
ఆదికవి నన్నయ యూనివర్శిటీ మీద అన్నీ అనుమానాలే...
ఆరోపణలమీద దర్యాప్తు చేయిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ హామీ
ఆంధ్రప్రదేశ్, రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మీద ఈ రోజు అసెంబ్లీలో ఆసక్తికరమయిన చర్చ జరిగింది. యూనివర్శిటీ అవకతవకల పుట్టని పలువురు సభ్యులు ఆరోపించారు. దీని మీద విచారణ జరగాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ చర్చకు స్పందిస్తూ యూనివర్శిటీ అక్రమాలకు సంబంధించి ఆధారాలు పంపితే తప్పనసరిగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కళాశాలల అనుమతుల్లో అవకతవకలపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమధానమిస్తూ, "గతంలో ఈ విషయమై ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు పొందిన కళాశాలల వివరాలు పంపితే చర్యలు తీసుకుంటాం. అఫ్లియేషన్ కు ఒక్కొక్క యూనివర్సిటీ పరిధిలో ఒక్కో విధానం పాటిస్తున్నారు. దానిని స్టాండర్డైజ్ చేయడానికి యూనిఫైడ్ యాక్ట్ తేవడానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది,’’ అని చెప్పారు.
అఫ్లియేషన్ స్ట్రీమ్ లైన్ చేసి డిజిటలైజేషన్, జియోట్యాగింగ్, ఫోటోస్, వీడియోస్ తో సహా ఆన్ లైన్ లైన్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని త్వరలో పకడ్బందీ నిబంధనలు రూపొందించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామక ప్రక్రియ చేపడతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ నన్నయ్య వర్సిటీ ప్రతిష్టాత్మకమైనదని, 400కుపైగా అఫ్లియేటెడ్ కళాశాలలు ఉన్న ఏకైక యూనివర్సిటీ అని చెప్పారుు.
"గత ప్రభుత్వంలో మితిమీరిన అక్రమాలు జరిగాయి. ఏవిధమైన మౌలిక సదుపాయాలు, కావాల్సిన సిబ్బంది లేకుండా ముడుపులు తీసుకొని అధికారులు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకే అధ్యాపకుడు అయిదారు కాలేజీల్లో కూడా పనిచేస్తున్నట్లు చూపి అనుమతుల ఇచ్చారు. యూనివర్సిటీ అధికారులు కుమ్మక్కై ఈ అవకతవకలకు పాల్పడి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వాన విద్యావ్యవస్థలో ప్రక్షాళన తెస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అధికారులు అక్రమాలకు పాల్పడటం దారుణం,‘‘ అని అన్నారు.
మరిన్ని ఆరోపణలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ, "అనుమతులు ఇచ్చే సమయంలో టెంపరరీ సినిమా సెట్టింగ్ వేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు కుమ్మక్కై అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రతి మూడేళ్లకు ఒకసారి మారుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నన్నయ్య యూనివర్సిటీకి కౌన్సిల్ నియమించారు. మంత్రి అనుచరుడు ఒకరు, మాజీ ఎమ్మెల్యే మామ ఒకరిని సభ్యులుగా నియమించారు. వీరితో యూనివర్సిటీ అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. నన్నయ యూనివర్సిటీ ఏర్పాటు నుంచి అవకతవకలకు అడ్డాగా మారింది," అని అన్నారు.
టెండర్ల విషయంలో వారికి నచ్చిన వారికి టెండరు దక్కేలా నిబంధనలు అధికారులు రూపొందిస్తున్నారని ఆరోపణచేస్తూ వారి అక్రమాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మద్దతు ఇస్తోందని బలరామకృష్ణ అన్నారు.
"గత ప్రభుత్వంలో అక్రమాలకు రాచబాట వేశారు. గతంలో చేపట్టిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. బిల్లులు మాత్రం పెద్దఎత్తున డ్రా చేసుకున్నారు. ఫీజుల విషయంలో డీడీలు క్లోనింగ్ చేసి దారుణమైన దోపిడీకి పాల్పడ్డారు. ఎగ్జామినేషన్ ఫీజుకు ఇచ్చిన ఒకే డీడీని పదిహేను కాలేజిలకు అదే నెంబరుతో సబ్మిట్ చేశారు. సీనియర్లను పక్కనబెట్టి చాలామంది జూనియర్లకు ప్రమోషన్లు ఇస్తున్నారు, చర్యలు తీసుకోవాలి,’’ అని ఎమ్మెల్యే బలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

