
రిటైర్ట్ జడ్జికే రూ.1.66 కోట్ల టోకరా..!
సుప్రీంకోర్టు నుంచి నాన్‌బెయిలబుల్ వారెంట్ వచ్చిందంటూ భయబ్రాంతులకు గురిచేసిన నేరగాళ్లు.
దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు ఏకంగా రిటైర్డ్ జడ్జికే టోకరా వేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో బురిడీ కొట్టించారు. వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని, డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ రిటైర్డ్ జడ్జిని భయపెట్టారు. ‘‘విచారణ జరుగుతోంది. కేసు ముగిసే వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాం’’ అంటూ రిటైర్డ్ జడ్జిని భయబ్రాంతులకు గురిచేశారు. ఆయన ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉన్న రెండు ఫోన్ నెంబర్ల ద్వారా మహిళలకు అసభ్యకర ఫోన్లు వెళ్తునస్నాయని అన్నారు.
అంతేకాకుండా ఇందిరానగర్లో మరో కేసు నమోదయిందని చెప్తూ మరింత ఒత్తిడి చేశారు. వీటితో పాటుగా ఆయనపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదు అయిందని, అదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని మరింత భయపెట్టారు. అదే మంచి అదునుగా చూసుకుని దర్యాప్తు కోసం ఆయన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. దాంతో పాటుగా ఆయన భారీ మొత్తంలో నగదు చెల్లించాల్సి ఉందని, విచారణ పూర్తయిన తర్వాత నగదు తిరిగి వస్తుందని నమ్్మబలికారు. అసలికే భయంలో ఉన్న రిటైర్డ్ జడ్జి.. నిందితులు అడిగిన రూ.1.66 కోట్ల మొత్తాన్ని సైబర్ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. కాగా తర్వాత చెప్పినట్లు నగదు తిరిగి రాకపోవడంతో రిటైర్డ్ జడ్జి.. పోలీసులను ఆశ్రయించారు. అప్పుడు అసలు విషయం వెలుగు చూసింది. తాను మోసపోయనని రిటైర్డ్ జడ్జి గుర్తించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

