హైదరాబాద్-విజయవాడ హైవే మీద అక్కడే ఎపుడూ  యాక్సిడెంట్లు, ఎందుకు?
x

హైదరాబాద్-విజయవాడ హైవే మీద అక్కడే ఎపుడూ యాక్సిడెంట్లు, ఎందుకు?

హైదరాబాద్- విజయవాడ NH 65 పై ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఈ రహదారి మీద ఒక చోట మృత్యువు ఎవరినైనా కబళించేందుకు కాచుకుని ఉంటుంది.


(ఫెడరల్ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)

నల్గొండ: ఎస్ నవీన్ రాజు (29), భార్గవి (24) దంపతులు. నవీన్ విజయవాడలోని ఒక కార్పొరేట్ కాలేజీ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఈ నెల 20న కూతురు భార్గవి పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లో తల్లిదండ్రుల సమక్షంలో రాత్రంతా నిర్వహించుకున్నారు. ఈనెల 21న ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఉదయం 8 గంటల సమయంలో మునగాల మండలం ముకుందాపురం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించారు.

అదేవిధంగా ఈనెల 25న హైదరాబాద్ నుంచి విజయవాడకు అర్థరాత్రి దాటక మరొక ఘోరప్రమాదం జరిగింది. ఒక కుటుంబం పుట్టు వెంటుక్రలు తీయించే కార్యక్రమానికి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరింది. కోదాడ సమీపంలోకి రాగానే రహదారి పక్కన ఆపిన లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఏకంగా 6 మంది అక్కడికక్కడే మరణించారు. కారును కృష్ణంరాజు అనే డ్రైవర్ నడుపుతున్నాడు. ఈ రెండు ప్రమాదాలు కామన్ గా కనిపించే విషయాలు: రెండు కార్లు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. రెండు కారు ప్రమాదాలు ఆగిఉన్న మరొకవాహనాన్ని ఢీ కొనడంతో జరిగాయి. రెండింటిలో కూడా డ్రైవర్లకు నిద్రలేమి కారణంగా కారు డ్రైవ్ చేస్తున్నపుడు తూలడం కనిపిస్తంది. రెండు కార్లు ప్రమాదాలు కూడా మునగాల మండలం ముకుందాపురం గ్రామ పరిసరాల్లోని హైవై మీదే జరిగాయి.

ఇక్కడ గతంలో జరిగిన ప్రమాదాలను చూస్తే ఈ ప్రాంతంలో దాదాపు 44.8 కిమీ పరిధి హైవే మీదే ఈ ప్రమాదాలు జరుగుతునట్లు కనిపిస్తుంది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి (NH 65). నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో అది ఒకటి. ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారి పొడవు అక్షరాల 247 కిలోమీటర్లు. అయితే ఈ రహదారి మీద ఒక చోట మృత్యువు ఎవరినైనా కబళించేందుకు కాచుకుని ఉంటుంది.

మృత్యువు మాటేసి ఉండేదిక్కడే...

ఈ ప్రమాదాలను చూస్తే సూర్యాపేట నుంచి కోదాడ వరకు 44.8 కిలోమీటర్ల మధ్యలోని జాతీయ రహదారి మీద మృత్యువు కోరలు చాచి కాచుకుని ఉందని పిస్తుంది. ఆ ప్రమాదాలు ఒక్కటో.. రెండో కాదు. నాలుగు నెలల కాలంలోనే 200కు పైగా రోడ్డు ప్రమాదాలు ఈ 44.8 కిమీ పరిధిలోనే జరిగాయి.

ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది వరకు తీవ్రంగా గాయపడి దివ్యాంగులుగా మిగిలిపోయారు.ఈ స్ట్రెచ్ లో కూడా , ప్రధానంగా మునగాల మండల పరిధిలోనే తరచూ ఎక్కడో ఒక చోట ప్రమాదం చోటుచేసుకుంటూ ఉండటం గమనించాలి.

ఈ ప్రమాదాలకు కారణం ఏంటో తెలుసా.

వాహనదారులు, డ్రైవర్లు నిద్రలేమి వల్ల ప్రమాదాల బారిన పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. నిజానికి రోడ్డు ప్రమాదం అంటే ఒక్కరిద్దరూ మరణించడం కాదు. కుటుంబాలకు కుటుంబాలుమాయమవడమో, రోడ్డున పడడమే .

హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోవాలనుకునేవారికి ఇదే ప్రధాన రహదారి. వాస్తవానికి హైదరాబాద్ మహానగరంలో ఉన్న కోస్తాంధ్ర సెటిలర్లంతా తమ వూర్లకు విజయవాడ మీదుగానే చేరుకుంటుంటారు. తెల్లవారేసరికి విజయవాడకు చేరుకునే విధంగా వాళ్లు ప్రయాణం ప్లాన్ చేసుకుంటారు. దీనికోసం హైదరాబాద్ అర్థరాత్రి బయలు దేరాలి. విజయవాడ నాలుగయిదు గంటల ప్రయాణం. అంటే తెల్లవారేసరికి విజయవాడలో ఉండాలనుకునే వాళ్లు ఆర్థరాత్రి 12 కో, తెల్లవారుజామున ఒంటిగంటకో బయలు దేరాలి.

హైదరాబాద్ నుంచి విజయవాడకు 247 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. దీంతో అప్పుడప్పుడే తెల్లవారు జాము చల్లదనం మొదలవుతూ ఉంటుంది. డ్రైవింగ్ చేసే వారికి ఈ చల్లిగాలి సోకగానే నిద్ర ముంచుకొస్తుంది. తూలుడు మొదలవుతుంది. త్వరగా గమ్యానికి చేరుకోవాలనే ఆదుర్దాతో ఈ నిద్రని అణచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం విఫలమయి నిద్ర ముంచుకొంచి ఒక్క సారి తూలితే చాలు... జరిగేది ఘోర ప్రమాదం. నళీని భార్గవి ఇలాంటి ప్రమాదంలోనే చనిపోయారు. ఇదే విధంగా డ్రైవర్ కృష్ణం రాజు నిద్ర మరొక కుటంబం మృత్యువాత పడేందుకు కారణమయింది. ఈ ప్రమాదాలలో గమనించాల్సిన మరొక విషయం. హైదరాబాద్ నుంచి వేగంగా దూసుకుపోతున్న కార్లు పార్కింగ్ చేసిన లారీలు, కంటైనర్లను ఢీకొనడం వల్ల జరిగాయి.

జాతీయ రహదారి వెంట లారీలు, ట్రక్కులు, కంటైనర్లను పార్క్ చేసి ఉండటం సహజం. అతివేగంలో ప్రయాణించే వాహనాలు వాటిని గుర్తించకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై జరిగే ప్రతి ప్రమాదంలో ఒక్కరైనా మరణిస్తున్నారని అంబులెన్స్ డ్రైవర్ రాంబాబు ‘ఫెడరల్ తెలంగాణ’ చెప్పారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సూర్యాపేట జిల్లా పరిధిలో దాదాపు 200కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా మరణించారు. మరో 200 మంది ప్రమాదంలో గాయపడ్డారు. సూర్యాపేట- కోదాడ మధ్యలో జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే స్పందిస్తూ నిద్రలేమి సమస్యతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. “వాహనం నడిపే వ్యక్తులకు సరైన నిద్ర ఉండట్లేదని మా విచారణలో తేలింద,” అని ఆయన తెలిపారు.

అదే సమయంలో జాతీయ రహదారి వెంట లారీలను, కంటైనర్లను రాత్రివేళ్లలో నిలిపి ఉంచి ఉంటారు. ఈ కార్లు వాటిని ఢీకొంటూ ఉండటంవల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మునగాల మండలానికి చెందిన కోట వర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రసాద్ అనేక ప్రమాదాలను కళ్లారా చూశాడు.

Read More
Next Story