టెస్కోకు షాక్:చేనేత,పవర్‌లూమ్ కార్మికుల జీవితం సంక్షోభంలో
x
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్కు సంక్షోభంలో...

టెస్కోకు షాక్:చేనేత,పవర్‌లూమ్ కార్మికుల జీవితం సంక్షోభంలో

యూనిఫాం ఆర్డర్లు రద్దు… వేలాది నేతన్నలు వీధిన,సిరిసిల్లలో స్తబ్దత… పవర్ లూమ్స్ మూత, కార్మికుల ఆవేదన


తెలంగాణలో చేనేత, పవర్‌లూమ్ కార్మికుల జీవితం సంక్షోభంలో పడింది. ప్రభుత్వ యూనిఫాం, ఇతర వస్త్రాల ఆర్డర్లు టెస్కో ద్వారా ఇవ్వకుండా ఓపెన్ టెండర్ విధానాన్ని అనుసరించడంతో వేలాది నేతన్నలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఇప్పటికే నూలు, రంగులు కొనుగోలు చేసి తయారీలోకి దిగిన కార్మికులు ఆర్డర్లు రద్దవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో చేనేత, పవర్‌లూమ్ కార్మికుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.ప్రభుత్వం తీసుకున్న ఓపెన్ టెండర్ విధానం చేనేత రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

చితికిన కార్మికులు

తెలంగాణ రాష్ట్రంలో చేనేత, పవర్ లూమ్స్ కార్మికులు చితికిపోయే పరిస్థితి నెలకొంది.గతంలో రాజీవ్ విద్యామిషన్ పథకం కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం అందజేసేందుకు తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారా పవర్ లూమ్, చేనేత కార్మికులకు 105 కోట్ల రూపాయల వస్త్రాలు ఆర్డరు ఇచ్చేవారు. గురుకుల పాఠశాలలకు టవల్స్, చిన్న కార్పెట్లు, బెడ్ షీట్లను టెస్కో ద్వారా అందించేవారు. దీని ద్వారా చేనేత రంగ కార్మికులకు ఉపాధి లభించేది.ఈ ఏడాది యూనిఫాం ఉత్పత్తి కోసం సిరిసిల్ల, కరీంనగర్, నల్లొండ,మహబూబ్ నగర్, వరంగల్ ప్రాంతాల్లోని కార్మికులు, నేత సంఘాలు, నూలు, రంగులు, సామాగ్రిని కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నారు. టెస్కో ద్వారా కాకుండా ఒపెన్ టెండర్లు పిలవడంతో కార్మికులకు ఉపాధి కొరవడింది.

వీధిన పడిన కార్మికులు

సిరిసిల్లలో 30వేల పవర్ లూమ్స్, 25వేల మంది కార్మికులు ఉండగా వారంతా ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 56 చేనేత సంఘాలు, 35 కొఆపరేటివ్ సంఘాల్లో పదివేల మంది కార్మికులు ఉండగా ఆర్డరు రద్దుతో వారంతా వీధినపడ్డారు. పవర్ లూమ్స్, చేనేత సంఘాలు మూతపడటంతో పలుజిల్లాల కార్మికులు,నేతన్నలకు ఉపాధి కొరవడింది. చేనేత కార్మికులను రోడ్డున పడేశారని చేనేత సంఘం నాయకుడు దిడ్డి రమేష్ ఆవేదనగా చెప్పారు.

జీఓను ఉల్లంఘించారు...

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లతోపాటు ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల హాస్టళ్లు, గురుకులాలకు యూనిఫాంల కొనుగోలును చేనేత, పవర్ లూం కార్మికులకు ఉపాధి కల్పించేలా టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2024 వసంవత్సరం మార్చిలో జారీ చేసిన జీఓ నంబరు 1ను గాలికొదిలి, యూనిఫాం ఆర్డరును రద్దు చేశారు. కార్పెట్లు తయారు చేసే కార్మికులకు ఉపాధి కొరవడింది. కమీషన్ల కోసమే టెండర్లు పిలవాలని విద్యాశాఖ నిర్ణయించిందని, దీనివల్ల తమ నేతన్నలకు ఉఫాధికి విఘాతం ఏర్పడుతుందన్నారు.

సీఎం దృష్టికి తీసుకువెళ్లినా...

ముఖ్యమంత్రి మాజీ సలహాదారు, రాజ్య సభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని చేనేత కార్మిక సంఘాల నేతలు కలిసి టెండర్ విధానాన్ని రద్దు పర్చి టెస్కో సంస్థ ద్వారా కార్పెట్లు బెడ్ షీట్లు కొనేలా చేయాలని వినతి పత్రం ఇచ్చినా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కోడం రమణ చెప్పారు. పవర్ లూమ్ కార్మికుల ఉపాధి దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కోడం రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో పవర్ లూమ్స్ పరిశ్రమ మూతపడిందని దీనివల్ల కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన చెప్పారు.

రమజాన్ తోఫా ఆర్డర్లేవి?

ప్రతీ ఏటా రమజాన్ నెలలో పేద ముస్లింలకు ఇచ్చే వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్లు కూడా ఇవ్వలేదని చేనేత సంఘాల కార్మికులు ఆవేదనగా చెప్పారు. టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేస్తే చేనేత, పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి దొరికేది. కానీ ఓ ప్రైవేటు కంపెనీకి రమజాన్ తోఫా వస్త్రాల ఆర్డరు ఇచ్చారని చేనేత కార్మిక సంఘ నాయకుడు గూడూరి ప్రవీణ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీఓకు విరుద్ధంగా చేనేత కార్మిక సంఘాలకు ఆర్డర్లు ఇవ్వకుండా ఉపాధికి గండి కొట్టారని, తమ చేనేత కార్మికులు ఎలా జీవనం గడపాలని ప్రవీణ్ ప్రశ్నించారు. ఏకీకృత టెండర్లు వద్దు టెస్కోకి ఆర్డర్లు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. జీఓ నంబరు 1 ప్రకారం టెస్కోకు ఆర్డర్లు ఇచ్చి చేనేత కార్మికులకు బతుకు ఇవ్వాలని కోరారు.ిలచ

తెలంగాణ సీఎంకు ఎమ్మెల్సీ ఎల్ రమణ లేఖ

చేనేత రంగంలో ఒపెన్ టెండర్ల విధానానికి స్వస్తి చెప్పి పాత విధానంలోనే టెస్కో ద్వారా దుస్తులు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ బహిరంగ లేఖ రాశారు. మార్చి 11వతేదీన జారీ చేసిన జీవోను అమలు చేయాలని ఆయన కోరారు. మార్చి 11 న ఇచ్చిన జీవోను యథాతథంగా అమలు చేయాలని , విద్యార్థుల యూనిఫామ్ తయారీ కి సంబంధించిన 105 కోట్ల రూపాయల ఆర్డర్‌ను టెస్కోకు ఇవ్వాలన్నారు. ఇటీవల చేనేత కార్మికులు ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా కూడా చేశారు.

చేనేతరంగానికి నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే కూనంనేని

చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యలను తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. చేనేత పరిశ్రమకు తగిన ప్రాధాన్యం కల్పించి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రిఫ్ట్ పథకంలో పెండింగ్ డిపాజిట్లు వెంటనే చెల్లించాలని, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసి జీరో వడ్డీ రుణాలు ఇవ్వాలని కోరారు. బడ్జెట్‌లో చేనేత రంగానికి తగిన నిధులు కేటాయించాలని ఆయన సూచించారు.

చేనేత, పవర్ లూం కార్మికుల ఆందోళన

గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ సంస్థలకు చేనేత వృత్తికి సంబంధించిన ఏ వస్తువు అవసరమైనా, రాష్ట్ర చేనేత సహకార సంస్థ ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసే విధానం అమల్లో ఉండేది. ఈ విధానం వల్ల ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల నేతన్నలకు సంవత్సరం పొడవునా నిరంతర ఉపాధి లభించిందని పవర్ లూం కార్మికులు చెప్పారు. ప్రస్తుతం విద్యార్థుల యూనిఫామ్‌ క్లాత్‌ సరఫరాకు ఓపెన్‌ టెండర్‌ విధానాన్ని తీసుకురావడం ఆందోళన కలిగిస్తుందని సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ చెప్పారు.
చేనేత రంగం తెలంగాణ సంప్రదాయం, వేల కుటుంబాలకు జీవనాధారం. టెండర్ల విధానం వల్ల ఈ రంగం కుదేలైతే, నేతన్నల భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది.మొత్తానికి, టెండర్ల విధానం కారణంగా చేనేత రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోగా వేలాది నేతన్నల జీవితం అనిశ్చితిలో పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి జీఓ ప్రకారం టెస్కో ద్వారా ఆర్డర్లు ఇవ్వడంతో పాటు చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఈ సంప్రదాయ వృత్తి క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story