
ఎల్‌పీజీ అక్రమ దందా గ్యాంగ్ గుట్టురట్టు
అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లించిన గృహ LPG సిలిండర్లపై భారీ దాడులు. కేసులు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తెలంగాణ గ్యాస్ సప్లైపై ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెస్టారెంట్లలో వెలసిన కట్టెలపొయ్యిలు, మూతబడిన చిరు టిఫిన్ వ్యాపారాలు, క్యూలు కట్టిన ప్రజలే సాక్ష్యం. ఇదే మంచి అవకాశం అనుకున్న కొందరు ఒక ముఠాగా ఏర్పడి.. ప్రజల అవసరమైన ఎల్‌పీజీతో భారీ వ్యాపారమే స్టార్ట్ చేశారు. గ్యాస్ సిలెండర్లను పక్కదారి పట్టిస్తూ.. రెట్టింపు రేట్లకు అమ్ముంకూ అక్రమ దందా షురూ చేశారు. పదులు కాదు వందలు కాదు వేల సంఖ్యలో గ్యాస్ సిలెండర్లను పక్కదారి పట్టించడం ప్రారంభించారు. తాజాగా ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వారి దగ్గర నుంచి సుమారు 3,699 డొమెస్టిక్ గ్యాసిలెండర్లు, మరో 70 ఐదు లీటర్ల గ్యాస్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర సుమారు రూ.1.10 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పక్కా సమాచారం అందడంతో ముఠా స్ఠావరాలపై అధికారులు దాడులు చేశారు. ఈ దాడులతో గృహ వినియోగానికి ఇచ్చే సబ్సిడీ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్న పెద్ద నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇది అవసర సరుకుల చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా సెక్షన్ 6A కింద 1,275 కేసులు నమోదు చేశారు. అదనంగా 216 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ప్రాథమిక విచారణలో హోటళ్లు, తినుబండార దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడానికి గృహ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ చర్యల వల్ల సాధారణ గృహ వినియోగదారులకు సరఫరా దెబ్బతింటుందని అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వానికి ఆదాయ నష్టం కూడా కలుగుతోందని చెప్పారు.
ఇకపై ఇలాంటి అక్రమాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. పంపిణీ కేంద్రాలు, రవాణా మార్గాలు, నిల్వ ప్రదేశాల్లో తనిఖీలు పెంచినట్లు తెలిపారు. పునరావృతంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని గుర్తించడానికి ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సప్లై చైన్‌లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, మధ్యవర్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. సేకరించిన ఆధారాల ఆధారంగా మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని సూచించారు. ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు అధికారులు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముంది.

