మంగళ్‌హాట్‌లో 14 టన్నుల పాడైన మాంసం స్వాధీనం
x

మంగళ్‌హాట్‌లో 14 టన్నుల పాడైన మాంసం స్వాధీనం

ఇతర రాష్ట్రాల నుంచి పాడైన మాంసాన్ని నగర హోటళ్లకు సరఫరా చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.


హైదరాబాద్‌ ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ఆందోళన తలెత్తుతోంది. వరుసగా కల్తీ ఆహారం, చెడిపోయిన ఆహారం అంశాలు వెలుగు చూస్తుండటమే ఇందుకు కారణం. దాదాపు అన్ని ఆహార పదార్థాల విషయంలో కల్తీ కనిపిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాదాపు ప్రతి రోజు ఇటువంటి విషయాన్ని ఒకదాన్ని వీడియోలు, ఫొటోలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కల్తీ ఆహార తయారీకి పాల్పడుతున్నవారిపై కేసులూ నమోదు చేస్తున్నారు. కానీ కల్తీ పిశాచి మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఇటువంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది.

హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో భారీగా పాడైన మాంసం పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ దాడుల్లో సుమారు 14 టన్నుల మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అక్రమంగా మాంసం సరఫరా జరుగుతోందన్న అనుమానంతో చేసిన ఈ దాడుల్లో పెద్ద ఎత్తున పాడైన నిల్వ బయటపడింది.

ఈ కేసులో అఫ్రోజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర నుంచి పాడైన మాంసాన్ని సేకరించి, హైదరాబాద్‌కు తరలించి నగరంలోని పలువురు హోటళ్లకు తక్కువ ధరలకు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. మాంసాన్ని అనారోగ్యకర పరిస్థితుల్లో నిల్వ ఉంచి పంపిణీ చేసినట్లు కూడా తేలింది.

ఇది ప్రజల ఆరోగ్యం, ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విచారణలో అఫ్రోజ్ మాంసం సేకరణ, సరఫరా విషయాలను అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ సరఫరా వ్యవస్థ ఎంతకాలంగా కొనసాగుతోంది, ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములయ్యారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇప్పటికే ఈ మాంసం తీసుకున్న హోటళ్లను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. నగరవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీలు మరింత కఠినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, నిల్వ కేంద్రాలు పరిశుభ్రత నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. ఉల్లంఘనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read More
Next Story