
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో సాహిత్య గౌరవం దక్కింది. ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు.
తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో సాహిత్య గౌరవం దక్కింది. ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. 2026 సంవత్సరానికి గాను ఆయన రచించిన “అనిమేష” కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలో సమాజంలో ఏర్పడిన పరిస్థితులు, మానవీయ కోణాలను “అనిమేష” కవితా సంపుటిలో సిధారెడ్డి చిత్రించారు. ఆ కాలంలోని సామాజిక అనుభవాలను కవిత్వంగా ప్రతిబింబించినందుకు ఈ అవార్డు ప్రకటించారు. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను సాహిత్య అకాడమీ అందజేస్తుంది.
నందిని సిధారెడ్డి ఎవరు?
నందిని సిధారెడ్డి తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత. తెలుగు సాహిత్యంలో తన ప్రత్యేకమైన కవిత్వంతో గుర్తింపు పొందారు. తెలంగాణ భావజాలం, సామాజిక అంశాలు ఆయన రచనల్లో ప్రధానంగా కనిపిస్తాయి. సాహిత్య సేవలతో పాటు సాంస్కృతిక రంగంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా పనిచేసి సాహిత్య అభివృద్ధికి కృషి చేశారు.
నందిని సిధారెడ్డి 1955లో మెదక్ జిల్లా బందారం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడిగా గుర్తింపు పొందారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తి చేశారు. అనంతరం 1981లో “ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు” అనే అంశంపై ఎం.ఫిల్ పట్టా పొందారు. తరువాత “ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత” అనే అంశంపై పరిశోధన చేసి 1986లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఈ అవార్డుతో నందిని సిధారెడ్డి సాహిత్య సేవలకు మరో జాతీయ గుర్తింపు లభించింది. తెలంగాణ సాహిత్య రంగంలో ఇది ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తోంది.

