున్నట్లు తాజాగా గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్ సాయంతో సుమారు 60 టెరాబైట్ల డేటాను విశ్లేషించి ఈ అక్రమాలను బయటపెట్టారు.
ఒక సాఫ్ట్‌వేర్‌తో అంతా మోసం
హైదరాబాద్‌లోని ఒక బిర్యానీ రెస్టారెంట్ చైన్‌లో ఐటీ చట్టం సెక్షన్ 133A కింద జరిపిన సోదాలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ రికార్డులకు, అసలు అమ్మకాలకు మధ్య భారీ తేడా ఉండటాన్ని అధికారులు గమనించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు వాడుతున్న ఒక బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ మోసం జరుగుతున్నట్లు గుర్తించారు. వినియోగదారులు బిల్లులు చెల్లించినప్పటికీ, సాఫ్ట్‌వేర్‌లో ఆ డేటాను మార్చడం లేదా పూర్తిగా తొలగించడం ద్వారా ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతున్నారు.
మోసం చేస్తుంది ఇలానే
రెస్టారెంట్లు ప్రధానంగా రెండు మార్గాల్లో ఆదాయాన్ని దాస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. యూపీఐ, కార్డు చెల్లింపులను రికార్డు చేస్తూ, కేవలం నగదు రూపంలో వచ్చే ఆదాయానికి సంబంధించిన బిల్లులను సాఫ్ట్‌వేర్ నుండి తొలగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా 30 రోజుల వరకు ఉన్న బిల్లులను సాఫ్ట్‌వేర్ నుంచి పూర్తిగా డిలీట్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన కొద్దిపాటి అమ్మకాలకే ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు.
ఏ రాష్ట్రంలో ఎంత స్కామ్ అంటే
ఈ పన్ను ఎగవేతలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక సుమారు రూ. 2,000 కోట్ల విలువైన బిల్లుల తొలగింపు. తెలంగాణ సుమారు రూ. 1,500 కోట్ల ఎగవేత రికార్డు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా తమిళనాడులో రూ. 1,200 కోట్ల అక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొత్తం రూ. 5,100 కోట్ల మేర అమ్మకాలను తొలగించినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కగట్టారు అధికారులు. ఒక్క హైదరాబాద్‌లోనే 416 కేసుల్లో కోటి రూపాయల పైగా ఆదాయాన్ని దాచిపెట్టినట్లు తేలింది.
అహ్మదాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థ నుంచి సేకరించిన డేటాను హైదరాబాద్‌లోని డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించారు. మొత్తం అమ్మకాల్లో దాదాపు 27 శాతం ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం బయటపడింది కేవలం ఆరంభం మాత్రమేనని, దేశవ్యాప్తంగా ఈ విచారణను మరింత విస్తృతం చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిర్ణయించింది. ఈ అక్రమ ఆదాయంపై పన్నులు మరియు జరిమానాల విధింపు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ స్కామ్‌కు సంబంధించి పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉంది.

