బడ్జెట్ 2026పై తెలంగాణకు ‘జీరో’
x

బడ్జెట్ 2026పై తెలంగాణకు ‘జీరో’

తెలంగాణ నుంచి వెళ్లిన ఒక విజ్ఞప్తికి చోటియ్యని బడ్జెట్


బడ్జెట్ 2026లో తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక నిధులు దక్కలేదంటూ విమర్శలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. కేంద్రం స్థిరత్వం, క్రమశిక్షణ పేరుతో రాష్ట్రాన్ని పక్కన పెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌లో ప్రజలకే ప్రాధాన్యం ఇచ్చామని, ప్రజాదరణ కోసం కాకుండా స్థిరమైన అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకున్నామని తెలిపినట్లు సమాచారం.

అయితే తెలంగాణ విషయంలో మాత్రం బడ్జెట్ వాస్తవం వేరుగా ఉందని విమర్శకులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని, గతంలో చేసిన హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అంటున్నారు.పట్టణాభివృద్ధి, మున్సిపల్ నిధులు నిలిచిపోయాయని ఆరోపణలు వచ్చాయి. మౌలిక వసతుల ప్రాజెక్టులు కూడా ముందుకు కదలట్లేదని చెబుతున్నారు.

రీజినల్ రింగ్ రోడ్‌కు రూ.34,367 కోట్ల ప్రతిపాదన, హైవేలు, రేడియల్ రోడ్లు, విమానాశ్రయ ప్రణాళికలు ఫైళ్లలోనే ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త రైల్వే లైన్లకు అనుమతులు ఆగిపోయాయని, రైలు కనెక్టివిటీ పెరగట్లేదని అంటున్నారు. విద్యారంగంలో కూడా అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో IIM, నవోదయ విద్యాలయాలు, కేంద్ర విద్యాలయాలకు అనుమతి దక్కలేదని పేర్కొంటున్నారు.

ఉద్యోగాల విషయంలో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు నిలిపివేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. నీటిపారుదల, గృహ నిర్మాణం, ఆర్థిక వృద్ధి అంశాల్లో ప్రకటనలు మాత్రమే ఉన్నాయని, నిధుల కేటాయింపులు లేవని ఆరోపిస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని కూడా చెబుతున్నారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో కేంద్రం ఇవ్వాల్సిన 50 శాతం భాగస్వామ్యం అందలేదని విమర్శలు వచ్చాయి. ఇంధన రంగ సహాయం నిలిచిపోయిందని, పరిశ్రమలకు కూడా తగిన మద్దతు లేదని అంటున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లినా, రాష్ట్రానికి నిధులు మాత్రం రాలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బడ్జెట్ 2026లో తెలంగాణకు ‘జీరో’ కొనసాగుతోందని విమర్శకులు పేర్కొంటున్నారు. ఈ అంశంపై కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Read More
Next Story