
సిద్ధాపూర్‌లో ఎకోటౌన్ వేస్ట్ ఫెసిలిటీకి జీహెచ్ఎంసీ ప్లాన్ !
కిటాక్యుషు మోడల్‌తో వ్యర్థాలను శక్తిగా మారుస్తున్న ప్రణాళిక. డుండిగల్, పారిగి ప్రాజెక్టులకు అడ్డంకులు. నెట్ జీరో లక్ష్యంపై దృష్టి.
వ్యర్థాల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యర్థాలను రీసైకిల్ చేసేలా ఒక ఎకో-టౌన్ ఫెసిలిటీ నిర్మించాలని నిర్ణియించుకుంది. ఇందులో భాగంగానే సిద్దాపూర్‌లో 86 ఎకరాల్లో జపాన్ తరహా ఎకో టౌన్ ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికను ముందుకు తీసుకొచ్చింది. భూమి కేటాయింపు పూర్తయ్యాక పనులు ప్రారంభమవుతాయని అధికారులు తాజా వివరాలు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా సిద్దాపూర్‌లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూమిపై ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో అమలు చేయనున్నారు. సంప్రదాయ డంప్ యార్డులకు బదులుగా పూర్తిగా మూసివేత, కంటైనర్ ఆధారిత వ్యవస్థలో కేంద్రం పనిచేస్తుంది.
చెత్త నుంచి శక్తి వరకు
తడి వ్యర్థాలను బయో-సీఎన్‌జీ, కంపోస్ట్‌గా మార్చనున్నారు. పొడి వ్యర్థాలను రీసైకిల్ చేసి, రిఫ్యూస్ డెరైవ్డ్ ఫ్యూయల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ముల్లర్ 3ఎ డ్రై డైజెషన్ సాంకేతికతను ఉపయోగిస్తారు. తక్కువ నీటితోనే ప్రాసెసింగ్ పూర్తి చేస్తారు. బయో-ఫిల్టర్ల ద్వారా దుర్వాసన నియంత్రణ ఉంటుంది. లీచేట్ సమస్య రాకుండా ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. కాలుష్య నియంత్రణ కోసం సీఈఎంఎస్ వ్యవస్థను కాలుష్య నియంత్రణ మండళ్లకు అనుసంధానిస్తారు.
జపాన్ భాగస్వామ్యం, నెట్ జీరో లక్ష్యం
2025లో జపాన్ పర్యటన తరువాత ఈ ప్రణాళిక వేగం అందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థిరమైన అభివృద్ధి అవసరమని, భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని పేర్కొన్నారు. జపాన్‌లోని కితాక్యుషు(Kitakyushu) మోడల్‌ను హైదరాబాద్‌లో అమలు చేయాలని సూచించారు. రెండు నగరాల మధ్య సిస్టర్ సిటీ సంబంధాలు బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. జపాన్ మేయర్ కాజుహిసా టాకేఉచి తెలంగాణకు సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధమని తెలిపారు. పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు గ్రీన్ టెక్నాలజీలకు తెలంగాణ అనుకూల వాతావరణం కల్పిస్తోందని చెప్పారు.
కితాక్యూషు మోడల్ అంటే ఏంటి?
జపాన్‌లో అభివృద్ధి చెందిన ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానమే కితాక్యూషు మోడల్. ఒకప్పుడు తీవ్ర కాలుష్యంతో ఉన్న ఈ నగరం శాస్త్రీయ ప్రాసెసింగ్, కట్టుదిట్టమైన పర్యావరణ విధానాలతో గ్రీన్ సిటీగా మారింది. ఈ మోడల్‌లో చెత్తను డంప్ చేయడం కాదు వనరుగా మార్చడం ప్రధాన లక్ష్యం. సర్క్యులర్ ఎకానమీ విధానంలో ఒక పరిశ్రమ వ్యర్థం మరొక పరిశ్రమ ముడి సరుకుగా ఉపయోగిస్తారు. మూసివేత వ్యవస్థల్లో వ్యర్థాలను వర్గీకరించి రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ కాని చెత్తను ఇంధనంగా మార్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. గాలి, నీటి కాలుష్యాన్ని నియంత్రించే సాంకేతికత అమలు చేస్తారు. ప్రభుత్వం పరిశ్రమలు పౌరులు కలిసి పనిచేసే సమగ్ర విధానం కిటాక్యుషు మోడల్.
పారిగి ప్రాజెక్ట్‌కు కోర్టు బ్రేక్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల మండలంలోని పారిగి నగర్‌లో 18 నెలల క్రితం వ్యర్థ కేంద్రం పనులు ప్రారంభమయ్యాయి. భూస్వాములు భూముల విలువ తగ్గుతుందని కోర్టును ఆశ్రయించారు. కేసు ప్రస్తుతం ఎన్జీటీ ముందు పెండింగ్‌లో ఉంది. మార్చి 6న తుది వాదనలు జరగనున్నాయి. ఆధునిక సాంకేతికతతో కాలుష్య సమస్యలు ఉండవని జీహెచ్‌ఎంసీ వాదిస్తోంది.
డుండిగల్‌కు అనుమతి పెండింగ్
డుండిగల్‌లో 85 ఎకరాలు, స్పాల్‌నగర్‌లో 17 ఎకరాలను అదనపు కేంద్రాల కోసం గుర్తించారు. అయితే ఔటర్ రింగ్ రోడ్ సమీప నిబంధనల కారణంగా డుండిగల్ భూమికి హెచ్‌ఎండీఏ అనుమతి ఇంకా రాలేదు. 2025 మేలో మినహాయింపు కోరినా స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రతిపాదిత కేంద్రాలు పూర్తిగా ప్రారంభమైతే జవహర్‌నగర్ డంప్ యార్డ్‌పై భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. వ్యర్థాలను వనరులుగా మార్చే సర్క్యులర్ ఎకానమీ దిశగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. నగరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో చర్యలు కొనసాగుతున్నాయి.

