
వాహనయజమానులకు రవాణాశాఖ ‘ఆటోడెబిట్’ షాక్
వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే యజమానుల నుండి బ్యాంకుల ఖాతానెంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ నెంబర్ కూడా తీసుకుంటున్నారు
రవాణాశాఖ ఉన్నతాధికారులు వాహన యజమానులకు పెద్ద షాకిచ్చారు. షోరూముల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్ అనే పద్దతిని ప్రవేశపెట్టిన ఉన్నతాధికారులు పట్టుమని నాలుగురోజులు కూడా వాహన యజమానులకు సంతోషాన్ని మిగిల్చలేదు. (Traffic Fines)చలానాల వసూళ్ళల్లో కొత్త పద్దతిని ప్రవేశపెట్టడం ద్వారా వాహన యజమానులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. విషయం ఏమిటంటే ఈమధ్యనే ముఖ్యమంత్రి (Revanth)ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతు ట్రాఫిక్ చలాన్ల వసూళ్ళకు(Bank Accounts)బ్యాంకు ఖాతాలను అనుసంధినిస్తే(Auto Debit) ‘ఆటో డెబిట్’ పద్దతిలో చలానాలు అప్పటికప్పుడే వసూళ్ళయిపోయే విధానం వస్తే బాగుంటుందన్నాడు. దానిపై రాజకీయపార్టీలతో పాటు అన్నీ వర్గాల జనాల్లోను తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.
అయితే వ్యక్తమైన వ్యతిరేకతను పట్టించుకోకుండా రవాణాశాఖ ఒక పద్దతిని ప్రవేశపెట్టేసింది. అదేమిటంటే వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమానుల బ్యాంకు ఖాతాల వివరాలను కూడా ఇవ్వాల్సిందే అనే అనధికారిక నిబంధనను అమల్లోకి తెచ్చింది. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే యజమానుల నుండి బ్యాంకుల ఖాతానెంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ నెంబర్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ కోసమే అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నిజంగా అడ్రస్ ప్రూఫ్ కోసమే అయ్యేట్లయితే ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది.
ఎలాగూ లైసెన్సు, ఇన్సూరెన్స్ లో ఇంటి అడ్రస్సులు కూడా ఉంటాయి. ఇంటి అడ్రస్ కోసం ఆధార్ కార్డును చూపిస్తే ఉన్నతాధికారులు అంగీకరించటంలేదు. ఎందుకంటే అడ్రస్సులు మారినపుడు యజమానులు అడ్రస్ లను అప్ డేట్ చేయటంలేదని ఉన్నతాధికారులు అంటున్నారు. కాబట్టే కచ్చితంగా బ్యాంకు ఖాతాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు. ఈ వివరాలు ఇవ్వకపోతే వాహనాల రిజిస్ట్రేషన్ కావటంలేదు.
యజమానులు తమ బ్యాంకు ఖాతాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఇవ్వకపోతే వాహనాల రిజిస్ట్రేషన్లు కావటంలేదు కాబట్టి వేరేదారిలేక అడిగిన వివరాలు ఇస్తున్నారు. ట్రాఫిక్ జరిమానాలను ఆటోమేటిక్కుగా వసూలు చేయటం కోసమే ఆటోడెబిట్ విధానం కోసమే బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుంటున్నారని యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని షోరూముల్లో అయితే వాహనాల రిజిస్ట్రేషన్లకు ఇవ్వాల్సిన వివరాలతో కూడిన డిస్ ప్లేబోర్డులను కూడా పెడుతున్నాయి. అందులో బ్యాంకు ఖాతాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఇవ్వాల్సిందే అని ఉంది.
వాహనాలను అతివేగంతో నడపటం, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ లాంటివి లేకుండా నడపటం, హెల్మెట్ లేకుండా నడపటం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించటం అనేవి చాలామంది వాహనాల యజమానులకు మామూలైపోయింది. దాంతో రవాణాశాఖ ఉన్నతాధాకారులు జరిమానాలు విధిస్తున్నారు. అధికారులు జరిమానాలు విధిస్తుంటే కొందరు కడుతున్నారు, చాలామంది కట్టడంలేదు. దాంతో రవాణాశాఖకు ప్రతిఏటా వందల కోట్లరూపాయల ఆదాయం పోతోంది.
జరిమానా కట్టకపోగా రోడ్డుపైన పోలీసులు ఆపి అడిగినపుడు వారితో కొందరు యజమానులు గొడవలు పడుతున్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే చలానాల వసూళ్ళకు రేవంత్ ఆటోడెబిట్ అనే పద్దతిని ప్రస్తావించింది. ఈ పద్దతిని ఉన్నతాధికారులు ఎంతకాలం కొనసాగిస్తారో చూడాల్సిందే.

