మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులకు 3 రోజుల కస్టడీ
x

మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులకు 3 రోజుల కస్టడీ

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు కస్టడీ అనుమతి ఇచ్చింది. దర్యాప్తులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తాజా పరిణామంగా ముగ్గురు నిందితులకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు విచారణ జరగనుంది. ఉప్పర్‌పల్లి కోర్టు సోమవారం ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మలను కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఈ ముగ్గురిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ చేయనున్నారు.

డ్రగ్స్ నెట్‌వర్క్, సరఫరా మార్గాలపై మరిన్ని వివరాలు సేకరించడమే లక్ష్యంగా దర్యాప్తు కొనసాగనుంది. ఈ కేసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. దర్యాప్తులో భాగంగా 11 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇప్పటివరకు ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురినే పోలీసులు ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. తాజాగా కస్టడీ కోసం వేసిన పిటిషన్‌పై కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈనెల 14న మొయినాబాద్ ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తెలంగాణ ఈగల్ టీమ్, మొయినాబాద్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించింది. ఆ సమయంలో డ్రగ్స్‌తో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో నమిత్ శర్మ కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కస్టడీ విచారణలో డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, గతంలో నిర్వహించిన పార్టీలు ఏమిటి అనే అంశాలపై పోలీసులు ప్రశ్నించనున్నారు. అలాగే నగరంలోని ప్రముఖులతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఈ విచారణ ద్వారా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తదుపరి దర్యాప్తు ఫలితాలు ఈ కేసులో దిశను నిర్ధేశించే అవకాశం ఉంది.

Read More
Next Story