
పశువుల పాలవుతున్న టమోటా పంట
పంటను రైతులు మార్కెట్ కు తీసుకుని వెళితే 25కిలోల బాక్సు ధర రు. 150కి మించి అమ్ముడుపోవటంలేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు టమోటా పంట వేసి నిండిముణిగారు. పోయిన సీజన్లో టమోటా అదిక ధరలకు అమ్ముడుపోయిందని ఈ సీజన్లో రైతులు టమోటాను పండిస్తే వర్షాలు కొంపముంచేశాయి. గతంలో మిర్చి, పత్తి, లాంటి పంటలు సాగుచేసి దెబ్బతిన్న రైతులు కొత్తగా టమోటా పంటను సాగుచేసి లాభాలను ఆర్జించాలని ఆశపడ్డారు. పోయిన ఏడాదిలో 500 ఎకరాల్లో టమోటా పంటను సాగుచేసిన రైతులు బాగా లాభపడ్డారు. ఎందుకంటే అప్పట్లో వర్షాలు పడటంతో టమోటాను రైతులు తక్కువగా సాగుచేశారు. తక్కువగా సాగుచేశారు కాబట్టి ఉత్పత్తి కూడా తక్కువగానే వచ్చింది. దాంతో టమోటాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోవటంతో 25కిలోల బాక్సు 1000 రూపాయలకు అమ్ముడుపోయింది. దాంతో టమోటా రైతుల పంట పండింది.
దాన్ని దృష్టిలో పెట్టుకున్న రైతులు ఇపుడు 800 ఎకరాల్లో సాగుచేశారు. పంటలు కూడా విరగకాసాయి. అయితే పంట కాపుదశలో ఉన్నపుడు ఊహించని రీతిలో భారీవర్షాలు కురవటంతో పంటంతా నాశనమైపోయింది. టమోటా పంట వర్షాలదెబ్బకు పూర్తిగా దెబ్బతినేసింది. పండిన పంటను రైతులు మార్కెట్ కు తీసుకుని వెళితే 25కిలోల బాక్సు ధర రు. 150కి మించి అమ్ముడుపోవటంలేదు. రైతులు రు. 3లక్షలు పెట్టుబడిపెట్టి టమోటా పంటను సాగుచేస్తే చివరకు వర్షాలు కురిసి నిండా ముణిగిపోయారు. లాభాల మాట దేవుడెరుగు చివరకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్లుగా లేదు.
పోయిన ఏడాది ఎకరాకు 40 టన్నులు పండిన టమోటా ఈసారి వర్షాలకు దెబ్బతిని ఎకరాకు 20 టన్నులు మాత్రమే పండింది. పండిన పంటను మార్కెట్ కు తరలించి ఏదో ధరకు అమ్ముకుందామని అనుకుంటే అమ్మిన సొమ్ము కూడా వ్యాపారుల దగ్గర నుండి అందుకోలేకపోతున్నారు కొందరు రైతులు. దాంతో పరిస్ధితిని గమనించిన మరికొందరు రైతులు మార్కెట్ కు తీసుకెళ్ళి అమ్ముకోలేక, పొలంలోనే ఉంచుకోలేక పంట మొత్తాన్ని పశువులకు వేసేస్తున్నారు. దాంతో రైతుల్లో చాలామంది అప్పులపాలవుతున్నారు.
తీవ్రంగా నష్టపోయా ? సిరిగద్దె నరసింహారావు
టమోటా ధరను రెండున్నర ఎకరాల్లో వేసి తీవ్రంగా నష్టపోయినట్లు జూలూరుపాడు రైతు నరసింహారావు అన్నారు. పెట్టుబడి పెట్టిన రు. 6 లక్షలు కూడా వచ్చేట్లుగా లేదన్నారు. 25 కిలోల బాక్సును 150 రూపాయలకు అమ్మితే పెట్టుబడి వ్యయం కూడా రాదన్నారు. పంట కాపుదశలో ఉండగా అధిక వర్షాలు కురవటంతో పంటంతా పూర్తిగా దెబ్బతినేసిందని చెప్పారు.

