వేసవి వార్నింగ్: ఎల్‌నినోతో తెలంగాణలో హీట్‌వేవ్ అలర్ట్
x
హైదరాబాద్ నగరంలో కమ్ముకున్న పొగమంచు

వేసవి వార్నింగ్: ఎల్‌నినోతో తెలంగాణలో హీట్‌వేవ్ అలర్ట్

ఈసారి వేసవి ‘వెరీ హాట్’ గురూ,తెలంగాణను అల్లాడించనున్న ఎండలు


తెలంగాణలో వేసవికి ముందే తన ఉనికిని చాటుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గత ఏడాది 2023లో అనుభవించిన మండే వేసవిని మించిపోయే ఎండలు ఈసారి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే సూచనలు కనిపిస్తున్నాయి.


ఈ ఏడాది వేసవికాలంలో ఎల్ నినో ప్రభావం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈవేసవిలో గత ఏడాది కంటే ఎండలు మండిపోయే అవకాశముందని అంచనా వేసినట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.వాయువ్య గాలుల ప్రభావం వల్ల శుక్రవారం నుంచే తెలంగాణలో చలి ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.వేసవిలో తీవ్రమైన వడగాలుల ప్రభావం వల్ల రుతుపవనాలు ఆలస్యంగా ఆరంభం అయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.



తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రంలో శనివారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు. శనివారం అత్యల్ప ఉష్ణోగ్రత పటాన్ చెరులో 10.2 డిగ్రీల సెల్సియస్ నమోదు అయిందని ఐఎండీ అధికారులు తెలిపారు. అత్యధిక పగలు ఉష్ణోగ్రత ఖమ్మం నగరంలో శనివారం 31.6 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. రాజేంద్రనగర్ లో అత్యధిక గరిష్ణ ఉష్ణోగ్రత29.0 డిగ్రీల ఉష్ణోగ్రత, పటాన్ చెరులో 29.4, హయత్ నగర్ లో 29.8, రామగుండంలో 30.3. నిజామాబాద్ లో 31.1, ఆదిలాబాద్ లో 30.3 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 29, హకీంపేటలో 30.6, దుండిగల్ లో 30.8, హన్మకొండలో 30,, హైదరాబాద్ లో 30.8, ఖమ్మంలో 31.6, మహబూబ్ నగర్ లో 30.9, మెదక్ లో 30.2, నల్గొండలో 31 డిగ్రీల అత్యధిక గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత తగ్గుతూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు.

తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్ లో శనివారం అత్యల్ప ఉష్ణోగ్రత 11.7 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 18.4, హకీంపేటలో 14.8, దుండిగల్ లో 14.7, హన్మకొండలో 12, హైదరాబాద్ లో 14.2, ఖమ్మంలో 14.8, మహబూబ్ నగర్ లో 16.5, మెదక్ లో 11.6, నల్గొండలో 17, నిజామాబాద్ లో 15.3, రామగుండంలో 13, హయత్ నగర్ లో 13.6, రాజేంద్రనగర్ లో 11.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.



రాష్ట్రంలో పొడి వాతావరణం

తెలంగాణ రాష్ట్రంలో శనివారం నుంచి ఈ నెల 22వతేదీ వరకు పొడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఎలాంటి హెచ్చరికలు లేని పొడి వాతావరణం వారం రోజుల పాటు ఉంటుందని ఆమె అంచనా వేశారు. ఈ మేరకు శనివారం వెదర్ బులిటెన్ విడుదల చేశారు.హైదరాబాద్ నగరంలో రాత్రివేళల్లో ఆకాశం మేఘావృతమై స్వల్ప పొగమంచు కురుస్తుందని ఆమె వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తూర్పు/ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు.రాగల రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది.

మరో 20 రోజుల పాటు చలిగాలులు
శీతాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నప్పటికీ, ఫిబ్రవరి మొదటి వారం నుంచి వసంత రుతువులోకి అడుగుపెట్టే ముందు రాబోయే 15 నుంచి 20 రోజుల పాటు చలిగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ రెయిన్స్ తెలిపింది.హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో 10డిగ్రీల సెల్సియస్ వరకు, నగరంలో ప్రధాన ప్రాంతాల్లో 12 నుంచి 13డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.

ఎల్-నినో వస్తోంది...
ఎల్-నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. వేసవి మొదటి భాగం అంటే ఫిబ్రవరి నెల రెండవ సగం, మార్చి,ఏప్రిల్ నెలల్లో వడగళ్ల వర్షాలు కురుస్తాయని సాధారణ అధిక వేసవి వేడి ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వేసవి రెండవ భాగం పొడిగా ఉంటుందని, మే, జూన్ మొదటి సగంలో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.

ఈ సంవత్సరం 2023 నాటి వేసవిలాగే ఉంటుంది
ఈ సంవత్సరం 2023వ సంవత్సరం నాటి వేసవికాలంలోలాగా తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ పోస్టులో తెలిపారు. వేసవి ప్రభావం వల్ల ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ ఏడాది వేసవి మొదటి భాగంలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలతో పాటు వేడి కూడా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. అయితే వేసవి రెండవ భాగం సాపేక్షంగా పొడిగా ఉన్నప్పటికీ తీవ్రమైన వడగాలులతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది.ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమై ఏప్రిల్ వరకు ఉండే వేసవి మొదటి భాగంలో వడగళ్ల వర్షాలు కురుస్తాయని, సాధారణ వేసవి వేడి ఉంటుందని వెదర్‌మ్యాన్ చెప్పారు.హైదరాబాద్‌లో వేసవికాలం రెండవ భాగం ముఖ్యంగా మే నెలలో అంటే మే నుంచి జూన్ మధ్య వరకు పొడిగా ఉండి, తీవ్రమైన వడగాలులు వీస్తాయని అంచనా వేశారు.

మరో ఇరవై రోజుల పాటు చలి ప్రభావం
శుక్రవారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గడం ప్రారంభమయ్యాయి.శనివారం ఉదయం నాటికి హైదరాబాద్ నగరంతోపాటు పశ్చిమ తెలంగాణలో 12-14డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 30డిగ్రీల సెల్షియస్ వద్ద సాధారణంగా ఉంది. రాబోయే 20 రోజుల పాటు చలిని ఆస్వాదించవద్చు.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తెలంగాణలో వేసవికాలం తీవ్రంగా ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చలి కొంతకాలం కొనసాగినా, ఫిబ్రవరి మధ్య నాటికి ఎండల ప్రభావం మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకుని, వాతావరణ సూచనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇప్పటివరకు చలిని ఆస్వాదించిన తెలంగాణ… ఇకపై ఎండల సవాల్‌కు సిద్ధమవ్వాల్సిన సమయం వచ్చింది.


Read More
Next Story