ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా కావాలా? అయితే ఇలా దరఖాస్తు చేయండి!!
x

ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా కావాలా? అయితే ఇలా దరఖాస్తు చేయండి!!

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం అమలుకు రంగం సిద్ధమైంది. 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా లభిస్తుంది.


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ స్కీంలో ప్రతి ఒక్కరూ చేరవచ్చు. ఎటువంటి మినహాయింపులు లేవు. ఈస్కీంలో చేరే 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా లభిస్తుంది. ‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన’ (పీఎంజేఏవై) కింద ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్కీంను అక్టోబర్ 29న ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు.



దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్‌ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆయుష్మాన్‌ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. దీనికింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్‌ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి చెరి సగంగా పంచుతారు.

సీజీహెచ్‌ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్య, ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు కూడా ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు.

ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్‌ లేదా ఆయుష్మాన్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం జేఏవై పోర్టల్‌లో ‘యామ్‌ ఐ ఎలిజిబుల్‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. దీంతో beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ క్యాప్చా, మొబైల్‌ నంబర్‌, ఓటీపీ ఎంటర్‌ చేయాలి. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఆమోదం కోసం ఎదురు చూడాలి. ఆయుష్మాన్‌ కార్డు సిద్ధమైన తర్వాత బీమా కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్‌ ఒక్కటే సరిపోతుంది.


Read More
Next Story