
42 మంది మావోయిస్ట్‌ల లొంగుబాటు.. ఇక మిగిలి ఉంది ఐదుగురే..!
తెలంగాణ పోలీసుల ఎదుట 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. PLGA, TSC, DKSZC విభాగాలకు చెందిన కీలక నేతలు ఆయుధాలతో సహా బయటకు వచ్చారు.
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. శుక్రవారం 42 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో బెటాలియన్ కమాండర్‌తో పాటు మూడు కీలక విభాగాల సీనియర్ నేతలు ఉన్నారు. ఈ పరిణామాన్ని తెలంగాణ పోలీసులు “సంస్థ నిర్మాణం పూర్తిగా కుప్పకూలిన దశ”గా పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ ఇన్‌చార్జ్ కమాండర్ సోది మల్లా అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ ఉన్నారు.
ఆయనతో పాటు జేఎంఎంపీ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ కమిటీ మిలిటరీ చీఫ్ చప నారాయణ అలియాస్ గజేందర్ అలియాస్ మధు, అలాగే బీకేఏఎస్‌ఆర్ డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు కూడా లొంగిపోయారు. మొత్తం 42 మంది క్యాడర్లు మూడు విభాగాలకు చెందినవారు. వీరిలో 21 మంది PLGA బెటాలియన్‌కు, 11 మంది తెలంగాణ స్టేట్ కమిటీకి, 10 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవారు.
టీసీఎస్ పతనం
లొంగుబాటు సమయంలో మావోయిస్టులు భారీగా ఆయుధాలు అప్పగించారు. వీటిలో 5 ఏకే-47 రైఫిళ్లు, 4 ఎస్ఎల్ఆర్‌లు, 3 INSAS రైఫిళ్లు, 6 .303 రైఫిళ్లు, 9 ఎంఎం స్టెన్ గన్, 2 8ఎంఎం రైఫిళ్లు, 10 సింగిల్ షాట్ గన్స్, 9 ఎంఎం పిస్టల్, రెండు రివాల్వర్లు, BGL గన్ మరియు ఎయిర్ గన్ ఉన్నాయి. అదనంగా రెండు దేశీయ గ్రెనేడ్లు కూడా అప్పగించారు. మొత్తం 36 ఆయుధాలతో పాటు 1007 తూటాలు, 800 గ్రాముల బంగారం పోలీసులకు అప్పగించారు.
ఈ బంగారం తెలంగాణ స్టేట్ కమిటీ నిధులుగా గుర్తించబడినట్లు సమాచారం. లొంగిపోయిన క్యాడర్లకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. ఈ భారీ లొంగుబాటు తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ (TSC) పూర్తిగా నిర్వీర్యమైందని పోలీసులు ప్రకటించారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలను సమన్వయం చేసిన ఈ కమిటీ ఇప్పుడు కార్యాచరణ స్థాయిలో లేదని స్పష్టం చేశారు.
PLGA బెటాలియన్ కూడా దాదాపుగా విచ్ఛిన్నమైందని భద్రతా వర్గాలు తెలిపాయి. వరుస లొంగుబాట్లతో నాయకత్వ శూన్యత ఏర్పడినట్లు అధికారులు వివరించారు. 2024 నుండి ఇప్పటివరకు 761 మంది మావోయిస్టులు లొంగిపోగా, 2026లోనే 205 మంది బయటకు వచ్చారు.
అందరికీ హెల్త్ కార్డులు
లొంగిపోయిన 42 మందికి ప్రభుత్వం మొత్తం రూ.1.93 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు చెందిన ఒక్కరికి రూ.4 లక్షలు, మిగతా 41 మందికి తలా రూ.25 వేల తాత్కాలిక సాయం అందించారు. అవసరమైన డాక్యుమెంట్లు పూర్తయిన తర్వాత పూర్తి సాయం ఇవ్వనున్నారు. అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2024–2026 మధ్య లొంగిపోయిన ప్రతి ఒక్కరికి ఈ సౌకర్యం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇంకా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న క్యాడర్‌ను కూడా లొంగిపోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఐదుగురు మాత్రమే వివిధ రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో గణపతి, నరహరి, సుజాత, మంగ్తు, రూపి ఉన్నారు. వీరందరినీ ప్రభుత్వ పునరావాసాన్ని స్వీకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

