
తెలంగాణలో రేపు సెలవు, ఎందుకంటే..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్లకు వెసులుబాటు కల్పించేలా నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగే పోలింగ్ రోజును అధికారిక సెలవుగా ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఆ పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు అమలు కానుంది. అలాగే అక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కూడా సెలవు వర్తిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 8,203 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16,301 బాలెట్ బాక్సులను సిద్ధం చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలను ప్రకటించనున్నారు. పోలింగ్ రోజు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎన్నికల సంఘం కోరుతోంది.

