పాకెట్ మనీతో ఖడ్గమృగం దత్తత : పాఠశాల పిల్లల గొప్ప మనసు
x
జూపార్కులో ఖడ్గమృగం దత్తత

పాకెట్ మనీతో ఖడ్గమృగం దత్తత : పాఠశాల పిల్లల గొప్ప మనసు

ఖడ్గమృగానికి అండగా నిలిచిన పాఠశాల విద్యార్థులు


పాకెట్ మనీతో వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పాటునిస్తూ పాఠశాల విద్యార్థులు ఆదర్శంగా నిలిచారు. చిన్నారులైనప్పటికీ వన్యప్రాణుల సంరక్షణలో పెద్ద మనసు చాటుకున్నారు ఫోకస్ హైస్కూల్ విద్యార్థులు.

హైదరాబాద్ నగరంలోని నూర్ ఖాన్ బజార్ కు చెందిన ఫోకస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వన్యప్రాణుల సంరక్షణ, పెంపకం కోసం ముందుకు వచ్చి గొప్ప ఉదారతను చూపించారు.ఈ పాఠశాల విద్యార్థులు తమ పాకెట్ మనీ డబ్బు నుంచి రూ.30వేలను నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని ఖడ్గమృగం ఆలనా పాలన కోసం విరాళంగా అందించారు.

ఫోకస్ హైస్కూలు విద్యార్థులు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో కలిసి శుక్రవారం జూపార్కును సందర్శించి ఖడ్గమృగాన్ని మూడు నెలల పాటు దత్తత తీసుకున్నారు. ఖడ్గమృగం ఆలనా పాలన కోసం 30వేల రూపాయల చెక్కును జూపార్కు క్యూరేటర్ జె వసంతకు విద్యార్థులు అందజేశారు. పాకెట్ మనీ డబ్బుతో ఖడ్గ మృగాన్ని దత్తత తీసుకున్న విద్యార్థులను జూ క్యూరేటర్ వసంత అభినందించారు. ఈ కార్యక్రమంలో వాఠశాల విద్యార్థులతోపాటు జూ డాక్టర్ ఎం.ఎ. హకీమ్, పాఠశాల హెడ్ సయ్యద్ ముస్తఫా హుస్సేన్,వైస్ ప్రిన్సిపాల్ కనిజ్ ఇ జెహ్రా , కోఆర్డినేటర్ సయ్యదా జహనారా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా చిన్న వయసులోనే వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఫోకస్ హైస్కూల్ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారు.పాకెట్ మనీతో చేసిన ఈ చిన్న సహాయం, వన్యప్రాణుల సంరక్షణలో పెద్ద సందేశంగా నిలిచి, భవిష్యత్ తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.

Read More
Next Story