
తెలంగాణ హెల్త్ వీక్‌లో భాగంగా ఈట్ రైట్ వాక్
ఆరోగ్య తెలంగాణ వైపు అడుగు:రేపటినుంచి హెల్త్ వీక్ ప్రారంభం
ఆరోగ్య అవగాహనకు భారీ కార్యక్రమాలు,ఫుడ్ సేఫ్టీ నుంచి డ్రగ్ అవగాహన వరకు ప్రజల ఆరోగ్యంపై ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ, ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ‘హెల్త్ వీక్’ను ఘనంగా నిర్వహించనుంది. ఏప్రిల్ 6 నుంచి 11 వరకు జరగనున్న ఈ వారం రోజుల కార్యక్రమాల్లో ఫుడ్ సేఫ్టీ నుంచి కేన్సర్ సేవలు, మాతృ ఆరోగ్యం నుంచి డ్రగ్ అవగాహన వరకు విస్తృత చర్యలు చేపట్టనున్నారు.
వారం రోజుల కార్యక్రమాల్లో ఫుడ్ సేఫ్టీ నుంచి కేన్సర్ సేవలు, మాతృ ఆరోగ్యం నుంచి డ్రగ్ అవగాహన వరకు విస్తృత చర్యలు చేపట్టనున్నారు. నెక్లెస్ రోడ్డులో ఈట్ రైట్ వాక్‌తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది.హెల్త్ వీక్ విశేషాలను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ ‘ఫెడరల్ తెలంగాణ’కు వెల్లడించారు.
ప్రత్యేక థీమ్‌తో వైద్యశాఖ కార్యక్రమాలు
హెల్త్ వీక్‌లో ప్రతి రోజు ప్రత్యేక థీమ్‌తో నిర్వహించే కార్యక్రమాల వివరాలను మంత్రి సమీక్షించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకూ హెల్త్ వీక్ నిర్వహించనున్నారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. హెల్త్ వీక్‌లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ విద్యార్థులు, మహిళలు, యువతను భాగస్వాములను చేయాలని మంత్రి కోరారు.
ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే
ఆహార నాణ్యత ప్రాముఖ్యతను తెలిపేలా ఏప్రిల్ 6న ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద ఈట్ రైట్ వాక్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.00 నుంచి నేచురోపతి హాస్పిటల్‌లో 40 స్టాళ్లతో మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణ, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు సర్టిఫికేట్ల పంపిణీ, హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్ల పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాల్లో కూడా ఉదయం ఈట్ రైట్ వాక్‌లు, మధ్యాహ్నం ఫుడ్ రిజిస్ట్రేషన్ మేళాలు నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ నిర్ణయించారు.
తెలంగాణ కేన్సర్ రిజిస్ట్రీ
ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. కేన్సర్ పేషెంట్లకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిమ్స్‌లో ఏర్పాటు చేసిన అధునాతన లినాక్ యంత్రాన్ని ఉదయం 10 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఇందులో తెలంగాణ కేన్సర్ రిజిస్ట్రీ ప్రారంభం, ట్రామా కేర్ పాలసీ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పోర్టల్, సరోగసీ పోర్టల్స్ ప్రారంభం, అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపికైన 871 మంది డాక్టర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం, ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు.
సేఫ్ మదర్ డే
ఏప్రిల్ 8వతేదీన సేఫ్ మదర్ డేగా నిర్వహిస్తూ ఉదయం 11.00 గంటలకు బోయిగూడలోని మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాల్లో పరీక్షలు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ప్రసూతి సేవలపై వర్క్‌షాప్‌ల నిర్వాహణ, గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్‌లో రెడ్ రన్ నిర్వహించనున్నారు.
జిల్లాల్లో కూడా ఇదే సమయానికి అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి సూచించారు. జైళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్‌లో వైద్య సేవలు, ఉచిత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
హోమియోపతి, ఆయుష్ డే
ఏప్రిల్ 10న హోమియోపతి, ఆయుష్ డేగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. ఉదయం 11.00 గంటలకు హోమియోపతి కళాశాలలో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించనున్నారు. జిల్లాల్లో యోగా ప్రదర్శనలు, వైద్య శిబిరాలు విస్తృతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.
మెడిసిన్ సేఫ్టీ
ఏప్రిల్ 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్ డేగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11న మెడిసిన్ సేఫ్టీ, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి గాంధీ హాస్పిటల్ డీ అడిక్షన్ ట్రీట్మెంట్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
హెల్త్ వీక్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు, ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విద్యార్థులు, మహిళలు, యువత పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమాలు మరింత ప్రభావవంతంగా మారే అవకాశం ఉంది. ప్రజల భాగస్వామ్యంతో ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.
Next Story

