ఫుడ్‌పాయిజనింగ్‌తో మరణించే ప్రతి ఆరుగురిలో ఒకరు తెలంగాణ వారే
x

ఫుడ్‌పాయిజనింగ్‌తో మరణించే ప్రతి ఆరుగురిలో ఒకరు తెలంగాణ వారే

2023లో దేశవ్యాప్తంగా నమోదైన ఫుడ్ పాయిజనింగ్ మరణాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. వరుస ఘటనలతో అప్రమత్తమైన అధికారులు.


తెలంగాణలో సంభవిస్తున్న ఫుడ్ పాయింజనింగ్ మరణాలు జాతీయ స్థాయికి చేరాయి. సుమారు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో సంభవిస్తున్న ప్రతి ఆరు ఫుడ్ పాయిజనింగ్ మరణాల్లో ఒకటి తెలంగాణకు సంబంధించే. 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 612 ఫుడ్‌‌పాయిజనింగ్ మరణాలు సంభవిస్తే వాటిలో తెలంగాణ వాటా 108. ఇది నేను చెప్తున్నది కాదు.. మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్(MCCD) ఇచ్చిన 2023 ఏడాదికి సంబంధించి రిపోర్ట్ చెప్తుంది.

ఆ ఏడాది ఇండియాలో నమోదైన 612 కేసుల్లో అసోం 199 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. ఒడిశాలో 56, ఉత్తరాఖండ్‌లో 23 మరణాలు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున విందులు జరిగే ప్రదేశాల్లో ఆహారం నిర్వహణలో లోపాలే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

హాస్టళ్లలో ఆహార లోపాలే కారణం

వివాహాలు, మతపరమైన వేడుకలు, హాస్టళ్లలో భారీగా వంట చేసి సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతోందని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ దాసరి అనూష వివరించారు. గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచిన ఆహారం ప్రమాదకరమవుతుందని ఆమె తెలిపారు. అదే విధంగా భారీగా పెరుగుతున్న స్ట్రీట్ ఫుడ్ కల్చర్ కూడా ఆందోళన కరంగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా వేసవిలో సరయిన నిర్వహణ లేని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జ్యూస్ స్టాల్స్ వల్ల అనేక మంది వాంతులు, విరేచనాలకు గురవుతున్న కేసులు నమోదవుతున్నాయి.

బయటపడుతున్న నిర్లక్ష్యం

2026లో ఇప్పటివరకు కనీసం 250 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. జనవరి 29న సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వడ్డించిన కూరలో దుర్వాసన ఉందని ముందే చెప్పినా పట్టించుకోలేదని సమాచారం. 23 మందిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్కువ మంది స్థిరంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉందని తెలిపారు.

జనవరి 30న ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని బోడియాతండా పాఠశాలలో 38 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మంది పరిస్థితి విషమంగా మారింది. వాంతులు, కడుపు నొప్పితో బాధపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఫిబ్రవరి 6న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 40 మంది విద్యార్థినులు భోజనం తరువాత అస్వస్థతకు గురయ్యారు. అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థినులు తెలిపారు. ప్రారంభంలో ఆసుపత్రికి తరలింపులో ఆలస్యం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తల్లిదండ్రుల సమాచారం తరువాత విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు.

ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించారు. వాంతులు, విరేచనాలు తేలికగా తీసుకుంటే డీహైడ్రేషన్ తీవ్రమవుతుందని చెప్పారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారని తెలిపారు.

తనిఖీలు కట్టుదిట్టం, అవగాహనపై దృష్టి

సమస్య తీవ్రతను ఆహార భద్రత అధికారులు అంగీకరించారు. హోటళ్లు, హాస్టళ్లు, బేకరీలు, వీధి వ్యాపారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో కల్తీ పాలు, సింథటిక్ రంగులు, పాడైన మాంసం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

‘ఈట్ రైట్’ కార్యక్రమాన్ని పాఠశాలలు, కాలేజీల్లో విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు బలోపేతం చేయడం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు పెంచడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కొనసాగుతుందని పేర్కొన్నారు. లైసెన్సింగ్, హైజీన్ ఆడిట్, ఫుడ్ హ్యాండ్లర్ల శిక్షణ కట్టుదిట్టంగా అమలు చేస్తామని వివరించారు.

నిపుణుల మాటలో ప్రజల అప్రమత్తత కూడా అంతే కీలకం. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. అధికారులు చేపడుతున్న చర్యలు, ప్రజల జాగ్రత్తలు కలిసి పనిచేస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు.

Read More
Next Story