గలీజు ముఠా గుట్టు రట్టు..  అబిడ్స్ సెక్స్ రాకెట్..
x
లాడ్జీని చెక్ చేస్తున్న పోలీసులు

గలీజు ముఠా గుట్టు రట్టు.. అబిడ్స్ సెక్స్ రాకెట్..

కూడు లేని, గూడు లేని పక్షుల్ని వేటాడి డబ్బు ఆకలి తీర్చుకునే ముఠా గుట్టురట్టయింది. ఒకళ్లా ఇద్దరా 16 మందితో 'వ్యాపారం' చేస్తున్నాడో వ్యక్తి..


హైదరాబాద్.. రాంనగర్.. అందరికీ అనువైన ప్రాంతం. ఆకు రౌడీల మొదలు అమాత్యుల వరకు అందరికీ ఆవాసం. అటువంటి చోట పుట్టిందో నడమంత్రపు పురుగు. పేరు అఖిల్ పహిల్వాన్. తెల్లారేపాటికి డబ్బు సంపాయించాలన్న యావలో మురికి కూపంలోకి దిగాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. అతన దిగడమే కాకుండా అనేకమందిని ఆ రోంపిలోకి దింపి ఇప్పుడు లబోదిబో మంటున్నాడు. జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్ అబిడ్స్‌లో వెలుగు చూసిన సెక్స్ రాకెట్‌లో వెలువడుతున్న సంచలన విషయాలు చూస్తుంటే కడుపు కక్కుర్తికి ఇంతలా దిగజారాలా అనిపిస్తోంది. అబిడ్స్ పోలీసు ఇనస్పెక్టర్ నరసింహరాజు చెప్పిన దాని ప్రకారం ‘ఈ కేసులో ప్రధాన సూత్రధారి అఖిల్ పహిల్వాన్‌. టాలీవుడ్‌తో పాటు బుల్లితెరకు చెందిన పలువురు సెలబ్రెటీలతో ఉన్న సన్నిహిత పరిచయాలపై ఆరా తీస్తున్నారు’.


రాంనగర్ లో పుట్టిపెరిగిన ఈ పహిల్వాన్ చిన్నప్పటి నుంచి వస్తాదే. డబ్బు సంపాయించాలన్న యావ ఎక్కువ. అందుకు ఇతరుల ఆర్ధిక అవసరాలను ఆసరా చేసుకున్నారు. వ్యభిచారం సులువైన మార్గంగా ఎంచుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన మిత్రులు కొందర్ని గుంపుగా చేసి అబిడ్స్ లోనే ఓ లాడ్జిని కేంద్రం చేసుకున్నాడు.

రాంనగర్ ప్రాంతానికి చెందిన అఖిల్పహిల్వాన్ తన స్నేహితుడైన రఘుపతితో కలిసి కొంతకాలంగా హైదరాబాద్‌లో సెక్స్రాకెట్ నడుపుతున్నాడు. వెస్ట్బెంగాల్‌కు చెందిన నిరుపేద కుటుంబాల్లోని యువతులను ఆన్లైన్ ద్వారా సంప్రదించి హైదరాబాద్ వచ్చి తాము చెప్పినట్టుగా చేస్తే రోజుకు 15 నుంచి 25వేల రూపాయలు సంపాదించుకోవచ్చని ఉచ్ఛులోకి లాగేవాడు. బస, ఇతరత్రా ఏర్పాట్లు తానే చేస్తానని చెప్పేవాడు. మొత్తం 16 మంది యువతులను పశ్చిమ బెంగాల్ నుంచి రప్పించారు. వీరందరినీ అఖిల్ పహిల్వాన్ అబిడ్స్‌‌లోని ఫార్చూన్ లాడ్జీలో బస చేయించాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే లాడ్జీలో 25 గదులు ఉండగా 16 గదులను అఖిల్ పహిల్వాన్ బుక్ చేయటం. ఎలాంటి ఆధార పత్రాలు లేకుండానే యువతులకు బస కల్పించటం. ఇలా లాడ్జీలో దిగిన యువతుల వద్దకు అఖిల్ పహిల్వాన్ అతని సహచరుడు రఘుపతి కస్టమర్లను పంపిస్తూ వ్యభిచారం జరిపిస్తున్నారు. పక్కా సమాచారం అందటంతో లాడ్జీపై దాడి జరిపిన పోలీసులు 16మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

డొంక ఎలా కదిలిందంటే...

ఈ 16మందిలో ఓ యువతి ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆమె నిజంగానే ఏదైనా మంచి ఉద్యోగమేమోనని వచ్చారు. అసలు విషయం తెలియడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వలపన్ని ఈ ముఠాను పట్టుకున్నారు. విచారణలో తేలిందేమిటంటే ఈ రాకెట్ నడుపుతున్న వారు అఖిల్ పహిల్వాన్, రఘుపతి అని గుర్తించారు. వాళ్లిద్దర్నీ అరెస్టు చేశారు. వీళ్లతో మరో నలుగుర్ని కూడా అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న యువతులను రిహాబిలేషన్ సెంటర్‌కు తరలించారు. నిందితుల నుంచి 22 సెల్ఫోన్లు సీజ్ చేశారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న అఖిల్, రఘుపతిని విచారించినపుడు చాలా విషయాలు బయటకు వచ్చాయన్నారు అబిడ్స్ సీఐ నరసింహరాజు. అఖిల్ పహిల్వాన్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లోని వివరాలను విశ్లేషిస్తున్నారు. ఫోన్లో ఉన్న టాలీవుడ్, బుల్లితెర నటీనటుల నెంబర్లకు ఈ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. దాంతో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు యువతుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్టు తేలింది. దీనిపై అబిడ్స్ ఇనస్పెక్టర్ నర్సింహ రాజుతో మాట్లాడగా ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అఖిల్పహిల్వాన్ టాలీవుడ్, బుల్లితెర నటులకు అమ్మాయిలను సప్లై చేసినట్టుగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదన్నారు. అయితే, అతని సెల్ఫోన్లో పలువురు సెలబ్రెటీల నెంబర్లు ఉన్నట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో వెలుగు చూసిన సెక్స్రాకెట్‌తో ఎవరైనా నటులకు సంబంధాలు ఉన్నాయా?, అఖిల్పహిల్వాన్ ద్వారా ఎవరైనా నటులు యువతులను పిలిపించుకున్నారా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఈ గలీజు ముఠా దొరకడం మంచి పరిణామమే అయినా మా రాంనగర్ కి చెడ్డపేరు తీసుకువచ్చారని ఆ ప్రాంత నివాసి సీహెచ్ శ్రీనివాస్ వాపోయారు.

Read More
Next Story