
విద్యార్థుల కోసం ప్రత్యేక పథకం.. ప్రకటించిన భట్టి విక్రమార్క
బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట వేసింది ప్రభుత్వం. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, కొత్త కోర్సులు, మౌలిక వసతులపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. పాఠశాలల్లో పెడుతున్న తరహాలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని తమ ప్రభుత్వం భావించిందని, అందులో భాగంగానే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు భట్టి చెప్పారు. అంతేకాకుండా విద్యారంగానికి మొత్తం బడ్జెట్‌లో 8.22 శాతం కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఇంటర్, ఐటీఐ, ఏటీసీలలో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంచి విద్య ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని తమ ప్రభుత్వం గ్రహించిందని, అందుకే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొత్తగా అమలు చేయనున్నారు. ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయని, రాబోయే విద్యా సంవత్సరంలో మరింత పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వెల్ఫేర్ స్కూళ్లలో వసతుల మెరుగుదలకు రూ.100 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. అదే సమయంలో ఈ విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
స్కిల్ యూనివర్సిటీని విద్యాశాఖ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఐటీఐలలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనీలకు ప్రతి నెల రూ.2,000 స్కాలర్‌షిప్ అందించనున్నారు. మొత్తంగా విద్యార్థుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ ఈ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

