మండే ఎండలకు తాత్కాలిక బ్రేక్: తెలంగాణలో 16 నుంచి వర్షాలు
x
మార్చి 16 నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం : ఐఎండీ అంచనా

మండే ఎండలకు తాత్కాలిక బ్రేక్: తెలంగాణలో 16 నుంచి వర్షాలు

ఉగాది, రమజాన్ వేళ తెలంగాణలో వర్షాలు…వడగళ్ల వానలు, పిడుగుల ముప్పు… తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్


తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారబోతోంది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. మార్చి 16 నుంచి 20వతేదీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశముండగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు.ద్రోణి ఒకటి జార్ఖండ్ ప్రాంతం నుంచి విదర్భ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఏర్పడిందని ఆమె తెలిపారు. ఈ వర్షాల ప్రభావం కారణంగా తదుపరి నాలుగు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపి మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఉత్తర,పశ్చిమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని డైరెక్టరు వివరించారు.

ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు

మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ రెయిన్స్ తెలిపింది. మార్చి 17, 18 మరియు 19 తేదీల్లో వర్షాల తీవ్రత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఈసారి ఉగాది, రమజాన్ పండుగలు వర్షాలతో ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.రాష్ట్రంలో మార్చి 15వ తేదీ వరకు వేడి, పొడి వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. మార్చి 15, 16 తేదీల మధ్య అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పిడుగులు పడే అవకాశం

ఈ వేసవికాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వ్యతిరేక దిశలో వీచే గాలులు, ఉష్ణ తీవ్రత వల్ల ఆకాశంలో సహజసిద్ధంగా ఏర్పడే విద్యుత్ పాతాన్ని పిడుగు అంటారని ఆయన పేర్కొన్నారు.

పిడుగు పాటు రక్షణ ఇలా...

ఈ వేసవిలో ఉరుములుమెరుపులతో పాటు కురిసే వర్షంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని డాక్టర్ ఎ ధర్మరాజు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నపుడు సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువులకు దూరంగా వెళ్లాలని కోరారు. పొలాల్లో పనిచేస్తున్న రైతులు, పశువుల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని ఆయన సూచించారు. కారు, బస్సుల్లో ఉంటే అన్ని తలుపులు మూసి వేయాలని కోరారు. పిడుగులు పడినపుడు మీరు బహిరంగ ప్రదేశాల్లో ఉంటే రబ్బరు చెప్పులు ధరించి, చెవులు మూసుకొని తల నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలని ఆయన సూచించారు. అలా కూర్చుంటే పిడుగు నుంచి రక్షణ పొందవచ్చన్నారు.

జాగ్రత్తలు పాటించండి

పిడుగులు పడుతున్నపుడు మీరు ఇంట్లో ఉంటే తలుపులు, కిటికీలు మూసివేయాలని, పిడుగుల శబ్ధం ఆగిపోయిన 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నపుడు చెట్ల కింద, చెట్ల సమీపంలో టవర్లు, చెరువుల వద్ద ఉండరాదు.పిడుగులు పడుతున్నపుడు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు, మొబైల్స్ వాడరాదు. పిడుగులు పడుతున్నపుడు చేతులు కడగొద్దు, నీటిలో ఉండటం, స్నానం చేయడం తగదు. పిడుగులు పడే సమయంలో మోటారుసైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్తంభాలకు, ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. వాహనంలో ఉంటే లోహపు వస్తువులను తాకరాదు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నపుడు మీ మెడ వెనుక జుట్టు నిక్కబొడుచుకోవడం లేదా చర్మం జలదరింపు ఉంటే మెరుపు, పిడుగు పడటానకిి సూచన అని చెప్పారు.

అక్కడక్కడా మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిలాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16 నుంచి 23 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు.ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసిన ఒక తాజా సమాచారంలో వర్షాల గురించి హెచ్చరిక జారీ చేశారు.‘‘ప్రాథమిక వాతావరణ నమూనాల విశ్లేషణ ప్రకారం మార్చి 16 నుంచి 23 మధ్య ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే విశ్లేషణలలో ఈ నమూనాలు మారవచ్చు.రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది. సురక్షితంగా ఉండండి’’అంటూ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు పిడుగుల ప్రమాదం నుంచి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. వర్షాలు, ఈదురుగాలులు కొనసాగనున్నందున వచ్చే రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు.



Read More
Next Story