
ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ స్వీట్ న్యూస్.. డీఏపై కీలక నిర్ణయం..!
జనవరి నుంచి అమలు, బకాయిల చెల్లింపు విధానం, అదనపు భారం, సంక్షేమ చర్యలు, అధికారుల స్పందనపై వివరాలు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. వాళ్లకు అందించే డియర్‌నెస్ అలవెన్స్(DA)పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి వారికి డీఏను 2.1శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటి వరకు 50.7 శాతంగా ఉన్న డీఏ.. ఈ నిర్ణయంతో 52.8 శాతానికి పెరిగింది. ఈ తాజా పెరుగుదల 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
డీఏ పెంపుతో ఆర్టీసీపై ప్రతి నెల రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గతంలో జూలై 2025లో కూడా 2.1 శాతం డీఏ పెంచి 48.6 నుంచి 50.7 శాతానికి తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. మే 2024లో RPS-2017 అమలు తరువాత ఎలాంటి డీఏ బకాయిలు లేవని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న చివరి డీఏను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పెంపుతో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
డీఏ పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం. డీఏ ప్రకటించడం సంతోషకరమని, కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని నాగిరెడ్డి పేర్కొన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆర్టీసీలో పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి రీజినల్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆరోగ్య సేవల మెరుగుదల, కారుణ్య నియామకాలు, కొత్త ఉద్యోగాల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు వంటి చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేశారు.

