కమిషనర్ ఆఫీసులో ఏసీబీ దాడులు.. రూ.కోట్ల అవకతవకలు
x

కమిషనర్ ఆఫీసులో ఏసీబీ దాడులు.. రూ.కోట్ల అవకతవకలు

సత్తుపల్లి మున్సిపాలిటీలో ఆదాయ సేకరణలో లోపాలు, అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన ఏసీబీ అధికారులు.


సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో భారీ ఆర్థిక లోపాలు బయటపడ్డాయి. ఆదాయ సేకరణలో కోట్ల రూపాయల తేడాలు, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. మార్చి 31, 2026న ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సడెన్ చెక్ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ పన్నులు, మొత్తం నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ సేకరణలో పెద్ద ఎత్తున లోటు ఉన్నట్లు గుర్తించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద వసూలు కావాల్సిన రూ.14.44 కోట్లలో కేవలం రూ.1.30 కోట్లు మాత్రమే వచ్చినట్లు తేలింది. భారీ మొత్తంలో బకాయిలు మిగిలినట్లు అధికారులు గుర్తించారు.

ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా లక్ష్యానికి తగ్గట్టు వసూళ్లు జరగలేదని వెల్లడైంది. ప్రకటన పన్ను వసూళ్లు దాదాపు లేనట్టే ఉన్నట్లు తేలింది. మొత్తం రూ.22.23 కోట్లలో రూ.7.99 కోట్లు మాత్రమే వసూలై, మిగతా మొత్తం పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్ల పరిశీలనలో అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయి. కలెక్టర్‌గా పనిచేస్తున్న నాగుబండి నరసింహరావు ఫోన్‌లో, మేనేజర్ ఎం. శ్రీనివాస్‌తో పాటు మరికొంత మందితో జరిగిన లావాదేవీలు సందేహాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ లావాదేవీలపై మరింత విచారణ అవసరమని అధికారులు తెలిపారు.

రికార్డుల నిర్వహణలో కూడా లోపాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. మొత్తం వ్యవహారంపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ తనిఖీలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, బాధ్యులపై చర్యలు సూచించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అవినీతి గురించి సమాచారం ఇవ్వాలని, టోల్ ఫ్రీ నంబర్ 1064తో పాటు వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఏసీబీ సూచించింది.

Read More
Next Story