హైదరాబాద్ కబుతర్ ఖానాల నీడలో ఆరోగ్య సంక్షోభం
x
హైదరాబాద్ నగరంలో ప్రజలకు పెనుముప్పుగా మారిన పావురాల సమూహం

హైదరాబాద్ కబుతర్ ఖానాల నీడలో ఆరోగ్య సంక్షోభం

పావురాల రెట్ట డస్ట్ పీలిస్తే లంగ్స్ ఇన్ఫెక్షన్: డాక్టర్ల హెచ్చరిక


హైదరాబాద్ నగరంలో (Hyderabad)పావురాల ప్రేమ ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారింది.కబుతార్ ఖానాల్లో పావురాళ్ల సంచారం (pigeon houses)వల్ల రెట్టలతో నిండిన ప్రాంతాలు ప్రజలకు శ్వాసకోశ సమస్యలు పెంచుతున్నాయి.పాతబస్తీ నుంచి సుల్తాన్ బజార్ వరకు అన్ని వయస్సుల ప్రజలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పావురాళ్లకు గింజలు వేస్తూ వాటి సంఖ్యను విపరీతంగా పెంచుతున్నారు.చారిత్రక కబుతార్ ఖానాల్లో వేలాది పావురాల్ని చూసే సంప్రదాయం ఉన్నప్పటికీ, వీటి రెట్టలు, విసర్జనలు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. పావురాల విసర్జన, రెట్టల పొడి వల్ల శ్వాస తీసుకోవడం, ఊపిరితిత్తుల అలర్జీలు, బ్రోన్కైటిస్, హిస్టోప్లాస్మోసిస్ వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.హుస్సేనీఆలం, సుల్తాన్ బజార్, ముసల్లం జంగ్ వంతెన, నాంపల్లి, ఓయూ వంటి ప్రాంతాలు పావురాల హాట్‌స్పాట్లుగా మారాయి. ఈ సమస్యపై తెలంగాణ అసెంబ్లీలోనూ ఇటీవల చర్చ జరిగింది.


రెక్కలు టపటప లాడిస్తూ...
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రెక్కలు టప టప లాడిస్తూ ఎగురుతున్న పావురాళ్లు ప్రజలు వేసిన గింజలు తింటూ అక్కడే రెట్టలు వేస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పావురాళ్ల రెట్టల వల్ల ప్రజలకు ఊపిరితిత్తుల సమస్యలతో ప్రాణాలకు ముప్పు(health crisis) ఏర్పడుతుందని తెలిసినా, కొందరు ఫుణ్యం వస్తుందనే భ్రమతో పావురాళ్లకు గింజలు వేస్తూ వీటి సంతతిని అభివృద్ధి చేస్తున్నారు. నగర ప్రజలు పావురాళ్ల ప్రేమికులుగా వాటిని సంరక్షిస్తున్నారు.హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో 200 సంవత్సరాలుగా పావురాళ్ల కోసం గూళ్లను నిర్మించారు.హుస్సేన్ ఆలం, సుల్తాన్ బజార్‌లోని చారిత్రాత్మక కబుతార్ ఖానాల్లో పావురాలకు చారిత్రాత్మక పావురాల గూళ్లను నిర్మించారు.ఈ గూళ్లలో వేలాది పావురాలు ఆశ్రయం ఉంటున్నాయి.

200 ఏళ్ల కబుతర్ ఖానా చరిత్ర
రెండు శతాబ్దాలుగా పాత నగరంలోని హుస్సేన్ ఆలం కబుతార్ ఖానా వద్ద నిర్మించిన గూళ్లలో పావురాళ్లు నిత్యం సందడి చేస్తుంటాయి.పావురాళ్ల ప్రేమికులు నిత్యం పావురాలకు ఆహారం పెడతుంటారు. పావురాళ్లకు గింజలు వేస్తే వారి పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.కబుతర్ ఖానాలో రెండువేలకు పైగా పావురాలకు వసతి కల్పించారు. ఈ కబుతర్ ఖానాను 200 సంవత్సరాల క్రితం కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన సిద్ధిక్ ఇబ్రహీం షా నిర్మించారు. ఈ కబుతర్ ఖానాను ఇబ్రహీం షా పక్షుల పట్ల ప్రేమతో 100 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు.పావురాలకు సంబంధించిన ఇంటి నిర్వహణను అతని వారసులు చూసుకుంటున్నారని స్థానిక పాతబస్తీ నివాసి షేక్ సాదిక్ అహ్మద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ కబుతర్ ఖానా పాతబస్తీ నివాస ప్రాంతంలో ఉండటంతో అన్ని మతాలకు చెందిన ప్రజలు ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఈ ప్రదేశాన్ని సందర్శించి పావురాళ్లకు ఆహారం పెడుతున్నారని ఆయన తెలిపారు.



కోఠి సుల్తాన్ బజార్‌లో...

కోఠి సుల్తాన్ బజార్‌ గోకుల్ చాట్ భండార్ వెనుక ఉన్న సుల్తాన్ బజార్ వద్ద పావురాళ్ల కబుతర్ ఖానా ఉంది.విశాలమైన పార్కులో దీన్ని సుల్తాన్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్,హష్మత్‌గంజ్ నివాసితులు నిర్మించారు.చుట్టూ పావురాళ్ల గూళ్లతో కూడిన కబుతర్ ఖానాను నిర్మించారు. ఈ కబుతర్ ఖానాలో దాదాపు 2000 పావురాలకు వసతి కల్పిస్తున్నారు.నిత్యం ఈ ప్రాంతంలో వందలాదిమంది సంచుల్లో గింజలు తీసుకువచ్చి పావురాళ్లకు వేస్తుండటంతో వీటి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. స్థల కొరత కారణంగా పావురాళ్లు చుట్టూ ఉన్న భవనాల్లో ఆశ్రయం పొందుతున్నాయి. రోజంతా ఈ ప్రదేశానికి వచ్చే ప్రజలు స్థానిక వ్యాపారుల నుంచి ధాన్యాలు కొనుగోలు చేసి పావురాలకు ఆహారం పెడుతూనే ఉంటారని స్థానిక నివాసి అర్వింద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉత్తరాది ప్రజలు పావురాలకు ఆహారం పెట్టడం దైవభక్తిగా పరిగణిస్తున్నారు.

పావురాళ్లతో ముస్సలాం జంగ్ వంతెన సందడి
హైదరాబాద్‌లోని ముస్సలాం జంగ్ వంతెనపై పావురాళ్ల ప్రేమికులు పావురాలకు ఆహారం పెడుతుండటంతో వీటి సంఖ్య పెరిగింది. పావురాళ్ల రెక్కల చప్పుళ్లతో ఈ వంతెన కళకళలాడుతుంది. నిజాం కాలం నాటి ముసల్లం జంగ్ వంతెనపై ప్రజలు పావురాలకు ధాన్యాలు తినిపిస్తున్నారు.పావురాళ్లకు గింజలు వేసే ముందు సూర్యుడిని ప్రార్థిస్తుంటారు. మక్కా మసీదు ఆవరణలోనూ పావురాళ్లు స్వేచ్ఛగా ఎగురుతుంటాయి.



పావురాళ్ల హాట్ స్పాట్లు

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్, నాంపల్లి మెట్రో స్టేషన్, ముసల్లం జంగ్ వంతెనతో సహా కొన్ని ప్రదేశాలు పావురాలు పెద్ద సంఖ్యలో ఉండే హాట్‌స్పాట్‌లుగా మారాయి.ప్రజలకు పెనుముప్పు కలిగిస్తున్న పావురాల రెట్టలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెట్టల వల్ల దుర్వాసన వెలువడుతుంది.


పావురాళ్లకు నిలయం ఈ ప్రాంతాలు
హైదరాబాద్ నగరంలోని కోఠి ప్రాంతంలోని గోకుల్ ఛాట్ వద్ద ఉన్న కబుతర్ ఖానా, పాత బస్తీ హుస్సేనీఆలం, మక్కా మసీదు, ముస్సలాం జంగ్ వంతెన, నాంపల్లి రైల్వేస్టేషన్, నాంపల్లి మెట్రో స్టేషన్,ట్యాంక్ బండ్ ప్రాంతం, సికింద్రాబాద్ మోండా మార్కెట్, తార్నాక, ఓయూ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల

ఉస్మానియా యూనివర్శిటీలో పావురాలకు గింజలు వేయొద్దు
పావురాళ్లకు గింజలు వేయడం వల్ల ఓయూ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల వెలుపల పెద్ద సంఖ్యలో పావురాలు చేరాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో పావురాలు ఉన్నాయి. దీనివల్ల పావురాల రెట్టలతో ఓయూ ప్రాంతాలు అధ్వానంగా మారాయి.పావురాళ్లు శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.విశ్వవిద్యాలయ స్వీపర్ల నుంచి ఓయూ విద్యార్థుల వరకు పావురాల రెట్టల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఓయూ ఉద్యోగి వెంకట్ చెప్పారు.పావురాళ్లకు గింజలు వేయవద్దని వైద్యులు సూచించారు.

పావురాళ్ల బెడదపై తెలంగాణ అసెంబ్లీలో ఆందోళన
హైదరాబాద్ నగరంలో పావురాళ్ల వల్ల మనుషులకు ఆరోగ్య ముప్పు ఏర్పడింది.ప్రజలు సంచుల్లో గింజలను తీసుకువచ్చి పావురాళ్లకు వేస్తున్నారని, దీని వల్ల పావురాళ్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది’’అని హైదరాబాద్ మజ్లిస్ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. పావురాళ్ల రెట్ట వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని లంగ్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయని ఆయన చెప్పారు. అక్బరుద్దీన్ ఒవైసీ పట్టణ ఆరోగ్య ప్రమాదాలను, బహిరంగంగా గింజలు వేయడం వల్ల పావురాలు అదుపు లేకుండా పెరగడం వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వైఫల్యం గురించి అక్బరుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు.

వైద్యుల హెచ్చరిక
“పావురాల విసర్జన వల్ల బ్రోన్కైటిస్, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ప్రజలు పావురాలకు గింజలు వేయడం మానుకోవాలి” అని వైద్యాధికారులు చెబుతున్నారు. పావురాలను ఇళ్లలోకి రాకుండా నిరోధించడానికి కిటికీలను మెష్‌తో కప్పాలని వైద్యులు సూచించారు.పావురాల విసర్జనలో శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఉంటాయి, ఇవి హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్, పిట్టకోసిస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి.పావురాల గూళ్లలో పురుగులు, పేలు వంటి పరాన్నజీవులు ఉండటం వల్ల ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తగ్గిన వ్యక్తులు పావురాళ్ల వల్ల రోగాల పాలవుతున్నారు.

ప్రాణాంతకం కావచ్చు...
పావురాల రెట్ట వల్ల ప్రజలు ఆస్తమా, శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారు. పావురాలున్న వాతావరణంలో ముఖ్యంగా పక్షి రెట్టలకు ఎక్కువసేపు గురికావడం వల్ల వివిధ రకాల హానికరమైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియా , పరాన్నజీవుల నుంచి ఇన్ఫెక్షన్లు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరించారు.రెట్టలు ఎండిపోయినప్పుడు, అవి దుమ్ముగా గాలిలోకి ఎగిరి, పీల్చేటప్పుడు మానవ శరీరంలోకి ప్రవేశించి, ఊపిరితిత్తులను చేరుతాయి. హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్‌కు కారణమవుతాయి. ఇది కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకం కావచ్చు.

పావురాళ్లతో ఊపిరితిత్తుల సమస్యలు : పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు
హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న పావురాళ్ల వల్ల ప్రజలకు ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయని సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.పావురాళ్ల రెట్ట వల్ల ప్రజలకు లంగ్స్ ఇంటర్ ఫిషియల్, లంగ్స్ ఫైబ్రాడిస్ వ్యాధులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఆస్తమా, బ్రాంకోసిటీస్ రోగాలున్న వారికి పావురాళ్ల వల్ల మరిన్ని సమస్యలు వస్తున్నాయని డాక్టర్ చెప్పారు.

ఇళ్ల బాల్కనీల్లోకి పావురాళ్లు రాకుండా చర్యలు
పావురాళ్ల వల్ల ప్రజలకు శ్వాస కోశ ఇబ్బందులు ఏర్పడుతున్నందున హైదరాబాద్ నగర ప్రజలు ఇళ్ల బాల్కనీల్లోకి పావురాళ్లు రాకుండా నెట్స్ కట్టుకోవాలని సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు సూచించారు. నగరంలోని కోఠి, పాత బస్తీ, నాంపల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో పావురాళ్లు ఎక్కువగా తిరుగుతున్నందున వీటికి ప్రజలు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఆస్తమా రోగులకు పావురాళ్ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ చెప్పారు.

ఢిల్లీ, ముంబయిలోనూ...
ఢిల్లీ నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో పావురాలకు ఆహారం పెట్టవద్దని ప్రజలను కోరాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యోచిస్తోంది. పక్షుల రెట్టల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి ఈ చర్య ముఖ్యమని డీఎంసీ పేర్కొంది. పావురాల గుమిగూడటం వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే, అది తీవ్రమైన సామాజిక ఆందోళన కలిగించే విషయం అని బాంబే హైకోర్టు పేర్కొంది.

పావురాళ్లకు గింజలు వేయొద్దు : హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్
హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్య సమస్యల దృష్ట్యా పావురాలకు గింజలు వేయడం మానుకోవాలని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకట్ జుమ్మిడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పావురాల వల్ల శ్వాసకోశ సమస్యల వంటి ఆరోగ్య ప్రమాదాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పావురాల బెడద వల్ల జూనోటిక్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతున్నాయని వెంకట్ జుమ్మిడి ఆందోళన వ్యక్తం చేశారు. పావురాలు జూనోటిక్ వ్యాధులకు వాహకాలుగా మారాయని శాస్త్రీయ పరిశోధన పత్రాల్లో తేలిందని ఆయన వివరించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న రోగులు, పిల్లలు, వృద్ధులు పావురాళ్ల వల్ల ఎక్కువ ప్రమాదంలో పడుతున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చెప్పారు.

పావురాలకు గింజలు వేయడం పుణ్యంగా భావించినా, దాని ప్రభావం ఇంత పెద్ద ముప్పుగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో పావురాల సంఖ్య భారీగా పెరగటం, వాటి రెట్టలు, వ్యర్థాలు శ్వాసకోశ సమస్యలకు, అలర్జీలకు, తీవ్రమైన లంగ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ, స్థానిక సంస్థలు, నగర వాసులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.


Read More
Next Story