
మావోయిస్టుల దాడిలో 11 మంది పోలీసులకు తీవ్రగాయాలు
గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించేందుకు ఉన్నతాధికారులు హెలికాప్టర్లో రాయపూర్ ఆసుపత్రికి తరలించారు
ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కీలకమైన కర్రెగుట్టల అడవుల్లో మందుపాతరలు పేలి 11 మంది భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. కర్రెగుట్టల అడవులు సుమారు 200 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన దట్టమైన అడవులు. ఈ అడవులు దశాబ్దాలుగా మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉండేవి. ఇలాంటి కోటలోకి ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతాదళాలు చొచ్చుకునిపోతున్నాయి. రెగ్యులర్ గా మావోయిస్టులకోసం భద్రతాదళాలు అడవులను గాలిస్తునే ఉన్నాయి. ఈనేపధ్యంలోనే సోమవారం తెల్లవారుజామున ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్(IEDs)లు పేలటంతో కూంబింగ్ చేస్తున్న భద్రతాదళాల్లోని పదకొండుమందికి తీవ్రమైన గాయాలయ్యాయి.
అడవుల్లో భద్రతాదళాలు తమకోసం గాలింపుచర్యలు చేస్తున్న విషయాన్ని మావోయిస్టులు పసిగట్టారు. అందుకనే భద్రతాదళాలు గాలింపుచర్యలు చేస్తున్న ప్రాంతాల్లో అప్పటికే తమ రక్షణకోసం ఏర్పాటు చేసుకున్న ఐఈడీల్లో ఒకదాని తర్వాత మరోదాన్ని మావోయిస్టులు రిమోట్ కంట్రోల్ తో పేల్చారు. దాంతో పదిమంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, ఒక కోబ్రా బెటాలియన్ అధికారికి తీవ్రమైన గాయాలయ్యాయి. విషయం తెలియగానే గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించేందుకు ఉన్నతాధికారులు హెలికాప్టర్లో రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.
గాలింపు చర్యల్లో భాగంగా భద్రతాదళాలు అడవుల్లో చాలా ఐఈడీలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పోయిన ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లలో అనేకమంది మావోయిస్టులు చనిపోగా 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, పెద్దసంఖ్యలో డిటోనేటర్లు, వైద్య పరికరాలు, విద్యుత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విస్తారమైన అడవుల్లో మావోయిస్టులు తలదాచుకోవటానికి వీలుగా అనేక బంకర్లు, సురక్షిత ప్రాంతాలున్నాయి. ఈ విషయాలు తెలుసుకాబట్టే భద్రతాదళాలు కూడా రెగ్యులర్ గా అడవుల్లో కూంబింగ్ చేస్తునే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఈరోజు ఐఈడీలు పేలి 11మందికి తీవ్ర గాయాలయ్యాయి.

