
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యానీ తీసిన ప్రాణం
డ్రంక్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకునే ప్రయత్నంలో మరో యువకుడు బలి.
నూతన సంవత్సర వేడుకలను ప్రపంచమంతా గ్రాండ్‌గా జరుపుకుంది. ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కానీ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకలు విషాదంగా మారాయి. వేడుకల్లో భాగంగా బిర్యానీ తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 15మంది స్పృహ కోల్పోయారు. ఒక వ్యక్తి మరణించాడు. పబ్బులు, క్లబ్‌లు, ఫామ్ హౌస్, రిసార్ట్స్ ఇలా తమకు వీలున్న ప్రదేశాల్లో అందరూ సంబరాలు చేసుకున్నారు.
అదే విధంగా భవానీ నగర్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుక ఊహించని మలుపు తీసుకుంది. అందరిలానే వారు కూడా మద్యం సేవించి, బిర్యానీ తిని చిల్ అవ్వాలనుకున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు కానీ.. 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో పాండు(53) అనే వ్యక్తి మరణించారు. అస్వస్థతకు గురైన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించగా వారికి చికిత్స అందిస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మిగిలాయి.
పోలీసులను తప్పించుకోబోయి యువకుడు మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నియంత్రించడానికి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కామారెడ్డిలో జరిగింది. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం రోడ్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాత్రి అదే మార్గంలో వెళ్తున్న గోపు నరేష్(30) పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. అంతే కారు వేగాన్ని పెంచి ముందుకు దూసుకెళ్లాడు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసిన.. నరేష్ దూసుకెళ్లాడు. అదే వేగం అతడి ప్రాణాలు తీసింది.
వేగంగా వెళ్తున్న కారు దగ్గర్లోని బండరాయిని ఢీ కొట్టింది. అనంతరం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మరణించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. నరేష్‌ను బయటకు తీశారు. కాగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం నరేష్ మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

