మెట్రో స్టేషన్ పక్కనే హడలెత్తించిన ఫైర్ యాక్సిడెంట్
x
Fire accident near Ameerpet Metro Station

మెట్రో స్టేషన్ పక్కనే హడలెత్తించిన ఫైర్ యాక్సిడెంట్

ఈ స్టేషన్ కు ఆనుకునే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నీలగిరి బ్లాకులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది


నగరానికి నడిబొడ్డున ఉన్న అమీర్ పేట సెంటర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంప్యూటర్ కోర్సులు, ఐటి కోర్సులు చేసేవాళ్ళతో పాటు వివిధ కోచింగుల్లో చేరేవాళ్ళకు అమీర్ పేట, మైత్రీవనం పెద్ద హబ్. అలాంటి చోట జనాల ట్రాఫిక్ ఎలాగుంటుందో ఎవరికి వారుగా ఊహించుకోవాల్సిందే. జనాలతో ఇంత బిజీగా ఉండే సెంటర్లోనే మెట్రో స్టేషన్ కూడా పెద్దదుంది. ఈ స్టేషన్ కు ఆనుకునే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నీలగిరి బ్లాకులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఇంకేముందు వందలాదిమంది అక్కడ గుమిగూడిపోవటంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది.

ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో కాంప్లెక్సులోని నాలుగో అంతస్తులోని ఒక కోచింగ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటల అంటుకున్నాయి. ఆ సమయంలో కోచింగ్ సెంటర్లో చాలామంది పిల్లలున్నారు. అయితే సిబ్బంది మంటలను సకాలంలో చూడటంతో పాటు వ్యాపిస్తున్న పొగవల్ల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పిల్లలందరినీ కాంప్లెక్స్ లోని వెనుక మెట్లదారిలో కిందకు పంపేశారు. మంటలు, పొగ వ్యాపించటం వల్ల కాంప్లెక్సులోని మిగిలిన షాపుల్లోని వాళ్ళు పోలీసులతో పాటు అగ్నిమాపక కేంద్రంకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

నాలుగో అంతస్తులోని ఒక కేంద్రంలో మంటలు, పొగచూసిన వాళ్ళంతా రోడ్డుపైన, మెట్రో స్టేషన్ మెట్లపైన పెద్దఎత్తున పోగయ్యారు. దాంతో మెట్రోస్టేషన్లోనే ఏదో అయిపోయిందని చాలామంది కంగారుపడ్డారు. ఎందుకంటే మెట్రోస్టేషన్ మెట్లు, ఎస్కలేటర్ ఎంట్రన్స్ కు షాపింగ్ కాంప్లెక్స్ కు మధ్య ఉన్న గ్యాప్ కేవలం పది అడుగులు మాత్రమే. అందుకనే జనాలు అంతపెద్దఎత్తున పోగయ్యింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి వచ్చారు. రాగానే కిందనుండి నాలుగో అంతస్తుకు నిచ్చెనెలు వేసుకుని పైకి వెళ్ళి పైప్ లైన్లతో నీళ్ళు చిమ్మారు. దాంతో మంటలు అదుపులోకి వచ్చాయి.

కోచింగ్ సెంటర్లో ఇంకెవరైనా చిక్కుకుని ఉంటే రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కింద పెద్ద నెట్ ను పరిచి పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. నాలుగో అంతస్తులోనుండి కిందకు దూకినపుడు దెబ్బలు తగలకుండా ఉండేందుకే పోలీసులు, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది కింద నెట్ ను పట్టుకుని రెడీగా ఉన్నారు. అయితే కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి చూసిన పోలీసులకు లోపల ఎవరు కనిపించకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి తృటిలో పెద్ద అగ్నిప్రమాదం తప్పిందనే చెప్పాలి. ముందుజాగ్రత్తగా పోలీసులు కాంప్లెక్సులోని మిగిలిన షాపుల వాళ్ళని ఖాళీచేయించి, కరెంటును తాత్కాలికంగా నిలిపేసి ఫైర్ సేఫ్టీ అంశాలను పరిశీలిస్తున్నారు.

Read More
Next Story