
దుబ్బాకలో వీధి కుక్కల వీరంగం.. గంటలో 15 మందిపై దాడి
రెండు వార్డుల్లో వరుస దాడులు, గాయపడిన వారికి టీకాలు, స్థానికుల్లో భయం, చర్యలు కోరుతున్న ప్రజలు.
సిద్ధిపేట జిల్లా డబ్బాక పట్టణంలో వీధి కుక్కలు వీరంగం చేస్తున్నాయి. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మనిషి వాసన తగలడం ఆలస్యం అమాంతం పైన పడి దాడులు చేస్తున్నాయి. ఈ దాడులు స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. శుక్రవారం అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ఒక్క గంట వ్యవధిలోనే 15 మందిపై దాడులు జరగడం స్థానికుల్లో భయాన్ని పెంచింది.
ఈ ఘటనలు తక్కువ సమయంలోనే రెండు వేర్వేరు వార్డుల్లో చోటుచేసుకున్నాయి. వార్డు 16లో 10 మందిపై కుక్కలు దాడి చేయగా, వార్డు 20లో మరో ఐదుగురు గాయపడ్డారు. వరుసగా జరిగిన ఈ దాడులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.
గాయపడిన వారిని వెంటనే డబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందించి యాంటీ రేబీస్ టీకాలు వేశారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనల నేపథ్యంలో పట్టణంలో వీధి కుక్కల సంచారం పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దాడులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. పట్టణంలో ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో అధికారులు తీసుకునే చర్యలపై స్థానికులు దృష్టి సారించారు.

