
హైదరాబాద్‌లో సంచలనం రేపుతున్న బండి ‘అబ్‌స్కాండింగ్ ’ పోస్టర్లు
నోటీసులు నిందితుడి ఇంట్లో ఇవ్వకుండా మేనమామ పేరుతో మేనమామ ఇంట్లో ఎందుకు ఇచ్చారు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో పోస్టర్లు సంచలనం రేపుతున్నాయి. ఆ పోస్టర్లలో ఏమున్నాయంటే కేంద్ర మంత్రి బండి సంజయ్, కొడుకు బండి భగీరథ అబ్‌స్కాండింగ్ అనుంది. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలనే రిక్వెస్టుంది. పోస్టర్ల వెనుక కథ ఏమిటంటే ఈనెల 8వ తేదీన బండి భగరీథ మీద పేట్ బషీర్ బాగ్ పోలీసుస్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ఏమిటంటే తనపైన భగీరథ లైగింకదాడి చేశాడంటు ఒక మైనర్ బాలిక ఫిర్యాదుచేసింది. మైనర్ బాలిక కావటం అందులోను లైంగిక దాడి అని ఫిర్యాదు రావటంతో పోలీసులు భగీరథపై పోక్సో కేసు నమోదుచేశారు.
బాలిక ఫిర్యాదు చేయటంతో పోలీసులు తనపైన పోక్సో కేసు నమోదుచేశారన్న విషయం తెలిసిన నిందితుడు వెంటనే బాలికతో పాటు అమ్మాయి తల్లిపైన కరీంనగర్ పోలీసులకు హనీట్రాప్, బ్లాక్ మెయిలింగ్ అనే ఫిర్యాదుచేశాడు. పోలీసులు ఈ ఫిర్యాదును కూడా నమోదుచేసుకుని కేసుకట్టారు. అయితే అప్పటినుండి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి మీద ఫిర్యాదుచేసిన బాలిక ఏమో పోలీసు విచారణక అందుబాటులో ఉన్నపుడు, బాలిక, తల్లి మీద ఫిర్యాదుచేసిన నిందితుడు మాత్రం ఎందుకు పరారీలో ఉన్నాడు అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇక్కడే పోలీసుల వైఖరి రాజకీయ వివాదానికి దారితీసింది.
నిజానికి ఎవరిమీదైనా పోక్సో నమోదైతే వెంటనే పోలీసులు అతడిని వెంటనే అరెస్టు చేస్తారు. అరెస్టులో విచారించి తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. కాని ఇక్కడ పోలీసులు భగీరథను అదుపులోకి తీసుకుని విచారించలేదు. అలాగే అరెస్టుచేసి కోర్టులోనూ ప్రవేశపెట్టలేదు. కారణం ఏమిటంటే నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండ సంజయ్ కొడుకు అవటమే అని ప్రతిపక్షాలు గోల మొదలుపెట్టాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కొడుకుకు మద్దతుగా ఉన్నాడు కాబట్టే పోలీసులు కూడా కేసును సీరియస్ గా తీసుకోవటంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తో పాటు పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అలాగే సీపీఐ మాజీ ఎంఎల్ఏ చాడ వెంకటరెడ్డి కూడా రేవంత్ పై ఆరోపణలు చేశారు.
ప్రతిపక్షాల ఆరోపణలను తప్పించుకునేందుకు రేవంత్ కేసు విచారణకు ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేశాడు. అయితే సిట్ అధికారులు భగీరథ్ కు విచారణకు రావాలని నోటీసు ఇవ్వటం కూడా వివాదాస్పదమైపోయింది. నిందితుడిని పట్టుకుని అరెస్టుచేయకుండా పెళ్ళిపత్రిక ఇచ్చినట్లు నోటీసులు ఇవ్వటం ఏమిటనే హేళనలు పెరిగిపోతున్నాయి. గడచిన మూడురోజులుగా నిందితుడు ఎక్కడున్నాడనే విషయం పోలీసులకు తెలీదు. ఫోన్ స్వచ్చాఫ్ అని వస్తోందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి కోసం వెతుకుతున్నామని చెబుతున్న పోలీసులు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని మేనమామ ఇంట్లో నోటీసులు ఇచ్చారు. ఇక్కడే పోలీసుల వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిందితుడిని విచారణకు రమ్మని చెప్పిన పోలీసులు నోటీసులు నిందితుడి ఇంట్లో ఇవ్వకుండా మేనమామ ఇంట్లో ఎందుకు ఇచ్చారు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి పోలీసుల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. పోలీసుల వైఖరిపై తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కూడా మండిపోతున్నారు.
ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఉదయమే బండి సంజయ్, బండి భగీరథ ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. అబ్‌స్కాండింగ్ అంటు పోస్టర్లు కనబడటంతో ఒక్కసారిగా నగరంలో సంచలనం రేగింది. తప్పుచేస్తే తన కొడుకైనా సరే శిక్షించాల్సిందే అని చెబుతున్న బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నాడో తెలీదని చెప్పటాన్ని ఎవరూ నమ్మటంలేదు. అందుకనే కేంద్రమంత్రిని కూడా జనాలు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పార్టీ నేతలు నోరిప్పటంలేదు. పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతు ‘‘అది వాళ్ళ కుటుంబ వ్యవహారమని, దీనితో పార్టీకి ఏమీ సంబంధంలేదు’’ అని స్పష్టంచేశారు. ఇంతకు మించి మాట్లాడటానికి ఏ బీజేపీ నేత కూడా ఇష్టపడటంలేదు. మరి మధ్యాహ్నం 2 గంటలకు భగీరథ్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది చూడాలి.

