Adulterated Ghee
x

బంజారాహిల్స్‌లో 460 కిలోల కల్తీ నెయ్యి పట్టివేత

టాస్క్‌ఫోర్స్ దాడుల్లో రూ.18.26 లక్షల విలువైన నకిలీ నెయ్యి, ప్యాకేజింగ్ సామగ్రి స్వాధీనం. నిందితుడు అరెస్ట్, దర్యాప్తు కొనసాగుతోంది.


నగరం నడిబొడ్డున సాగుతున్న భారీ కల్తీ నెయ్యి దందాకు పోలీసులు చెక్ పెట్టారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన మెరుపు దాడుల్లో 460 కిలోల నకిలీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్ పరిధిలోని ఓ నివాస ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. అధికారులు నిఘా పెట్టారు. బుధవారం గోల్కొండ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి రోడ్ నం.12లో సోదాలు చేపట్టారు.

ప్రైడ్ డెయిరీ పేరుతో నడుస్తున్న కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ నెయ్యిని గుర్తించారు. మొత్తం 460 కిలోల నెయ్యి పట్టుబడింది. మార్కెట్ విలువ సుమారు రూ.18.26 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సోదాల్లో ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ఉన్న నకిలీ ప్యాకెట్లు, సీళ్లు, ప్యాకేజింగ్ యంత్రాలు కూడా బయటపడ్డాయి. వీటి సహాయంతో వినియోగదారులను మోసం చేస్తూ మార్కెట్‌లో సరఫరా చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

నిందితుడు మహ్మద్ జునైద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కల్తీ నెయ్యిని పలు హోటళ్లకు, శుభకార్యాలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసిన నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మాసబ్ ట్యాంక్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో ఆహార భద్రతపై అధికారులు మరింత నిఘా పెంచినట్లు తెలుస్తోంది.

Read More
Next Story