Markapuram Bus Accident
x

ఆంధ్రలో మరో బస్సు ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

ఏదైనా ఘోరం జరిగినపుడు హడావిడి చేయడం మినహా నిరంతర నిఘా, తనిఖీలు ఉండవా? ప్రయాణీకుల ప్రాణాలంటే ఇంత చులకనా?


రెప్పపాటులో జరిగిన ప్రమాదం.. 14 మందిని పొట్టనబెట్టుకుంది. మొన్న కర్నూలులో బస్సు ప్రమాదాన్ని మరువక ముందే ఈ తెల్లవారుజామున మార్కాపురం సమీపంలో అటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది.

తెలంగాణలోని నిర్మల్ నుంచి హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురైంది.

మార్కాపురం మండలం రాయవరం పలకల గనుల వద్ద టిప్పర్, ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో 14 మంది సజీవ దహనమయ్యారు. రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం ఉదయం సుమారు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పలకల క్వారీల మలుపు వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా చీమకుర్తి నుంచి కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ అదుపు కోల్పోయి బస్సును ఢీకొట్టింది. ఢీకొన్న క్షణాల్లోనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి.

మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. వీరంతా కనిగిరి, పామూరు కు చెందినవారని తెలిసింది. బస్సుకు మంటలు అంటుకోగానే కొంతమంది బస్సు దూకి బయటపడ్డారు. గాయ పడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మార్కాపురం నుంచి 3 అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

14మంది సజీవ దహనం

బస్సులో ముందువైపు కూర్చున్న సుమారు 10 మంది కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వెనుక సీట్లలో ఉన్న వారు మంటల నుంచి బయటపడలేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఘటన స్థలంలో బస్సు పూర్తిగా దగ్ధమై ఇనుప అస్థిపంజరంలా మిగిలింది.

టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో మరో 15 నుంచి 20 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి లోకేశ్ ఈ ఘటన బాధాకరమని పేర్కొన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, గాయపడిన వారికి అవసరమైన వైద్యసాయం అందించాలని అధికారులకు సూచించారు.


ఇతర నేతల స్పందనలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. బాధితులకు తక్షణ సహాయం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స కల్పించాలని సూచించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించినట్లు సమాచారం. గాయపడిన వారికి తగిన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో రహదారి భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. అధికారులు తీసుకునే చర్యలు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించడంలో కీలకంగా మారనున్నాయి.

నారాలోకేష్ సంతాపం

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ విచారం వ్యక్తం చేశారు.

‘టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి,’ అని ఆయన ట్వీట్ చేశారు.



Read More
Next Story