
భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న లాయర్
అనారోగ్యం కుదుటపడాలని భార్యతో పాటు భర్త కూడా గుడి దగ్గర రెండేళ్ళుగా భిక్షాటన చేస్తున్నాడు
చాలామంది భిక్షగాడు సినిమాను చూసే ఉంటారు. అందులో తల్లి అనారోగ్యం కుదుటపడాలని కోటీశ్వరుడు అయిన కొడుకు 43 రోజులు భిక్షాటన చేస్తాడు. ఒక సాధువు సూచనను సినిమాలో హీరో తూచా తప్పకుండా పాటిస్తాడు. అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలోని వేములవాడలో జరుగుతోంది. సినిమాలో తల్లి, కొడుకుల సెంటిమెంటును దర్శకుడు చాలా బలంగా చూపించాడు. అయితే వేములవాడలోని రాజన్న, భీమన్న సన్నిధిలో నిజంగా జరుగుతున్నది. నిజజీవితంలో అనారోగ్యం కుదుటపడాలని భార్యతో పాటు భర్త కూడా గుడి దగ్గర కొద్దిరోజులుగా భిక్షాటన చేస్తున్నాడు.
అసలు విషయం ఏమిటంటే పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందిన కాసర్ల జలంధర్ రెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ కు చెందిన శిరీషతో 2006లో వివాహమైంది. జలంధర్ కరీంనగర్లో లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్నాడు. శిరీష బీకాం కంప్యూటర్స్ చదివి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. వీరిద్దరికి పిల్లలు లేరు. ఈమధ్యనే శిరీషకు అనారోగ్యం మొదలైంది. కరీంనగర్ లోని వైద్యులకు చూపించినా అనారోగ్యం నయంకాలేదు. డాక్టర్లు ఆమెకున్న అనారోగ్యం ఏమిటో కూడా గుర్తించలేకపోతున్నారు. అనారోగ్యానికి తోడు మొదటినుండి ఉన్న పోలియో వీళ్ళను మరింత ఇబ్బందులు పెడుతోంది.
ముందు అనారోగ్యం ఏమిటో కనుక్కుని దాన్ని నయంచేసుకునేందుకు భార్యను తీసుకుని జలందర్ రెడ్డి తిరగని డాక్టర్లంటు లేరు. భార్య అనారోగ్యాన్ని నయంచేయించేందుకు తన ప్రాక్టీసును సైతం పక్కనపెట్టేశాడు. అలాగే వివాహం సందర్భంగా అత్తగారు బహుమతిగా ఇచ్చిన ఫ్లాటును కూడా అమ్మేసుకున్నారు. అయినా అనారోగ్యం మాత్రం కుదుటపడలేదు.
ఈ నేపధ్యంలోనే జలంధర్ దంపతులకు ఎవరో కలిసినపుడు డాక్టర్ల దగ్గరకు వెళితే ఉపయోగం ఉండదని వేములవాడ రాజన్న సన్నిధిలో కొద్దిరోజులు భిక్షాటన చేస్తే భార్య అనారోగ్యం కుదుటపడుతుందని సలహా ఇచ్చారు. దాంతో సినిమా మహిత్యమో లేకపోతే చెప్పిన వారి సలహా నచ్చిందో తెలీదుకాని కొద్దిరోజులుగా భార్యా, భర్తలు ఇద్దరు రాజన్న దేవాలయం దగ్గరే భిక్షాటన మొదలుపెట్టారు.
ఇలాగ వెలుగుచూసింది
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భిక్షగాళ్ళు లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అనుకున్నారు. జిల్లా కేంద్రంలోని భిక్షగాళ్ళందరికీ అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళకు ఏదో ఒక ట్రైనింగ్ ఇప్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, ఎస్పీ చంద్రయ్య జిల్లా కేంద్రంలోని భిక్షగాళ్ళందరినీ కౌన్సిలింగుకు పిలిపించి పునరావాసం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సమయంలోనే అధికారులు జలంధర్, శిరీషను కూడా కౌన్సెలింగుకు తీసుకెళ్ళారు. కౌన్సెలింగులో జలంధర్ దంపతులు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడటం గమనించిన ఉన్నతాధికారులు లక్ష్మీరాజ్యం, చంద్రయ్యలు ఆశ్చర్యపోయారు.
వీరిగురించి వివరాలు సేకరించినపుడు భిక్షాటన చేయటానికి అసలు కారణం బయటపడింది. అలాగ ఈ దంపతుల భిక్షాటన విషయం వెలుగుచూసింది. మరి కౌన్సెలింగులో దంపతులు ఏమిచెప్పారు, ఉన్నతాధికారులు ఏమి హామీ ఇచ్చారన్న విషయం మాత్రం తెలీలేదు. ఇదే విషయమై జలంధర్ మాట్లాడుతు భార్య అనారోగ్యం కుదుటపడేందుకు ఎంతమంది వైద్యులకు చూపించినా ఉపయోగం కనబడలేదన్నాడు. అందుకనే చివరకు దేవుడే దిక్కని వేములవాడ ఆలయం దగ్గర భార్యతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు చెప్పాడు.

