తెలంగాణ పోక్సో కేసుల్లో షాకింగ్ నిజాలు
x
తెలంగాణలో పెరిగిన పోక్సో కేసులు

తెలంగాణ పోక్సో కేసుల్లో షాకింగ్ నిజాలు

మరుగుదొడ్డిలో ప్రసవం నుంచి అత్యాచారాల వరకు.. చట్టం ఉన్నా తగ్గని నేరాలు...


తెలంగాణలో చిన్నారులపై లైంగిక దాడుల కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఒక వైపు కఠిన చట్టాలు, ప్రత్యేక కోర్టులు ఉన్నప్పటికీ… మరోవైపు వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు సమాజాన్ని కుదిపేస్తున్నాయి. స్నేహం పేరుతో మోసం… బెదిరింపులతో దాడులు… మరుగుదొడ్డిలోనే ప్రసవం వంటి షాకింగ్ ఘటనలు...తెలంగాణలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల భయానక వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. పోక్సో చట్టం ఉన్నప్పటికీ, కేసులు తగ్గకపోవడం సమాజానికి హెచ్చరికగా మారుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై లైంగిక దాడుల కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వరుస ఘటనలు వెలుగులోకి రావడం సమాజాన్ని కలవరపెడుతోంది. మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) పేరుతో ప్రత్యేక చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి కూలీలుగా, కార్మికులుగా పనిచేస్తున్న వారు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పోక్సో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది. వలస కార్మికులతోపాటు నిరక్షరాస్యత, వెనుకబడిన వర్గాల్లోనే పోక్సో కేసులు ఎక్కువగా జరుగుతున్నాయని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.మురికివాడల్లో మద్యం, డ్రగ్స్ కు బానిసలుగా మారిన యువకులు బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని పోలీసుల దర్యాప్తులోనే తేలింది.
ఎన్నెన్నో ఘటనలు...
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటరు మీడియెట్ చదివే ఓ యువకుడు పలువురు బాలికలపై అత్యాచారం చేశాడని వెల్లడైంది. స్నేహం పేరిట బాలికలకు దగ్గరై వారిపై అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.బాలికలతో ఉన్న ఫొటోలు, వీడియోలను వారి తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించి వారిని శారీరకంగా లోబర్చుకునేవాడని వెల్లడైంది. అందులో ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆమెకు కొల్లాపూర్ ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అత్యాచార బాగోతాలు బయటపడ్డాయి.
మరుగుదొడ్డిలోనే బాలిక ప్రసవం
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక కడుపునొప్పితో బాధపడుతూ వైద్యుల వద్దకు వెళ్లింది. వైద్యులు స్కానింగ్ చేయించాలని చెప్పడంతో బాలిక అక్కడి మరుగుదొడ్డికి వెళ్లి అక్కడే ప్రసవించింది.బాలిక ప్రసవించే వరకూ తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు బాలిక గర్భవతి అనే విషయం తెలియలేదు. పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్న బాలిక సమీప బంధువే మైనర్ బాలికను గర్భవతిని చేసినట్లు బయటపడింది.
- జడ్చర్లలో తండ్రి స్నేహితుడే బాలికపై అత్యాచారం చేశాడని తేలింది. పెబ్బేరు మండలంలో ఓ వివాహితుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసి, లక్షన్నర రూపాయలను జరిమానాగా చెల్లించి గ్రామ పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నాడని తేలడంతో పోలీసులు అతనిపై కేసు పెట్టారు.
- వికారాబాద్ జిల్లాలోని దోమ పోలీసుస్టేషన్ పరిధిలో 8వతరగతి చదివే బాలికపై నలుగురు మైనర్లే సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. బషీరాబాద్ మండలానికి చెందిన ఓ యువకుడు ఇన్ స్టాగ్రాం ద్వారా పరిచయమైన మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మల్కాజిగిరిలో 100 కేసుల్లో దోషులకు శిక్ష
మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో కేవలం ఏడాది కాలంలోనే 100 మంది పోక్సో కేసు దోషులకు రంగారెడ్డి జిల్లా పోక్సో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్షలు విధించింది. ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి 100 మంది పోక్సో కేసు దోషులకు శిక్షలు విధించి సంచలనం రేపారు. ఆరుగురు పోక్సో కేసు దోషులకు జీవిత ఖైదు, పదిమందికి యావజ్జీవ కారాగారం, మరో 20 మందికి ఇరవై ఏళ్ల శిక్ష విధించారు. మరో 16 మంది దోషులకు పదేళ్లు, ఇద్దరికి ఏడేళ్లు, పదిమందికి ఐదేళ్లు, మరో 20మందికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో 2025వ సంవత్సరంలో 1224 పోక్సో కేసులు నమోదయ్యాయంటే బాలికలపై లైంగిక వేధింపులు ఏస్థాయిలో జరిగాయో విదితమవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలైన మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత ఏడాది 430 పోక్సో కేసులు నమోదైనాయి. ఈ ఏడాది ఇప్పటికే 60కు పైగా కేసులు నమోదైనాయని పోలీసులు చెబుతున్నారు. ఈ గణాంకాలు రాష్ట్రంలో చిన్నారుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు

తెలంగాణ రాష్ట్రంలో మైనర్ బాలికలపై అత్యాచారం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా కేసుల సత్వర దర్యాప్తునకు ప్రత్యేకంగా పోక్సో స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసింది. ఈ కేసుల విచారణకు తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోక్సో కేసులు ఎక్కువగా ఉన్న 9 పట్టణాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు.
పోక్సో కేసుల్లో 33 మందికి జీవిత ఖైదు
తెలంగాణ రాష్ట్రంలో మైనర్లపై అత్యాచారం చేసిన దోషులు 33 మందికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానాలు జీవితఖైదు విధించడం సంచలనం రేపింది. గత సంవత్సరం తెలంగాణలో 221 మంది ఖైదీలకు జీవిత ఖైదు పడగా వారిలో 33 మంది పోక్సో కేసుల దోషులే కావడం విశేషం. పోక్సో కేసుల్లో తెలంగాణలో ప్రత్యేక న్యాయస్థానాలు గత నాలుగేళ్లలో 107 మందికి జీవిత కారాగార వాసం, మరో 149 మందికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్షలు విధించాయి. నల్గొండ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషి అయిన మహమ్మద్ ముకర్రంకు పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజారమణి ఉరిశిక్ష విధించడం సంచలనం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి మృతదేహాన్ని నాలాలో పడేశాడని కోర్టు దర్యాప్తులో తేలింది.
అత్యాచార బాధిత బాలికలకు నిర్భయ ఫండ్
అత్యాచార బాధిత బాలికలకు పోక్సో ప్రత్యేక కోర్టుల్లో విచారణను వేగిరం చేయడంతోపాటు వారికి నిర్భయ ఫండ్ నుంచి ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. రంగారెడ్డి జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 100 కేసుల్లో శిక్షలు విధించడమే కాకుండా బాధిత బాలికలకు రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని మంజూరు చేసింది.
పోక్సో కేసుల్లో కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ, ఘటనలు తగ్గకపోవడం ఆందోళనకరం. చిన్నారుల భద్రత కేవలం చట్టాలపై ఆధారపడకుండా కుటుంబాలు, పాఠశాలలు, సమాజం కలిసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ పెరుగుతున్న ప్రమాదం మరింత భయానకంగా మారే అవకాశం ఉంది.


Read More
Next Story