
పెళ్లిళ్లకు 34 రోజుల గ్యాప్... వేల కోట్ల వెడ్డింగ్ బిజినెస్‌కు షాక్?
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) పెళ్లిళ్లకు 34 రోజుల గ్యాప్... వేల కోట్ల వెడ్డింగ్ బిజినెస్‌కు షాక్?
2) మెట్రో టేకోవర్‌కు ఏడాది.. ఇంకా ఎందుకు ఆలస్యం?
3) మెట్రో ఎక్కినా.. బస్సు ఎక్కినా ఒక్కటే కార్డు! ఎప్పటి నుంచి అంటే?
1) పెళ్లిళ్లకు 34 రోజుల గ్యాప్... వేల కోట్ల వెడ్డింగ్ బిజినెస్‌కు షాక్?
ఒక్క పెళ్లి ఆగితే, ఒక కుటుంబం కార్యక్రమం మాత్రమే ఆగుతుందా? కాదు! ఒక పెళ్లి వెనుక పనిచేసే పదుల సంఖ్యలో వ్యాపారాలు. వందల మంది కార్మికులు. వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు జరిగే లావాదేవీలు కూడా ఆగిపోతాయి! ఇప్పుడు తెలంగాణలో 34 రోజుల పాటు పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 10 వరకు శుభ ముహూర్తాలకు విరామం రావడంతో... పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు తగ్గనున్నాయి.
అంటే, కళ్యాణ మండపాల నుంచి క్యాటరింగ్ వరకు. డెకరేషన్ నుంచి ఫోటోగ్రఫీ వరకు. మేకప్ నుంచి డ్రైవర్ల వరకు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ వెడ్డింగ్ ఎకానమీకి 34 రోజుల ఆఫ్ సీజన్! తెలంగాణలో ఏడాదికి జరిగే మొత్తం వివాహాలకు సంబంధించి ఒకే అధికారిక కౌంట్ అందుబాటులో లేకపోయినా, వివిధ ప్రభుత్వ పథకాల గణాంకాలు రాష్ట్రంలో వివాహాల పరిమాణం ఎంత పెద్దదో చూపిస్తున్నాయి. కేవలం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలనే చూస్తే 2023-24లో కలిపి దాదాపు 1.13 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇది మొత్తం వివాహాల సంఖ్య కాదు. ఎందుకంటే ఈ పథకాలకు అర్హత ఉన్న కుటుంబాలే ఇందులో ఉంటాయి. అందుకే రాష్ట్రంలో ఏడాదికి జరిగే వివాహాలను సుమారు 2.5 లక్షలుగా ఒక స్థూల అంచనాగా తీసుకుంటే 34 రోజుల్లో సాధారణంగా జరిగే పెళ్లిళ్ల సంఖ్య సుమారు 19 వేల నుంచి 23 వేల వరకు ఉండొచ్చు.
మొదటి దెబ్బ.. కళ్యాణ మండపాలకే!
పెళ్లి అంటే ముందుగా గుర్తొచ్చేది ఫంక్షన్ హాల్. ముహూర్తాలు లేని సమయంలో కొత్త బుకింగ్స్ ఒక్కసారిగా తగ్గిపోతాయి. కళ్యాణ మండపాల నిర్వాహకుల అంచనా ప్రకారం బుకింగ్స్‌లో 50 నుంచి 80 శాతం వరకు తాత్కాలిక తగ్గుదల ఉంటుందని ఎల్.బి.నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్ యజమాని చెప్పారు. ఒక హాల్‌లో పెళ్లి జరగకపోతే... కేవలం హాల్ రెంట్ మాత్రమే కాదు. అదే సమయంలో క్యాటరింగ్ ఆర్డర్ లేదు. డెకరేషన్ ఆర్డర్ లేదు. వెయిటింగ్ స్టాఫ్ పని తగ్గుతుంది. క్లీనింగ్ సిబ్బంది పని తగ్గుతుంది. డ్రైవర్లకు ట్రిప్పులు తగ్గుతాయి. అంటే ఒక బుకింగ్ చుట్టూ తిరిగే చిన్న చిన్న ఉపాధి అవకాశాలన్నీ ప్రభావితమవుతాయి.
క్యాటరింగ్ నుంచి డెకరేషన్ వరకు... ఎవరి మీద ఎంత ప్రభావం?ఇక క్యాటరింగ్. ఒక పెద్ద పెళ్లిలో వంటమనుషులు, సర్వర్లు, క్లీనింగ్ సిబ్బంది, సరఫరాదారులు. ఇలా చాలా మందికి పని ఉంటుంది. ఈ 34 రోజుల విరామంతో క్యాటరింగ్ బిజినెస్‌లో 40 నుంచి 70 శాతం వరకు తాత్కాలిక ప్రభావం ఉండొచ్చని ఈవెంట్ నిర్వాహకుడు రమేష్ సురపనేని అంచనా వేస్తున్నారు. “పెళ్లిళ్లు తగ్గితే క్యాటరింగ్ ఆర్డర్లు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఈ కాలం మాకు ఆఫ్ సీజన్‌లా మారుతుంది.”
అదే పరిస్థితి డెకరేషన్ బిజినెస్‌ది. స్టేజ్, లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్, ఎంట్రన్స్ సెటప్, ఫొటో బూత్. ఇవన్నీ పెళ్లిళ్లతోనే ముడిపడి ఉంటాయి. అందుకే డెకరేషన్ రంగంలో 50 నుంచి 75 శాతం వరకు తాత్కాలిక తగ్గుదల ఉండొచ్చని వ్యాపార వర్గాల అంచనా.కెమెరా ఆగితే... ఎన్ని పనులు ఆగుతాయి?
ఇక పెళ్లిలో మరో కీలకమైన విభాగం ఫోటోగ్రఫీ & వీడియో. పెళ్లి ఫొటోగ్రాఫర్ నుంచి కెమెరామెన్ వరకు, డ్రోన్ ఆపరేటర్ నుంచి వీడియో ఎడిటర్ వరకు, ఒకే పెళ్లి చుట్టూ చాలా మందికి పని ఉంటుంది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జి.శీను చెబుతున్న అంచనా ప్రకారం వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడియో రంగంలో 40 నుంచి 70 శాతం వరకు పని తగ్గే అవకాశం ఉంది. “పెళ్లిళ్లు తగ్గితే షూటింగ్ అసైన్‌మెంట్లు కూడా తగ్గుతాయి. ఈ 34 రోజుల్లో పని గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.”
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. పెళ్లి ఫోటోగ్రఫీ అంటే కేవలం పెళ్లి రోజు షూట్ కాదు. ప్రీ-వెడ్డింగ్ షూట్. మెహందీ. హల్దీ. రిసెప్షన్. ఆ తర్వాత ఫోటో ఎడిటింగ్, ఆల్బమ్ డిజైనింగ్. ఇలా ఒక పెళ్లి చుట్టూ ఒక పూర్తి సర్వీస్ చైన్ ఉంటుంది.
అసలు షాక్ ఇక్కడే... ఒక పెళ్లి వెనుక ఎంతమంది? ఒకసారి ఈ లిస్ట్ చూడండి...ఫంక్షన్ హాల్. క్యాటరింగ్. డెకరేషన్. ఫ్లోరిస్ట్. ఫోటోగ్రాఫర్. వీడియోగ్రాఫర్. మేకప్ ఆర్టిస్ట్. మెహందీ ఆర్టిస్ట్. బ్యూటీ సర్వీసెస్. డీజే. లైటింగ్. ట్రాన్స్‌పోర్ట్. డ్రైవర్లు. వెయిటర్లు. క్లీనింగ్ స్టాఫ్. సెక్యూరిటీ. ఇన్విటేషన్ ప్రింటింగ్. టైలరింగ్. జ్యువెలరీ. ఇలా చూస్తే, ఒక పెళ్లి అనేది ఒక కుటుంబ వేడుక మాత్రమే కాదు... ఒక చిన్న ఆర్థిక వ్యవస్థ! అందుకే దీన్ని “వెడ్డింగ్ ఎకానమీ” అంటారు.
పెళ్లిళ్లు తగ్గితే, ఒక్క వ్యాపారం కాదు. ఒకదానితో ఒకటి అనుసంధానమైన అనేక రంగాల ఆదాయంపై ప్రభావం పడుతుంది. 34 రోజులు... తర్వాత? మళ్లీ కళ్యాణ మండపాలకు బుకింగ్స్. క్యాటరింగ్‌కు ఆర్డర్లు. డెకరేషన్‌కు డిమాండ్. ఫోటోగ్రఫీకి అసైన్‌మెంట్లు. మేకప్ ఆర్టిస్టులకు బుకింగ్స్. అంటే వెడ్డింగ్ ఎకానమీ మళ్లీ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంది. కానీ ఈ 34 రోజుల గ్యాప్ మాత్రం...పెళ్లి చేసుకునే కుటుంబాలకు విరామం కావొచ్చు. కానీ పెళ్లిళ్లపైనే ఆధారపడే వేలాది మంది వ్యాపారులకు మాత్రం ఇది ఒక పెద్ద ఆఫ్ సీజన్! “ఒక పెళ్లి. ఒక వేడుక కాదు. ఎన్నో కుటుంబాలకు ఉపాధి ఇచ్చే ఎకానమీ!”
2) మెట్రో టేకోవర్‌కు ఏడాది.. ఇంకా ఎందుకు ఆలస్యం?
ఏడాది గడిచినా మెట్రో టేకోవర్ పూర్తి కాలేదు.. అసలు సమస్య ఏంటి? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది అని ప్రకటన వచ్చి ఏడాది పూర్తయింది! కానీ, మెట్రో ఇంకా పూర్తిగా ప్రభుత్వం చేతికి రాలేదు. చర్చలు జరిగాయి. సమావేశాలు జరిగాయి. ఒప్పందం కూడా కుదిరింది. కానీ డబ్బు చెల్లింపు మాత్రం పూర్తి కాలేదు! ఎల్‌అండ్‌టీకి చెల్లించాల్సిన రూ.1,461 కోట్లకు పైగా, మెట్రోపై ఉన్న రూ.13,538 కోట్లకు పైగా రుణం ఈ రెండింటినీ పరిష్కరించాల్సి ఉంది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం 2024లో కేంద్రాన్ని కోరింది. డీపీఆర్‌లు కూడా కేంద్రానికి సమర్పించింది. అయితే, తొలిదశ మెట్రో నిర్వహణ విషయంలో ఎల్‌అండ్‌టీతో స్పష్టమైన ఒప్పందం ఉండాలని కేంద్రం సూచించింది. అంటే, ఫేజ్-2 ముందుకు వెళ్లాలంటే ఫేజ్-1 విషయంలో క్లారిటీ రావాలి. ఇదే సమయంలో ఎల్‌అండ్‌టీ ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించింది. మెట్రోపై ఇప్పటికే వేల కోట్ల రుణభారం ఉండటంతో, మెట్రో నిర్వహణ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో ఎల్‌అండ్‌టీ మెట్రో నుంచి వైదొలగనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.ప్రభుత్వం ఎల్‌అండ్‌టీతో చర్చలు జరిపింది. షేర్ పర్చేస్ అగ్రిమెంట్‌పై ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం ఎల్‌అండ్‌టీకి చెందిన 100 శాతం ఈక్విటీని రూ.1,461.47 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు, మెట్రోపై ఉన్న రుణాన్ని కూడా రీఫైనాన్స్ చేయాలని నిర్ణయించారు.
ఎల్‌అండ్‌టీ ఈక్విటీ కొనుగోలు – రూ.1,461.47 కోట్లు. మెట్రోపై ఉన్న బ్యాంకు రుణాలు రూ.13,538.53 కోట్లు. అంటే, రెండింటినీ కలిపితే సుమారు రూ.15,000 కోట్ల మెట్రో బదిలీ విలువ!ప్రభుత్వం ఈ మొత్తాన్ని నేరుగా చెల్లించడం కాకుండా రుణాలను రీఫైనాన్స్ చేసి, మెట్రో ఆర్థిక నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రయత్నం చేసింది. దీని కోసం, ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నం జరిగింది. కానీ ఇక్కడే మరో అడ్డంకి ఎదురైంది.
తుది దశలో ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ఆశించిన సహకారం రాకపోవడంతో నిధుల సమీకరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మరో మార్గాన్ని అన్వేషిస్తోంది. ఎస్‌బీఐ క్యాపిటల్ సంస్థను ఆశ్రయించింది. ఎల్‌అండ్‌టీకి చెల్లించాల్సిన రూ.1,461.47 కోట్లు, అలాగే రూ.13,538.53 కోట్ల రుణాల రీఫైనాన్సింగ్. ఈ మొత్తం ఆర్థిక వ్యవహారాన్ని పూర్తి చేయడానికి నిధులు సమీకరించాల్సి ఉంది. ఇందుకోసం మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల ముంబయిలో ఎస్‌బీఐ క్యాపిటల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. త్వరగా నిధులు అందించాలని కోరినట్లు సమాచారం.
అంటే, టేకోవర్‌కు ప్రధాన అడ్డంకి ఇప్పుడు ‘డీల్’ కాదు... ‘ఫైనాన్స్’. మరి మెట్రో ఎప్పుడు పూర్తిగా ప్రభుత్వం చేతికి? ఒక వైపు ప్రభుత్వం టేకోవర్ కోసం ఒప్పందం చేసుకుంది. మరోవైపు నిధుల సమీకరణ ఇంకా పూర్తికాలేదు. అందుకే కాగితాలపై టేకోవర్ ప్రక్రియ ముందుకు వెళ్లినా, ఆర్థిక లావాదేవీలు పూర్తికాకపోవడంతో మెట్రో నిర్వహణ ఇంకా ఎల్‌అండ్‌టీ చేతుల్లోనే ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో రెండో దశపై కూడా ఆశలు ఉన్నాయి. కానీ మొదటి దశ టేకోవర్ పూర్తి కాకుండా రెండో దశ విషయంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న కొన్ని కీలక సమస్యలకు పూర్తి పరిష్కారం దొరకడం కష్టమే. అందుకే ఏడాది తర్వాత కూడా “మెట్రో టేకోవర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అనే పరిస్థితి కనిపిస్తోంది.
3) మెట్రో ఎక్కినా.. బస్సు ఎక్కినా ఒక్కటే కార్డు! ఎప్పటి నుంచి అంటే?
హైదరాబాద్‌లో మెట్రో ఎక్కాలంటే ఒక టికెట్. బస్సు ఎక్కాలంటే మరో టికెట్. ఇలా ప్రతిరోజూ వేర్వేరు టికెట్లు, పాస్‌లు, రీచార్జ్‌లతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇకపై ఆ సమస్యకు చెక్ పడుతుంది. ఒక్క కార్డు ఉంటే చాలు. మెట్రోలోనూ, ఆర్టీసీ బస్సులోనూ ప్రయాణించేలా కామన్ మొబిలిటీ పాస్‌ను తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా మెట్రో–ఆర్టీసీ కామన్ మొబిలిటీ పాస్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటి వరకు మెట్రోకు ఒక విధానం. ఆర్టీసీకి మరో విధానం. కానీ కామన్ పాస్ అమల్లోకి వస్తే, మెట్రో + ఆర్టీసీ బస్సు = ఒకే పాస్! ప్రస్తుతం అధికారులు డైలీ, మంత్లీ కామన్ పాస్‌ల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. రెండు వారాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఒక ప్రయాణికుడు ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు చేరుకుని, మెట్రోలో కొంత దూరం ప్రయాణించి, ఆ తర్వాత ఆర్టీసీ బస్సులో ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చిందనుకుందాం. ప్రస్తుతం రెండు రవాణా వ్యవస్థలకు వేర్వేరుగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కామన్ మొబిలిటీ పాస్ వస్తే, ఒకే కార్డుతో ఈ ప్రయాణాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. దీంతో టికెట్ తీసుకునే సమయం తగ్గుతుంది. మెట్రో నుంచి బస్సుకు, బస్సు నుంచి మెట్రోకు. రవాణా మార్పు కూడా మరింత సులభంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, రోజూ రెండు రవాణా వ్యవస్థలను ఉపయోగించే ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉండనుంది.
అసలు చిక్కు ఏంటంటే.. ఆదాయం ఎలా పంచుకోవాలి? కామన్ పాస్ తీసుకురావడం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే, మెట్రో, ఆర్టీసీ మధ్య టికెట్ ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి? ఇదే ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఒక ప్రయాణికుడు మెట్రోలో కొంత దూరం ప్రయాణించాడు. ఆ తర్వాత ఆర్టీసీ బస్సులో గమ్యస్థానానికి చేరుకున్నాడు. అయితే ఆ ప్రయాణికుడి నుంచి వసూలు చేసిన మొత్తం ఛార్జీలో ఎంత మెట్రోకు? ఎంత ఆర్టీసీకి? ఏ నిష్పత్తిలో ఆదాయాన్ని పంచుకోవాలన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ లెక్క తేలితే కామన్ పాస్ అమలుకు మరో కీలక అడుగు ముందుకు పడే అవకాశం ఉంది.
మెట్రో: రోజుకు సుమారు 1,100 రైలు సర్వీసులు. దాదాపు 4.80 లక్షల మంది ప్రయాణికులు.
ఆర్టీసీ: సుమారు 3,200 బస్సులు. రోజుకు దాదాపు 30 వేల ట్రిప్పులు. సుమారు 25 లక్షల మంది ప్రయాణికులు.
అంటే మెట్రో, ఆర్టీసీ రెండింటినీ కలిపితే రోజూ లక్షలాది మంది ప్రయాణికుల ప్రయాణ విధానంపై ఈ కామన్ పాస్ ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రస్తుతం చాలామంది ప్రయాణికులు మెట్రో స్టేషన్ నుంచి తమ ఆఫీస్ లేదా ఇంటికి వెళ్లేందుకు ఆటోలు, బైక్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. మెట్రో–ఆర్టీసీ అనుసంధానం బలపడితే, మెట్రో స్టేషన్ నుంచి బస్సుతోనే గమ్యస్థానానికి వెళ్లే అవకాశం పెరుగుతుంది. దీంతో ప్రజా రవాణాపై ఆధారపడే వారి సంఖ్య కూడా పెరగవచ్చు.
ఒకే కార్డు. మెట్రోకు ఒక టికెట్ కాదు. బస్సుకు మరో టికెట్ కాదు. ప్రయాణం మొత్తం సింపుల్‌గా మార్చే ప్రయత్నమే ఈ కామన్ మొబిలిటీ పాస్.

