చిల్లర గొడవ.. కండక్టర్ ప్రాణం తీసింది!
x

చిల్లర గొడవ.. కండక్టర్ ప్రాణం తీసింది!

కండక్టర్ ప్రవళిక మరణం ఆర్టీసీకి తీరని లోటు... ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటాం: ఎండీ వై.నాగిరెడ్డి


1) చిల్లర గొడవ.. కండక్టర్ ప్రాణం తీసింది!

2) AI చదువులు.. ఉద్యోగాల కలలు.. నిజమయ్యేనా?

1) చిల్లర గొడవ.. కండక్టర్ ప్రాణం తీసింది!

"మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లో ఉంది. మరి ఈ గొడవ ఎందుకు జరిగిందంటే మహిళ తన కుమారుడితో కలిసి ప్రయాణిస్తోంది. మహిళకు ఉచిత ప్రయాణం వర్తించినప్పటికీ, కుమారుడికి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ బాలుడి టికెట్ చార్జీకి సంబంధించి ఇచ్చిన రూ.100 నోటుకు చిల్లర వెంటనే ఇవ్వలేదన్న వివాదం చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో కండక్టర్ ప్రవళిక ప్రాణాలే కోల్పోయింది.

"భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన గుండ్ల ప్రవళిక విధి నిర్వహణలో ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో టికెట్ చార్జీ, చిల్లర విషయంలో ప్రవళికకు ఓ మహిళా ప్రయాణికురాలికి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో ప్రయాణికురాలు ప్రవళికను కదులుతున్న బస్సులో నుంచి తోసేసింది. దీంతో ఆమె బస్సు వెనుక చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.

తొలుత స్థానికంగా చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. దాదాపు పది రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రవళిక.. చివరకు నవంబర్ 3న చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నిందితురాలు మిట్టగూడెం ప్రాంతానికి చెందిన బానోత్ మౌనిక గా గుర్తించారు. నవంబర్ 3 రాత్రి ప్రవళిక చికిత్స పొందుతూ మరణించారు. నవంబర్ 4న అంటే ఈరోజు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీతో మాట్లాడి, నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రవళిక మృతి కేవలం ఒక ఆర్టీసీ ఉద్యోగి మరణం మాత్రమే కాదు. విధి నిర్వహణలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సమస్యలకు అద్దం పడుతోంది. ప్రతిరోజూ వేలాది మంది ఆర్టీసీ సిబ్బంది ప్రజలకు సేవలందిస్తున్నారు. ముఖ్యంగా మహిళా కండక్టర్లు బస్సుల్లో టికెట్లు ఇవ్వడం, ప్రయాణికులకు సమాధానం చెప్పడం, చార్జీల విషయంలో వివాదాలను పరిష్కరించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ విధి నిర్వహణలో ప్రయాణికుల నుంచి ఎదురయ్యే దురుసు ప్రవర్తన, బెదిరింపులు, దాడుల నుంచి వారికి తగిన రక్షణ ఉందా? టికెట్ విషయంలో వివాదం వస్తే ఉద్యోగి తన విధిని నిర్వహిస్తున్నాడనే విషయాన్ని ప్రయాణికులు గుర్తించాల్సిన అవసరం లేదా? ఒకవేళ వివాదం తీవ్రమైతే ఉద్యోగికి రక్షణ కల్పించేందుకు ఆర్టీసీ వద్ద ఎలాంటి వ్యవస్థ ఉంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.


2) AI చదువులు.. ఉద్యోగాల కలలు.. నిజమయ్యేనా?

చేతిలో డిగ్రీ ఉంది.. చదువు పూర్తయింది.. ఉద్యోగం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఐటీ రంగంలోకి అడుగుపెట్టాలన్న ఆశ ఉంది. కానీ కంపెనీలు అడుగుతున్న నైపుణ్యాలు మాత్రం తమ దగ్గర లేవు! మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్లౌడ్ కంప్యూటింగ్.. మెషిన్ లెర్నింగ్.. డేటా అనలిటిక్స్.. ఉద్యోగ మార్కెట్‌ను కొత్త దిశగా మార్చేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని లక్ష మంది విద్యార్థులకు AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించింది.లక్ష మందికి శిక్షణ ఇస్తే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయా? ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఐటీ కంపెనీల్లో అవకాశాలు దక్కుతాయా? లేక సర్టిఫికెట్లు చేతికొచ్చి ఉద్యోగాల కోసం మళ్లీ ఎదురుచూడాల్సిందేనా? భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించనున్నాయి.ఇప్పటికే ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల్లో AI ఆధారిత టూల్స్‌ను వినియోగిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నుంచి డేటా విశ్లేషణ వరకు అనేక విభాగాల్లో ఈ సాంకేతికత ప్రభావం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ TASK– Amazon Web Services AWS భాగస్వామ్యంతో లక్ష మంది విద్యార్థులకు AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ అందించాలని భావిస్తోంది.

విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంచడం, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.అయితే ఇది తెలంగాణకు కొత్త ప్రయోగం కాదు.

2022లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్.. అంటే TASK ద్వారా లక్ష మంది హైస్కూల్ విద్యార్థులకు AI ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కార్యక్రమం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి AWS భాగస్వామ్యంతో AIతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్‌పైనా దృష్టి పెట్టారు. మరి గత కార్యక్రమానికి, ప్రస్తుత కార్యక్రమానికి మధ్య తేడా ఏమిటి?

గతంలో విద్యార్థులకు AIపై ప్రాథమిక అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమా? ఇప్పుడు ఉద్యోగాలకు అవసరమైన అడ్వాన్స్‌డ్ స్కిల్స్ నేర్పిస్తారా? గతంలో శిక్షణ పొందిన విద్యార్థుల్లో ఎంతమంది ఉద్యోగాలు పొందారు? ఈసారి శిక్షణ పూర్తిచేసిన వారి ఉపాధి అవకాశాలను ప్రభుత్వం ఎలా ట్రాక్ చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఉంది. ఐటీ కంపెనీలకు ఇప్పుడు కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు మాత్రమే సరిపోవడం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, ప్రోగ్రామింగ్, డేటా అనలిటిక్స్, AI టూల్స్ వినియోగంపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత పెరుగుతోంది.

తెలంగాణలో లక్షలాది మంది యువత డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి ఇప్పుడు కావాల్సింది మరో సర్టిఫికెట్ మాత్రమే కాదు. ఉద్యోగం సంపాదించగలిగే నైపుణ్యం.. పరిశ్రమల్లో పనిచేసే అవకాశం.. ఆర్థికంగా నిలదొక్కుకునే భరోసా.

లక్ష మందికి AI శిక్షణ ఇవ్వడం కాదు.. ఆ లక్ష మందిలో ఎంతమందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతారన్నదే అసలైన పరీక్ష!తెలంగాణ యువత భవిష్యత్తును మార్చే కార్యక్రమంగా ఇది నిలుస్తుందా? లేక మరో శిక్షణా కార్యక్రమంగానే మిగిలిపోతుందా?

అయితే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల వారీగా విద్యార్థుల ఎంపిక ఎలా ఉంటుంది? ఒక్కో కాలేజీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు? శిక్షణ ఆన్‌లైన్‌లోనా, ప్రత్యక్ష తరగతుల రూపంలోనా? కోర్సు వ్యవధి ఎంత? సర్టిఫికేషన్ పరీక్షలకు ఉచిత సదుపాయం ఉంటుందా? ముఖ్యంగా శిక్షణ పూర్తిచేసిన వారిలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Read More
Next Story